పట్టభద్రుల తీర్పు...... ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణికి చెంపపెట్టు.

                         
ఆంద్రప్రదేశ్ లో తాజాగా జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పక్షానికి విద్యావంతులు తమలో గూడుకట్టుకున్న అసంతృప్తిని ఓట్లరూపంలో వెళ్లగక్కారు. అధికార పక్షం అంచనాలు తలక్రిందులుగా చేస్తూ ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం పార్టీ బలపరిచిన అభ్యర్థులను పెద్దల సభకి పంపారు. తమ సమస్యలపై, ప్రయోజనాల పై పోరాటం చేస్తారని పట్టభద్రులు కసితో ఓట్లు వేసి గెలిపించారు అని విజయం సాధించిన అభ్యర్థుల మెజారిటీలను పరిశీలిస్తే ఇట్టే అర్థం అవుతుంది.


2019 లో పట్టం:


జగన్ సారథ్యంలోని వైకాపా అధికారంలోకి రావడానికి కీలక పాత్ర పోషించిన వారిలో యువత ముందు వరుసలో ఉంటారు. వారి మనసు చూరగొనడానికి నాటి ప్రతిపక్ష నేత అయిన జగన్ యువభేరీలు నిర్వహిస్తూ తాను మాత్రమే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తేవగలను అని, లక్షల్లో ఖాళీగా ఉన్న సర్కారు ఉద్యోగాలను ప్రతి సంవత్సరం జనవరి ఒకటవ తేదీనే యుపియస్సి(upsc) వలే జాబ్ కేలండర్ ప్రకటించి క్రమం తప్పకుండా భర్తీ చేయగలను అని, ప్రత్యేకహోదా ఉంటేనే మన యువతకు ఉద్యగలు అని యువత  వద్ద ఉద్వేగబరిత ప్రసంగాలు చేశారు. నిజాయితీ కి మారుపేరు అని, మాట తప్పను మడమ తిప్పని అని తనని తాను పొగుడుకునే జగన్ అధికారం చేజిక్కాక మాత్రం యువత విషయంలో, మరీ ముఖ్యంగా సర్కారు కొలువుల భర్తీ విషయంలో పూర్తిగా విఫలం అయ్యారు. దీంతో పట్టభద్రుల ఓటర్లలో కీలకం అయిన ఉద్యోగార్థులు తమకు జరుగుతున్న అన్యాయాన్ని ముఖ్యమంత్రి కి తెలిసేలా తమకు అంది వచ్చిన అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకున్నారు అనడం లో అతిశయోక్తికాదు.


నిరుద్యోగులకు గుదిబండగా మారిన సచివాలయం వ్యవస్థ:


జగనన్న ఇచ్చిన మాట తప్పడు, అన్న వచ్చాక భారీగ గ్రూప్ 1,2 పోస్టుల భర్తీ  ఉంటుంది ,ప్రభుత్వం ఉద్యోగం సాదించుకుని కొత్త జీవితంలోకి అడుగు పెట్టాలి అని ఆశగా ఎదురు చూసిన ఉద్యోగార్థులకి తీవ్ర నిరాశ ఎదురైంది. ఇతర హామీలని క్రమంగా నేరవేరుస్తూ వస్తున్న ముఖ్యమంత్రి జగన్ ఉద్యోగాల భర్తీ విషయంలో ఏమైందో ఏమోగానీ పెడ చెవిన పెట్టారు.

గ్రూప్ ఉద్యోగాల భర్తీ పట్ల నిర్లక్ష్య ధోరణికి కారణం భారీ ఎత్తున చేపట్టిన గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగాల భర్తీ అని చెప్పవచ్చు. ఎన్నికల హామీలో  చెప్పినట్లు గానే సచివాలయ వ్యవస్థను ప్రభుత్వం ఏర్పడిన ఆరు నెలల్లోనే ఏర్పాటు చేసి జగన్ తన నిజాయితీకి ఎవరూ సాటి రారు అని  పరోక్షంగా ప్రతిపక్ష పార్టీలకు తెలియజేసారు. నాడు జరిగిన కని విని ఎరుగని కొలువుల కోలాహలం చూసి ప్రతిపక్ష పార్టీలకు గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి అనేది సత్యం. గ్రామ సచివాలయ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పై ఎన్నో అనుమానాలు, ఆరోపణలు వచ్చినప్పటికీ ప్రభుత్వం తాను అనుకున్న విదంగానే భర్తీ ప్రక్రియ పూర్తి చేసి దాదాపు లక్ష మందికి పైగా యువతకు ప్రభుత్వ కొలువు కోరిక తీర్చింది. ఇక్కడే అసలు సమస్య మొదలైంది. ఎప్పుడైతే భారీ గ్రామ,వార్డు సచివాలయ నియామకాలు చెప్పట్టారో ముఖ్యమంత్రి దగ్గరి నుంచి గ్రామ స్థాయి నేతల వరకు తాము నిరుద్యోగ యువత కు ఇచ్చిన కొలువుల భర్తీ హామీ నెరవేర్చిన హామీగా లెక్కలేసుకున్నారు. అందుకేనేమో జాబ్ కేలండర్ హామీని అటకెక్కించారు. దీని పర్యావసానంగా ఉద్యోగార్థులు వేయి కళ్లతో ఎదురు చూసిన గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 నియామకాలపై తీవ్ర ప్రభావం చూపింది.


పక్క రాష్ట్రం ప్రభావం:


తోటి తెలుగు రాష్ట్రం తెలంగాణ లో గత ఏడాది నుంచి కొలువుల జాతర కొనసాగుతుంది. అంతకుముందు వరకు ఆ రాష్ట్రంలో నియామకాల కోసం ఎదురు చూసిన యువతకు గత ఏడాది నుంచి తెలంగాణ సర్కారు వరుస నోటిఫికేషన్లతో యువతను పరుగు పెట్టిస్తోంది. పబ్లిక్ లైబ్రరీలు అన్నీ కిటకిటలాడుతున్నాయి. వాటి ప్రభావం ఆంద్రప్రదేశ్ లోని నిరుద్యోగులపై తీవ్రంగా చూపించిందని పోలైన ఓట్ల సరళి,మెజారిటీ తీరు తెలియజేస్తుంది. ప్రతి ఆంగ్ల కొత్త సంవత్సరం రోజు ప్రభుత్వం నుంచి జాబ్ కేలండర్ రూపంలో తీపి కబురు వినాలి అనుకున్న ప్రతి సారి తీవ్ర నిరాశే మిగిలింది. తమ తోటి తెలంగాణ నిరుద్యోగులు ఉద్యోగ సాధనలో నిమగ్నమయుంటే ఆంధ్ర ప్రాంతం వారు మాత్రం తమకు జరుగుతున్న అన్యాయాన్ని ఎవరికి చెప్పుకోవాలో తెలియక నిరాశ్రయులగా మిగిలిపోయారు.

తమ నిరసన గళం తెలియజేయడానికి హైదరాబాద్ నుంచి రైళ్లలో విజయవాడకు వచ్చి ధర్నాలు,ఆందోళనలు చేయాల్సిన దుస్థితి ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులది. మరోవైపు పోలీసులతో ఉక్కుపాదం మోపుతున్న ఆంధ్రప్రదేశ్ సర్కారు తమపై ఎక్కడ కేసులు నమోదు చేస్తుందో అని ,అసలుకే ఎసరు వస్తుంది అని నిరుద్యోగులు ఒకటి రెండు సార్లు మినహా పెద్దగా ఆందోళనలు చేయలేదు.


అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం:-


2019 లో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి మీడియా తో కలిసి ఇష్టాగోష్టిగా మాట్లాడింది లేదు.ప్రజా దర్బార్ లాంటివి నిర్వహించిన దాఖలాలు లేవు. దానితోపాటు మంత్రులకి సైతం జగన్ అపోయింట్మెంట్ దొరకడం కష్టం అని వినికిడి. ఇక ఎమ్మెల్యేల సంగతి దేవుడెరుగు. ఈ క్రమంలో క్షేత్ర స్థాయిలో వాస్తవ పరిస్థితులు ముఖ్యమంత్రి కి తెలియడానికి అవకాశం లేకుండా పోయింది. 151 సీట్లతో అఖండ విజయం,ఆ తర్వాత జరిగిన వివిధ ఎన్నికల్లో విజయంతో మాంచి ఊపు మీద ఉన్న వైకాపా కు,ఆ పార్టీ అధినేత కు నిరుద్యోగుల చిరకాల కోరిక గురించి తెలియజేయడానికి ఈ సమస్య గురించి అవగాహన ఉన్న నాయకులు సైతం సాహసించలేదు. మరో వైపు నిరుద్యోగులకు ప్రతిపక్షాల నుంచి సరైన సహకారం లభించలేదు. దీంతో నిరుద్యోగులే తమ పోరాటాన్ని కొనసాగిస్తున్నారు.

ఆర్థ శాస్త్ర నిపుణుడు, వేలాది మంది కి పోటీ పరీక్షల నిమిత్తం ఆర్థ శాస్త్రాన్ని బోధించిన ,నిరాడంబర వ్యక్తి ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం బలపరిచిన అభ్యర్థిగా పోటీలోకి దిగుతుండడం తో నిరాశ,నిస్పృహలతో అచేతనంగా ఉన్న నిరుద్యోగులకు తమ గొంతుక వినిపించే అవకాశం, తమ అసంతృప్తి ని తాడేపల్లి లో ఉన్న ముఖ్యమంత్రి కి సైతం తెలియజేసే అవకాశం ఉందని భావించి తమకు అందివచ్చిన అవకాశాన్ని చాలా నేర్పుగా వినియోగించుకున్నారు అనేది సుస్పష్టంగా తెలుస్తోంది. దానితో పాటు అధికార పార్టీ క్లీన్ స్వీప్ చేసిన రాయలసీమ లో సైతం పట్టబద్రుల నియోజకవర్గంలో అధికార పార్టీ అభ్యర్థులు ఓడిపోయారు అంటే యువత గాంధేయ మార్గంలో ప్రజాస్వామ్య బద్దంగా ,ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా తమ దీర్ఘకాల ప్రయోజనాలకోసం ఆలోచించి ఓటు హక్కుని వినియోగించుకోవడం శుభపరిణామం.


ఉద్యోగాలు లేక వలసలు:


అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం అసాధ్యం అని ఒక మంత్రి వ్యాఖ్యానించారు. అది కఠోర వాస్తవం. అయినప్పటికీ పోస్టులు పదుల సంఖ్యలో ఉంటే పోటీ మాత్రం లక్షల్లో ఉంటుంది. వాస్తవానికి ప్రభుత్వ కొలువు కంటే ప్రైవేట్ ఉద్యోగాల్లో ఎక్కువ వేతనాలు లభిస్తున్నాయి. అయినప్పటికీ ఉద్యోగ భద్రత తదితర కారణాల వల్ల సర్కారు కొలువుకే మొగ్గు చూపుతారు ఉద్యోగార్థులు. ప్రైవేటే పెట్టుబడులకు అనుకూల వాతావరణం సృష్టించి ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు సృష్టించాల్సిన గురుతర బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. కానీ ఆంద్రప్రదేశ్ లో ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. రెండవ అతిపెద్ద తీర రేఖ ఉన్నప్పటికీ అనుకున్న స్థాయిలో దాన్ని రాష్ట్రాభివృద్ధికి కోసం వినియోగించలేకపోతుంది ప్రభుత్వం. చాలీ చాలని జీతాలతో ఇతర రాష్ట్రాలలో ప్రధాన నగరాల్లో పనిచేస్తున్నారు. ఇక నిరక్షరాస్యులు జీవనోపాధి కోసం గల్ఫ్ దేశాల బాట పడుతున్నారు. ఇతర ప్రభుత్వ విధానాల వల్ల అసంఘటిత రంగంలో ఉపాది అవకాశాలు చెల్లా చెదురు అయ్యాయి.

మూలధన పెట్టుబడిని విస్మరించి సంక్షేమ చుట్టూనే ప్రభుత్వం ప్రదక్షిణ వల్ల ఉపాది అవకాశాలు సన్నగిల్లాయి. ప్రజల ఆదాయ మార్గాలు లేక రోజు గడవడానికి అప్పులు చేయాల్సిన పరిస్థితి. ప్రభుత్వం బటన్ నొక్కి ఎప్పుడు తమ ఖాతాలో డబ్బులు వేస్తార అని ఎదురు చూస్తున్నారు అంటే ప్రజల ప్రస్తుత పరిస్థితి ఏ విదంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.


తీర్పుని గౌరవించి...నియామకాలు చేపట్టాలి:-


పట్టబద్రుల ఇచ్చిన తీర్పుని గౌరవించి జగన్ సర్కార్ ఇప్పటికైనా తాను ఇచ్చిన ఉద్యోగాల భర్తీ హామీని నెరవేర్చాలి. తమ తప్పుని తెలుసుకోకుండా ఇంకా ప్రతిపక్షాల మీద ఎదురు దాడి చేస్తే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో నిరుద్యోగులు మరోసారి తమ తీర్పు ని చూపిస్తారు. నోటిఫికేషన్లు ఇచ్చి వాటిని త్వరితగతిన పూర్తి చేయాలి. 2021 లో ఇచ్చిన గ్రూప్ 4 నోటిఫికేషన్ ఇంకా పూర్తి కాలేదు. Dsc ఊసే లేదు.  మరోవైపు ప్రభుత్వ సిబ్బంది కొరత వలన ఉద్యోగుల మీద తీవ్ర పని ఒత్తిడి ఉంటుంది. అప్పులు చేసి,కుటుంబానికి దూరంగా ఉంటూ తెచ్చుకున్న కొద్దిపాటి డబ్బుని పొదుపుగా వాడుకుంటూ నోటిఫికేషన్లు వస్తాయి అన్న ఆశతో లక్షలాది నిరుద్యోగులు పోటీ పరీక్షలకు సన్నద్ధం అవుతున్నారు.మరో వైపు వయస్సు రోజు రోజుకు పెరుగుతుంది. వారి ఆశలపై నీళ్లు చల్లోద్దు. వారి ఉసురు తీసుకోవద్దు. ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగాలు భర్తీ చేయాల్సిన నైతిక బాద్యత ప్రభుత్వం మీద ఉన్నది. ఇక పై కూడా వైకాపా ప్రభుత్వం నిరుద్యోగుల పట్ల శీతకన్ను ప్రదర్శిస్తే రాబోవు ఎన్నికల్లో నిరుద్యోగులు కన్నెర్ర చేయాల్సి వస్తుంది.No comments:

Post a Comment