ఆ తమ్ముడు చెప్పిన స్ఫూర్తి మాటలు.

                           



 పోటీ పరీక్షల కోసం నేనూ మరొక స్నేహితుడి తో కలిసి  హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ కి దగ్గర్లో ఒక పెంట్ హౌస్ లో ఉంటున్నాం. రోజూలానే రూమ్ బయట స్టడీ చైర్ వేసుకుని కూర్చున్నాను. ఇంతలో  ఒక తమ్ముడు ఫోన్లో బంజారా భాషలో మాట్లాడుతూ ఉన్నాడు. భాష నాకు తెలియకపోవడం తో నాకు వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో అర్థం కాలేదు. 

"నా పేరు సాయి కృష్ణ ఏం చేస్తున్నావ్ అన్న....తిన్నావ ?" అని ఆ తమ్ముడు మాట కలిపాడు.  నేను కూడా తిన్నా తమ్ముడు, నువ్వు తిన్నావ ? అని ఎదో అడగాలి అన్నట్లు అడిగా.

"నీ ప్రిపరేషన్ ఎలా ఉంది , దేనికి ప్రిపేర్ అవుతున్నావ్ ?" అని నేను అడిగ. 

"నేను ప్రిపరేషన్ కోసం కాదు అన్న, నేను పది వరకే చదివా, ప్రస్తుతం మా ఊర్లో వ్యవసాయం చేస్తున్నా" అని సమాధానం ఇచ్చాడు.

ఎందుకో ఆ సమాధానం విన్నాక పట్టరాని కోపం వచ్చింది. 

"ఎందుకు పదితోనే ఆపేసావ్....ఈరోజుల్లో చదువుకుంటేనే జీవితం........." అంటూ నేను ఒకింత అసహనంగా మాట్లాడా.


దానికి ఆ తమ్ముడు కాసేపు ఆలోచించి నాకు చదువుకోవాలి అని ఉంది కాని నా అదృష్టం బాలేదు అన్నాడు.

"చదువుకోవాలి అని ఆసక్తి ఉంటే చాలు....దానికి అదృష్టం తో పని లేదు" అంటు మరోసారి అసహనంగా మాట్లాడా.

"నేను ఇక్కడికి రక్తం ఎక్కించుకోడాని (blood transfusion)

కి వచ్చా,అది అయిపోయాక ఇంటికి వెళ్ళాలి" అన్నాడు.

"రక్తమా....ఏమైంది?" అడిగాను.

"నాకు తలసేమియా ఉంది....నెలకు రెండుసార్లు హైదరాబాద్ వచ్చి మూడు యూనిట్ల రక్తం ఎక్కించుకుని వెళ్తా ఉంటా" అన్నాడు.

ఆ మాట వినగానే నాకు ఆ తమ్ముడి పరిస్థితి అర్థం అయింది.

తమ్ముడి పరిస్థితి పూర్తగా తెలీకుండానే అసహనంగా మాట్లాడినందుకు నా మీద నాకే అసహ్యం వేసింది.

అప్పటివరకు పేపర్లోనే, టివిల్లోనే  యూట్యూబ్ లొనే ఆ వ్యాధి గురించి చూడటం, వినడమే గాని ప్రత్యక్షంగా చూసింది లేదు.

"నేను 9తోనే చదువు ఆపేసా.....మా అన్న ప్రోత్సాహం తో ఓపెన్ టెన్త్ రాసాను. ఇక ఐదేళ్ల నుంచి వ్యవసాయం చేస్తున్నా" అన్నాడు. 

నాకు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు.

కాసేపు తలసేమియా గురించి నాకు అవగాహన కల్పించాడు. నాకున్న సందేహాలు, అపోహలు కూడా నివృత్తి చేసాడు.

"తమ్ముడు...మాకు చిన్న సమస్య వస్తేనే జీవితాలే ఐపోయినట్లు అనిపిస్తది. ఇప్పుడు చాలా మంది చిన్నవాటికె ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కానీ నువ్వు ఈ విషయం లో ఎలా దిగమింగుకుంటున్నావ్ ? అని నా మనసులో ప్రశ్నను ఆ తమ్ముడు ముందు ఉంచా.

"నా 6 నెలల వయసులో తలసేమియా ఉన్నట్లు గుర్తించారు. కాని ఇప్పుడు అది అంతా గతం. నేను దాని గురుంచి ఆలోచిస్తే ఏం పని చేసుకోలేను. ఒకవేళ దాని గురించి ఆలోచించినా నాకున్న సమస్య ఏమి పోదు కధా. కాబట్టి అవేమి నేను పట్టించుకోను. 15 రోజులకి ఒకసారి హైదరాబాద్ వస్తా రక్తం ఎక్కించుకుని పోత. నా పని నేను చేసుకుంటా" అన్నాడు.

 ఆ మాటలు విన్నాక...నేను ఎంత ఉన్నత స్థితి(ఆరోగ్యం) లో ఉన్నానో కళ్ళకు కట్టినట్లు కనిపించింది. 

"నెలకు ఎంత ఖర్చు అవుతుంది" అను అడిగా.

"సుమారు ₹ 30 వేలు" అన్నాడు.

ఒక వ్యవసాయ కుటుంబం కి నెలకి ఆ ఖర్చు భరించడం నిజంగా చాలా కష్టం. ఆ కుటుంబం, ఆ తల్లిదండ్రులు ఎంత కష్టం అనుభవిస్తున్నారో అని అనిపించింది.

"తమ్ముడూ.... నాకొక ప్రశ్న ఉంది,అడగొచ్చా ?" అని అడిగా.

"అడుగు అన్నా" అన్నాడు ఆ తమ్ముడు.

"నాకు చిన్న సమస్య వస్తేనే, తీవ్ర నిరాశలోకి వెళ్లిపోతున్నా. కాని నీ సమస్య ముందు నాది అసలు సమస్యే కాదు" అని అన్నాను.


"చూడు అన్న.... నేను చేయని తప్పుకి శిక్ష అనుభవిస్తున్న. మా అమ్మ నాన్న మేనరికం వివాహం చేసుకోవడం వల్ల నాకు ఇలా అయింది. అయినా నేను అవన్నీ పట్టించుకుంటే నాకున్న ఈ చిన్న జీవితం కూడా ఉండదు. నిన్న ఏం జరిగింది అనేది నాకు అనవసరం.నేను చేయగలిగింది చేస్తున్నా. మా అమ్మ,నాన్న,అన్నయ్య నన్ను బాగానే చూసుకుంటారు. అయినా నాకేమి సమస్య ఉంది. నాకు రక్తం క్రమంగా ఎక్కించుకుంటే మీకంటే ఎక్కువ శక్తితో,ఉత్సాహంతో పని చేస్తా" అన్నాడు.

ఆ మాటలు విన్నాక నా మనసు చాలా తేలిక అనిపించింది.

పెళ్లి విషయం లో ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి మొదలగు విషయాలు చెప్పాడు.

ఆ తమ్ముడు వయసు 20 ఏళ్లే అయినా అతనికున్న పరిపక్వత(maturity) కి ఫిదా అయ్యా. అతనిలో నిరాశ,అనాసక్తత,జీవితం పై వైరాగ్యం ఏం కనపడలేదు. జీవితం నేర్పే పాఠాలు ఎవరూ నేర్పలేరు. ఏ విశ్వవిద్యాలయం నేర్పలేదు. స్వయంగా అనుభూతి చెందాల్సిందే.

"వ్యవసాయం ఎందుకు....వేరేది శ్రమ లేని పని చూసుకోవచ్చుగా " అని ఉచిత సలహా ఇచ్చాను.


"అవును అన్న, వేరేది చూస్తున్న. హైదరాబాద్ కి వచ్చి బిజినెస్ చేయాలి అని ఉంది" అని తన భవిష్యత్తు ప్రణాళిక చెప్పాడు.

 అది విన్నాక చాలా ఆనందం వేసింది. 

"నాకు బేకరీ బిజినెస్ పెట్టాలి అని ఉంది. త్వరలో హైదరాబాద్ కి వచ్చి మొదలు పెడతా" అన్నాడు.

"నువు ఎలా అయినా విజయం సాధిస్తావు. నీలో మంచి పరిపక్వత ఉంది" అని తను చేయాలి అనుకున్న పనికి నా మద్దతు తెలియజేసా.

"సరే అన్న....రేపు ఉదయమే blood transfusion" కోసం హాస్పిటల్ కి వెళ్ళాలి. బాయ్" అంటూ  వెల్పోయాడు.


నిజంగా ఆ తమ్ముడు మాట్లాడిన మాటలు చాలా స్ఫూర్తిమంత్రం గా ఉన్నాయి. చిన్నవాటికే మనం ఎంతో బాధ పడుతూ ఉంటాము.మనోవేదన పడుతూ ఉంటాం. కాని చెప్పులు లేవు అని బాధపడే వాళ్ళు కాళ్ళు లేని వాళ్ళని చూడండి అని అంటూ ఉంటారు. 

క్లుప్తంగా చెప్పాలి అంటే సమస్యలు అందరికి ఉంటాయి. కానీ దాన్ని చూసే విధానం బట్టి ఆ సమస్య తీవ్రత ఉంటుంది. 


--- శుభం---





No comments:

Post a Comment