బీసీల ను పట్టించుకునేది ఎవ్వరు ????

 


Pic:- answer given to parliament member.

టీవల పార్లమెంట్ లో  ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు సంబంధిత శాఖ  ఇచ్చిన సమాధానం చూసాక ఐఏఎస్,ఐపీఎస్ లాంటి  అల్ ఇండియా సర్వీసెస్ లో ఓబీసీ,ఎస్సి, ఎస్టీ వారి ప్రాతినిధ్యం ఎంత కింది స్ధాయి లో ఉందో ఆ గణాంకాలు అద్దం పట్టాయి.గత ఐదేళ్లలో జరిగిన ఆల్ ఇండియా సర్వీసెస్ నియామకాల్లో ఓబీసీ వారు కేవలం 15.92% మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

 

మీరు(ఓబీసీలు) అగ్ర వర్ణ కులాల ఆధిపత్యం నుంచి బయటపడి ఆత్మగౌరవం తో బతకాలి అంటే రాజకీయంగా, విద్య పరంగా ఉన్నత స్థితిలో ఉండాలి అంటూ అంబెడ్కర్ గారు బీసీలనుద్దేశించి నాడు దిశా నిర్దేశం చేశారు.  మన దేశం లో ఓబీసీల సంఖ్య దాదాపు సగం ఉన్నప్పటికి రాజకీయాల్లో ,ప్రభుత్వ కొలువుల్లో వారి ప్రాతినిధ్యం నామమాత్రమే.


మొండిచెయ్యి:-


జనాభా పరంగా ప్రజాస్వామ్య దేశంలో  నిర్ణయాత్మక శక్తిగా ఉన్న బీసీలు పదవుల అలంకరణ లో మాత్రం నామమాత్రంగానే మిగిలిపోయారు. పదవులు దక్కాలి అంటే అగ్ర వర్ణ కులస్తుల వెనుక నిలబడి వారి భజన చేస్తూ వారి ప్రాపకం పొందితే గాని సగటు బీసీ నాయకుడికి పదవులు దక్కే పరిస్థితి లేదు. అదృష్టం కలిసొచ్చి మంత్రి పదవులు దక్కినప్పటికి ప్రాధాన్యం లేని శాఖలను మోయాల్సిందే. ఇక ప్రభుత్వం లోని పరిపాలన విభాగం లో కూడా ఇదే తంతు. కీలక పదవులైన ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి, డిజిపి మొదలుగు స్థానాలు దాదాపు అందని ద్రాక్షనే. 


ముందు నుంచి మోకాలడ్డు:-


 తోటి ఎస్సి,ఎస్టీ వారు స్వాతంత్ర భారత్ తొలినాళ్ళలో నే రిజర్వేషన్లు పొందినప్పటికీ ఓబీసీలు అవి పొందటానికి చాలా ఏళ్ళు ఎదురు చూడాల్సి వచ్చింది. మండల్ కమిషన్ నివేదిక ఆధారంగా నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఓబీసీల రిజర్వేషన్ కల సాకారం చేసింది. దీనికొరకు అటు క్షేత్ర స్థాయిలోను, ఇటు న్యాయపరంగాను పోరాడాల్సివచ్చింది.1990ల్లో మండల్ వ్యతిరేక ఉద్యమం, 2006 లో రిజర్వేషన్ వ్యతిరేక ఉద్యమం మొదలగునవి  ఓబీసీల రిజర్వేషన్ కి వ్యతిరేకంగా పుట్టుకొచ్చిన ఉద్యమాలు. ఈ రిజర్వేషన్ల వలన మెరిట్ దెబ్బతింటుంది అంటూ ఆరోపణలు చేశారు. కాని నాడు రిజర్వేషన్లను వ్యతిరేకించిన వారే ఆర్థికంగా వెనుకబడిన వారికి ఈ డబ్ల్యూ యెస్.(EWS)  రిజర్వేషన్ వచ్చాక వాటి పై ఎటువంటి ఆందోళనలు,వ్యతిరేకత వ్యక్తం చేయకపోవడం గమనార్హం. ఇప్పటికీ ఇందిరా సహాని తీర్పు ప్రకారం రిజర్వేషన్లు 50% కి మించకూడదు అనే నిబంధన బీసీలు కోరుతున్న రిజర్వేషన్ శాతం పెంపు కు గుదిబండలాగా మారింది.


పేరుకే రిజర్వేషన్లు:- 


జనాభాకి తగినట్లుగా రిజర్వేషన్ శాతం లేకపోవడం వలన ఈ రిజర్వేషన్ల యొక్క ఉద్దేశం నెరవేరట్లేదు. సామాజికంగా,ఆర్డికంగా వెనుకబడిన తరగతులు అయినప్పటికీ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ కొలువుల భర్తీ కొరకు నిర్వహించే పరీక్షల రుసుములు మాత్రం జనరల్ కేటగిరీ వారితో సమానంగా ఉంటున్నాయి. బ్యాంక్ తదితర పరీక్షలు రాయాలి అంటే పరీక్ష రుసుములు వందల్లో చెల్లించాల్సిందే. మరోవైపు కట్ ఆఫ్ మార్కులు పరిశీలిస్తే ఓబీసీ వారికి, జనరల్ వారికి పెద్ద తేడా ఏముండదు. ఇంతకు ముందు వరకు జనరల్ కేటగిరీలో బాగంగా ఉన్న EWS వారి కట్ ఆఫ్ మార్కులు ఓబీసీ వారికంటే తక్కువ ఉండటం ఓబీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని అద్దం పడుతుంది. ఇటీవల యస్.యస్.సి (Staff selection commission) నిర్వహించిన కీలకమైన సి.జి.యల్ (combined graduates level) పరీక్షలో కట్ ఆఫ్ సరళి పరిశీలిస్తే జనరల్ వారితో సమానంగా ఉన్నాయి.దీంతో కార్యాలయాల చుట్టూ తిరిగి ఓబీసీ సర్టిఫికెట్ తీసుకుని పరీక్ష రాస్తే  లాభం ఏంటి అని అభ్యర్థులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.


బీసీ కులగణన:- 


     బీసీలు ఎదురుకొంటున్న సమస్యల పరిష్కారం బీసీల కులగణన తోనే మొదలు అవుతుంది. దీని పై ఈ మధ్య కాలం లో దేశ వ్యాప్తంగా చర్చ జరగడం శుభ పరిణామం.1931 తర్వాత బీసీల జనాభా గణాంకాలు అధికారికంగా సేకరించింది లేదు. మండల్ కమిషన్ ప్రకారం దాదాపు 52% ఉన్నారు. తొమ్మిది దశాబ్దాల క్రితం సేకరించిన బిసి జనాభా లెక్కలతో బిసిల ప్రాధికారత & సంక్షేమం  రూపొందించే ప్రభుత్వ విధానాలు, పధకాలు పేపర్ల మీద అద్భుతంగా అనిపించనప్పటికీ క్షేత్ర స్థాయిలో మాత్రం విఫలమవుతున్నాయి. సరైన పధకాలు,విధానాలు రూపకల్పన జరగాలి అంటే వాస్తవ గణాంకాలు అత్యవసరం. అంతటి కీలక సమాచారాన్ని సేకరించడానికి కేంద్ర ప్రభుత్వం మీన మేషాలు లెక్కించడం గర్హనీయం. రాజకీయ ప్రయోజనాల కోసం బీసీల ప్రయోజనాలు తాకట్టు పెట్టకుండ తక్షణమే ఈ విషయమై చర్యలు చేపట్టాలి.



రాజకీయాల్లో రిజర్వేషన్లు కల్పించాలి:- 


మండల్ కమిషన్ ద్వార బీసీలకు రిజర్వేషన్లు దక్కినప్పటికి అవి విద్య,ఉపాదికే పరిమితం. రాజకీయాల్లో వీరు ఆర్థికంగా,సామాజికంగా ఉన్నత వర్గాల వారితో పోటీ పడాల్సిందే. దీంతో రాజకీయంగా నిలదొక్కుకున్న బీసీ నేతలను వేళ్ళ పై లెక్కించొచ్చు. స్థానిక సంస్థలు ఎన్నికల రూపంలో ఈ కోరిక పార్శికంగా నేరవేరినప్పటికి రాష్ట్ర,జాతీయ స్థాయి చట్ట సభల్లో ప్రవేశానికి మాత్రం బి ఫామ్ పొందటం నుంచి ఎన్నికల్లో గెలిచే వరకు చెమటోడ్చాల్సిందే.దేశ జనాభాలో సగం ఉన్నప్పటికీ పార్లమెంట్ లో వీరి ప్రాతినిధ్యం ఇరవై శాతంకి మించట్లేదు. ఈ పరిస్దితి మారాలి అంటే రాజకీయాల్లో కూడా బీసీలకు రిజర్వేషన్లు కల్పించినప్పుడే సామాజిక న్యాయం వికసిస్తుంది.


 లోపించిన ఐక్యత:-


     కేంద్ర బిసి జాబితాలో దాదాపు 2,500 కులాలు ఉన్నాయి. కాని కేవలం 13 కులాలు మాత్రమే ఈ ఓబీసీరిజర్వేషన్ల ఫలాలు అందుకుంటున్నాయి. ఈ పరిస్థితి మారాలి అంటే బీసీ ఉప కులాల వర్గీకరణకు ఉద్దేశించిన జస్టిస్ రోహిణి కమిషన్ త్వరితగతిన నివేదిక ఇచ్చి,దాన్ని ప్రభుత్వం జాప్యం లేకుండా అమలు చేయాలి.బిసిలలో మేము ఎక్కువ,మీరు తక్కువ అనే భావనను తొలగి పోవాలి.  బిసి కులాల మధ్య ఐక్యత లోపించడం వారి ప్రయోజనాల సాధనలో అడ్డంకింగా మారింది.అందరూ సోదరా భావం తో ఒకే గొడుగు కిందకి వచ్చి బీసీ ల హక్కుల కై పోరాడాలి. ఇటీవల నారా లోకేష్  ఎస్సి,ఎస్టీ అట్రాసిటీ చట్టం వలె బిసిలకు సైతం వేధింపుల నుంచి సంరక్షణ కొరకు  ఒక బీసీ అట్రాసిటీ చట్టం తెస్తాం అని హామి ఇవ్వడం ఆహ్వానించదగింది. 


సంపద లోను వెనుకబాటే:-


తాజా గణాంకాల ప్రకారం బీసీల సంపద కలిగి ఉండటం లో కూడా వెనుకబడే ఉన్నారు.వారి చేతుల్లో ఉన్న సంపద కేవలం 20% లోపే. స్వతహాగా కుల వృత్తులను జీవనాదరంగా కలిగి ఉండటం తో సంపాదన కేవలం ఇళ్లు గడవడానికే సరిపోతుంది. ఇక పెద్ద చదువులు చదివించడానికి ఆర్థిక కారణాలు అడ్డుకాగా, చదువు కుంటే ఉన్నత స్థితికి చేరుకోవచ్చు అని చాటి చెప్పిన వారు తమ ఇళ్లల్లో లేకపోవడం కూడా మరొక కారణమే. ఈ కారణం చేతనే బీసీ లు పారిశ్రామికంగాను పెద్దగా ఎదగలేకపోయారు. 1991 ఆర్థిక సంస్కరణలు కూడా చేతి వృత్తులను,కుల వృత్తులను కోలుకోలేని దెబ్బ తీశాయి. చౌక విదేశీ ఉత్పత్తులు ఇస్తున్న పోటీకి నిల్వలేకపోయాయి.దరిమిలా బీసీల పరిస్థితి పెనం నుంచి పొయ్యిలో పడ్డట్టు అయింది.


                       ఒక నాయకుడికి పదవి వస్తే ఆ నాయకుడి  కులం మొత్తం ఉన్నత స్థాయికి వచ్చిన్నట్లు లెక్కలు వేయడం పరిపాటి అయింది. ప్రగతి అనేది ప్రతి ఇంట్లో జరగాలి. బిసి హక్కుల కోసం పోరాడుతున్నాం అని చెప్పుకునే వారు పదవుల కోసం ఉద్యమాలను నీరుగార్చవద్దు. హక్కులను పరిరక్షించుకుంటూ ,మరిన్ని హక్కుల సాధనకై శ్రమించాలి. ప్రభుత్వాలు ఇస్తున్న ప్రయోజనాలు వినియోగించుకుని యువత ఉన్నత విద్యను అభ్యసించాలి. రాబోవు తరాలు మరింత ఉన్నతంగా ఉండేలా ప్రణాళికలు రచించుకోవాలి. అధికార పార్టీలు రాజకీయ ప్రయోజనాలు పక్కన పెట్టి బీసీల దీర్ఘకాలిక డిమాండ్లను నెరవేర్చాలి.

అది జరిగిన నాడే బి.పి.మండల్ గారి ఆశయాలు నెరవేరతాయి.


-సమాప్తం-






ఆ తమ్ముడు చెప్పిన స్ఫూర్తి మాటలు.

                           



 పోటీ పరీక్షల కోసం నేనూ మరొక స్నేహితుడి తో కలిసి  హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ కి దగ్గర్లో ఒక పెంట్ హౌస్ లో ఉంటున్నాం. రోజూలానే రూమ్ బయట స్టడీ చైర్ వేసుకుని కూర్చున్నాను. ఇంతలో  ఒక తమ్ముడు ఫోన్లో బంజారా భాషలో మాట్లాడుతూ ఉన్నాడు. భాష నాకు తెలియకపోవడం తో నాకు వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో అర్థం కాలేదు. 

"నా పేరు సాయి కృష్ణ ఏం చేస్తున్నావ్ అన్న....తిన్నావ ?" అని ఆ తమ్ముడు మాట కలిపాడు.  నేను కూడా తిన్నా తమ్ముడు, నువ్వు తిన్నావ ? అని ఎదో అడగాలి అన్నట్లు అడిగా.

"నీ ప్రిపరేషన్ ఎలా ఉంది , దేనికి ప్రిపేర్ అవుతున్నావ్ ?" అని నేను అడిగ. 

"నేను ప్రిపరేషన్ కోసం కాదు అన్న, నేను పది వరకే చదివా, ప్రస్తుతం మా ఊర్లో వ్యవసాయం చేస్తున్నా" అని సమాధానం ఇచ్చాడు.

ఎందుకో ఆ సమాధానం విన్నాక పట్టరాని కోపం వచ్చింది. 

"ఎందుకు పదితోనే ఆపేసావ్....ఈరోజుల్లో చదువుకుంటేనే జీవితం........." అంటూ నేను ఒకింత అసహనంగా మాట్లాడా.


దానికి ఆ తమ్ముడు కాసేపు ఆలోచించి నాకు చదువుకోవాలి అని ఉంది కాని నా అదృష్టం బాలేదు అన్నాడు.

"చదువుకోవాలి అని ఆసక్తి ఉంటే చాలు....దానికి అదృష్టం తో పని లేదు" అంటు మరోసారి అసహనంగా మాట్లాడా.

"నేను ఇక్కడికి రక్తం ఎక్కించుకోడాని (blood transfusion)

కి వచ్చా,అది అయిపోయాక ఇంటికి వెళ్ళాలి" అన్నాడు.

"రక్తమా....ఏమైంది?" అడిగాను.

"నాకు తలసేమియా ఉంది....నెలకు రెండుసార్లు హైదరాబాద్ వచ్చి మూడు యూనిట్ల రక్తం ఎక్కించుకుని వెళ్తా ఉంటా" అన్నాడు.

ఆ మాట వినగానే నాకు ఆ తమ్ముడి పరిస్థితి అర్థం అయింది.

తమ్ముడి పరిస్థితి పూర్తగా తెలీకుండానే అసహనంగా మాట్లాడినందుకు నా మీద నాకే అసహ్యం వేసింది.

అప్పటివరకు పేపర్లోనే, టివిల్లోనే  యూట్యూబ్ లొనే ఆ వ్యాధి గురించి చూడటం, వినడమే గాని ప్రత్యక్షంగా చూసింది లేదు.

"నేను 9తోనే చదువు ఆపేసా.....మా అన్న ప్రోత్సాహం తో ఓపెన్ టెన్త్ రాసాను. ఇక ఐదేళ్ల నుంచి వ్యవసాయం చేస్తున్నా" అన్నాడు. 

నాకు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు.

కాసేపు తలసేమియా గురించి నాకు అవగాహన కల్పించాడు. నాకున్న సందేహాలు, అపోహలు కూడా నివృత్తి చేసాడు.

"తమ్ముడు...మాకు చిన్న సమస్య వస్తేనే జీవితాలే ఐపోయినట్లు అనిపిస్తది. ఇప్పుడు చాలా మంది చిన్నవాటికె ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కానీ నువ్వు ఈ విషయం లో ఎలా దిగమింగుకుంటున్నావ్ ? అని నా మనసులో ప్రశ్నను ఆ తమ్ముడు ముందు ఉంచా.

"నా 6 నెలల వయసులో తలసేమియా ఉన్నట్లు గుర్తించారు. కాని ఇప్పుడు అది అంతా గతం. నేను దాని గురుంచి ఆలోచిస్తే ఏం పని చేసుకోలేను. ఒకవేళ దాని గురించి ఆలోచించినా నాకున్న సమస్య ఏమి పోదు కధా. కాబట్టి అవేమి నేను పట్టించుకోను. 15 రోజులకి ఒకసారి హైదరాబాద్ వస్తా రక్తం ఎక్కించుకుని పోత. నా పని నేను చేసుకుంటా" అన్నాడు.

 ఆ మాటలు విన్నాక...నేను ఎంత ఉన్నత స్థితి(ఆరోగ్యం) లో ఉన్నానో కళ్ళకు కట్టినట్లు కనిపించింది. 

"నెలకు ఎంత ఖర్చు అవుతుంది" అను అడిగా.

"సుమారు ₹ 30 వేలు" అన్నాడు.

ఒక వ్యవసాయ కుటుంబం కి నెలకి ఆ ఖర్చు భరించడం నిజంగా చాలా కష్టం. ఆ కుటుంబం, ఆ తల్లిదండ్రులు ఎంత కష్టం అనుభవిస్తున్నారో అని అనిపించింది.

"తమ్ముడూ.... నాకొక ప్రశ్న ఉంది,అడగొచ్చా ?" అని అడిగా.

"అడుగు అన్నా" అన్నాడు ఆ తమ్ముడు.

"నాకు చిన్న సమస్య వస్తేనే, తీవ్ర నిరాశలోకి వెళ్లిపోతున్నా. కాని నీ సమస్య ముందు నాది అసలు సమస్యే కాదు" అని అన్నాను.


"చూడు అన్న.... నేను చేయని తప్పుకి శిక్ష అనుభవిస్తున్న. మా అమ్మ నాన్న మేనరికం వివాహం చేసుకోవడం వల్ల నాకు ఇలా అయింది. అయినా నేను అవన్నీ పట్టించుకుంటే నాకున్న ఈ చిన్న జీవితం కూడా ఉండదు. నిన్న ఏం జరిగింది అనేది నాకు అనవసరం.నేను చేయగలిగింది చేస్తున్నా. మా అమ్మ,నాన్న,అన్నయ్య నన్ను బాగానే చూసుకుంటారు. అయినా నాకేమి సమస్య ఉంది. నాకు రక్తం క్రమంగా ఎక్కించుకుంటే మీకంటే ఎక్కువ శక్తితో,ఉత్సాహంతో పని చేస్తా" అన్నాడు.

ఆ మాటలు విన్నాక నా మనసు చాలా తేలిక అనిపించింది.

పెళ్లి విషయం లో ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి మొదలగు విషయాలు చెప్పాడు.

ఆ తమ్ముడు వయసు 20 ఏళ్లే అయినా అతనికున్న పరిపక్వత(maturity) కి ఫిదా అయ్యా. అతనిలో నిరాశ,అనాసక్తత,జీవితం పై వైరాగ్యం ఏం కనపడలేదు. జీవితం నేర్పే పాఠాలు ఎవరూ నేర్పలేరు. ఏ విశ్వవిద్యాలయం నేర్పలేదు. స్వయంగా అనుభూతి చెందాల్సిందే.

"వ్యవసాయం ఎందుకు....వేరేది శ్రమ లేని పని చూసుకోవచ్చుగా " అని ఉచిత సలహా ఇచ్చాను.


"అవును అన్న, వేరేది చూస్తున్న. హైదరాబాద్ కి వచ్చి బిజినెస్ చేయాలి అని ఉంది" అని తన భవిష్యత్తు ప్రణాళిక చెప్పాడు.

 అది విన్నాక చాలా ఆనందం వేసింది. 

"నాకు బేకరీ బిజినెస్ పెట్టాలి అని ఉంది. త్వరలో హైదరాబాద్ కి వచ్చి మొదలు పెడతా" అన్నాడు.

"నువు ఎలా అయినా విజయం సాధిస్తావు. నీలో మంచి పరిపక్వత ఉంది" అని తను చేయాలి అనుకున్న పనికి నా మద్దతు తెలియజేసా.

"సరే అన్న....రేపు ఉదయమే blood transfusion" కోసం హాస్పిటల్ కి వెళ్ళాలి. బాయ్" అంటూ  వెల్పోయాడు.


నిజంగా ఆ తమ్ముడు మాట్లాడిన మాటలు చాలా స్ఫూర్తిమంత్రం గా ఉన్నాయి. చిన్నవాటికే మనం ఎంతో బాధ పడుతూ ఉంటాము.మనోవేదన పడుతూ ఉంటాం. కాని చెప్పులు లేవు అని బాధపడే వాళ్ళు కాళ్ళు లేని వాళ్ళని చూడండి అని అంటూ ఉంటారు. 

క్లుప్తంగా చెప్పాలి అంటే సమస్యలు అందరికి ఉంటాయి. కానీ దాన్ని చూసే విధానం బట్టి ఆ సమస్య తీవ్రత ఉంటుంది. 


--- శుభం---





పట్టభద్రుల తీర్పు...... ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణికి చెంపపెట్టు.

                         




ఆంద్రప్రదేశ్ లో తాజాగా జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పక్షానికి విద్యావంతులు తమలో గూడుకట్టుకున్న అసంతృప్తిని ఓట్లరూపంలో వెళ్లగక్కారు. అధికార పక్షం అంచనాలు తలక్రిందులుగా చేస్తూ ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం పార్టీ బలపరిచిన అభ్యర్థులను పెద్దల సభకి పంపారు. తమ సమస్యలపై, ప్రయోజనాల పై పోరాటం చేస్తారని పట్టభద్రులు కసితో ఓట్లు వేసి గెలిపించారు అని విజయం సాధించిన అభ్యర్థుల మెజారిటీలను పరిశీలిస్తే ఇట్టే అర్థం అవుతుంది.


2019 లో పట్టం:


జగన్ సారథ్యంలోని వైకాపా అధికారంలోకి రావడానికి కీలక పాత్ర పోషించిన వారిలో యువత ముందు వరుసలో ఉంటారు. వారి మనసు చూరగొనడానికి నాటి ప్రతిపక్ష నేత అయిన జగన్ యువభేరీలు నిర్వహిస్తూ తాను మాత్రమే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తేవగలను అని, లక్షల్లో ఖాళీగా ఉన్న సర్కారు ఉద్యోగాలను ప్రతి సంవత్సరం జనవరి ఒకటవ తేదీనే యుపియస్సి(upsc) వలే జాబ్ కేలండర్ ప్రకటించి క్రమం తప్పకుండా భర్తీ చేయగలను అని, ప్రత్యేకహోదా ఉంటేనే మన యువతకు ఉద్యగలు అని యువత  వద్ద ఉద్వేగబరిత ప్రసంగాలు చేశారు. నిజాయితీ కి మారుపేరు అని, మాట తప్పను మడమ తిప్పని అని తనని తాను పొగుడుకునే జగన్ అధికారం చేజిక్కాక మాత్రం యువత విషయంలో, మరీ ముఖ్యంగా సర్కారు కొలువుల భర్తీ విషయంలో పూర్తిగా విఫలం అయ్యారు. దీంతో పట్టభద్రుల ఓటర్లలో కీలకం అయిన ఉద్యోగార్థులు తమకు జరుగుతున్న అన్యాయాన్ని ముఖ్యమంత్రి కి తెలిసేలా తమకు అంది వచ్చిన అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకున్నారు అనడం లో అతిశయోక్తికాదు.


నిరుద్యోగులకు గుదిబండగా మారిన సచివాలయం వ్యవస్థ:


జగనన్న ఇచ్చిన మాట తప్పడు, అన్న వచ్చాక భారీగ గ్రూప్ 1,2 పోస్టుల భర్తీ  ఉంటుంది ,ప్రభుత్వం ఉద్యోగం సాదించుకుని కొత్త జీవితంలోకి అడుగు పెట్టాలి అని ఆశగా ఎదురు చూసిన ఉద్యోగార్థులకి తీవ్ర నిరాశ ఎదురైంది. ఇతర హామీలని క్రమంగా నేరవేరుస్తూ వస్తున్న ముఖ్యమంత్రి జగన్ ఉద్యోగాల భర్తీ విషయంలో ఏమైందో ఏమోగానీ పెడ చెవిన పెట్టారు.

గ్రూప్ ఉద్యోగాల భర్తీ పట్ల నిర్లక్ష్య ధోరణికి కారణం భారీ ఎత్తున చేపట్టిన గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగాల భర్తీ అని చెప్పవచ్చు. ఎన్నికల హామీలో  చెప్పినట్లు గానే సచివాలయ వ్యవస్థను ప్రభుత్వం ఏర్పడిన ఆరు నెలల్లోనే ఏర్పాటు చేసి జగన్ తన నిజాయితీకి ఎవరూ సాటి రారు అని  పరోక్షంగా ప్రతిపక్ష పార్టీలకు తెలియజేసారు. నాడు జరిగిన కని విని ఎరుగని కొలువుల కోలాహలం చూసి ప్రతిపక్ష పార్టీలకు గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి అనేది సత్యం. గ్రామ సచివాలయ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పై ఎన్నో అనుమానాలు, ఆరోపణలు వచ్చినప్పటికీ ప్రభుత్వం తాను అనుకున్న విదంగానే భర్తీ ప్రక్రియ పూర్తి చేసి దాదాపు లక్ష మందికి పైగా యువతకు ప్రభుత్వ కొలువు కోరిక తీర్చింది. ఇక్కడే అసలు సమస్య మొదలైంది. ఎప్పుడైతే భారీ గ్రామ,వార్డు సచివాలయ నియామకాలు చెప్పట్టారో ముఖ్యమంత్రి దగ్గరి నుంచి గ్రామ స్థాయి నేతల వరకు తాము నిరుద్యోగ యువత కు ఇచ్చిన కొలువుల భర్తీ హామీ నెరవేర్చిన హామీగా లెక్కలేసుకున్నారు. అందుకేనేమో జాబ్ కేలండర్ హామీని అటకెక్కించారు. దీని పర్యావసానంగా ఉద్యోగార్థులు వేయి కళ్లతో ఎదురు చూసిన గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 నియామకాలపై తీవ్ర ప్రభావం చూపింది.


పక్క రాష్ట్రం ప్రభావం:


తోటి తెలుగు రాష్ట్రం తెలంగాణ లో గత ఏడాది నుంచి కొలువుల జాతర కొనసాగుతుంది. అంతకుముందు వరకు ఆ రాష్ట్రంలో నియామకాల కోసం ఎదురు చూసిన యువతకు గత ఏడాది నుంచి తెలంగాణ సర్కారు వరుస నోటిఫికేషన్లతో యువతను పరుగు పెట్టిస్తోంది. పబ్లిక్ లైబ్రరీలు అన్నీ కిటకిటలాడుతున్నాయి. వాటి ప్రభావం ఆంద్రప్రదేశ్ లోని నిరుద్యోగులపై తీవ్రంగా చూపించిందని పోలైన ఓట్ల సరళి,మెజారిటీ తీరు తెలియజేస్తుంది. ప్రతి ఆంగ్ల కొత్త సంవత్సరం రోజు ప్రభుత్వం నుంచి జాబ్ కేలండర్ రూపంలో తీపి కబురు వినాలి అనుకున్న ప్రతి సారి తీవ్ర నిరాశే మిగిలింది. తమ తోటి తెలంగాణ నిరుద్యోగులు ఉద్యోగ సాధనలో నిమగ్నమయుంటే ఆంధ్ర ప్రాంతం వారు మాత్రం తమకు జరుగుతున్న అన్యాయాన్ని ఎవరికి చెప్పుకోవాలో తెలియక నిరాశ్రయులగా మిగిలిపోయారు.

తమ నిరసన గళం తెలియజేయడానికి హైదరాబాద్ నుంచి రైళ్లలో విజయవాడకు వచ్చి ధర్నాలు,ఆందోళనలు చేయాల్సిన దుస్థితి ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులది. మరోవైపు పోలీసులతో ఉక్కుపాదం మోపుతున్న ఆంధ్రప్రదేశ్ సర్కారు తమపై ఎక్కడ కేసులు నమోదు చేస్తుందో అని ,అసలుకే ఎసరు వస్తుంది అని నిరుద్యోగులు ఒకటి రెండు సార్లు మినహా పెద్దగా ఆందోళనలు చేయలేదు.


అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం:-


2019 లో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి మీడియా తో కలిసి ఇష్టాగోష్టిగా మాట్లాడింది లేదు.ప్రజా దర్బార్ లాంటివి నిర్వహించిన దాఖలాలు లేవు. దానితోపాటు మంత్రులకి సైతం జగన్ అపోయింట్మెంట్ దొరకడం కష్టం అని వినికిడి. ఇక ఎమ్మెల్యేల సంగతి దేవుడెరుగు. ఈ క్రమంలో క్షేత్ర స్థాయిలో వాస్తవ పరిస్థితులు ముఖ్యమంత్రి కి తెలియడానికి అవకాశం లేకుండా పోయింది. 151 సీట్లతో అఖండ విజయం,ఆ తర్వాత జరిగిన వివిధ ఎన్నికల్లో విజయంతో మాంచి ఊపు మీద ఉన్న వైకాపా కు,ఆ పార్టీ అధినేత కు నిరుద్యోగుల చిరకాల కోరిక గురించి తెలియజేయడానికి ఈ సమస్య గురించి అవగాహన ఉన్న నాయకులు సైతం సాహసించలేదు. మరో వైపు నిరుద్యోగులకు ప్రతిపక్షాల నుంచి సరైన సహకారం లభించలేదు. దీంతో నిరుద్యోగులే తమ పోరాటాన్ని కొనసాగిస్తున్నారు.

ఆర్థ శాస్త్ర నిపుణుడు, వేలాది మంది కి పోటీ పరీక్షల నిమిత్తం ఆర్థ శాస్త్రాన్ని బోధించిన ,నిరాడంబర వ్యక్తి ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం బలపరిచిన అభ్యర్థిగా పోటీలోకి దిగుతుండడం తో నిరాశ,నిస్పృహలతో అచేతనంగా ఉన్న నిరుద్యోగులకు తమ గొంతుక వినిపించే అవకాశం, తమ అసంతృప్తి ని తాడేపల్లి లో ఉన్న ముఖ్యమంత్రి కి సైతం తెలియజేసే అవకాశం ఉందని భావించి తమకు అందివచ్చిన అవకాశాన్ని చాలా నేర్పుగా వినియోగించుకున్నారు అనేది సుస్పష్టంగా తెలుస్తోంది. దానితో పాటు అధికార పార్టీ క్లీన్ స్వీప్ చేసిన రాయలసీమ లో సైతం పట్టబద్రుల నియోజకవర్గంలో అధికార పార్టీ అభ్యర్థులు ఓడిపోయారు అంటే యువత గాంధేయ మార్గంలో ప్రజాస్వామ్య బద్దంగా ,ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా తమ దీర్ఘకాల ప్రయోజనాలకోసం ఆలోచించి ఓటు హక్కుని వినియోగించుకోవడం శుభపరిణామం.


ఉద్యోగాలు లేక వలసలు:


అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం అసాధ్యం అని ఒక మంత్రి వ్యాఖ్యానించారు. అది కఠోర వాస్తవం. అయినప్పటికీ పోస్టులు పదుల సంఖ్యలో ఉంటే పోటీ మాత్రం లక్షల్లో ఉంటుంది. వాస్తవానికి ప్రభుత్వ కొలువు కంటే ప్రైవేట్ ఉద్యోగాల్లో ఎక్కువ వేతనాలు లభిస్తున్నాయి. అయినప్పటికీ ఉద్యోగ భద్రత తదితర కారణాల వల్ల సర్కారు కొలువుకే మొగ్గు చూపుతారు ఉద్యోగార్థులు. ప్రైవేటే పెట్టుబడులకు అనుకూల వాతావరణం సృష్టించి ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు సృష్టించాల్సిన గురుతర బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. కానీ ఆంద్రప్రదేశ్ లో ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. రెండవ అతిపెద్ద తీర రేఖ ఉన్నప్పటికీ అనుకున్న స్థాయిలో దాన్ని రాష్ట్రాభివృద్ధికి కోసం వినియోగించలేకపోతుంది ప్రభుత్వం. చాలీ చాలని జీతాలతో ఇతర రాష్ట్రాలలో ప్రధాన నగరాల్లో పనిచేస్తున్నారు. ఇక నిరక్షరాస్యులు జీవనోపాధి కోసం గల్ఫ్ దేశాల బాట పడుతున్నారు. ఇతర ప్రభుత్వ విధానాల వల్ల అసంఘటిత రంగంలో ఉపాది అవకాశాలు చెల్లా చెదురు అయ్యాయి.

మూలధన పెట్టుబడిని విస్మరించి సంక్షేమ చుట్టూనే ప్రభుత్వం ప్రదక్షిణ వల్ల ఉపాది అవకాశాలు సన్నగిల్లాయి. ప్రజల ఆదాయ మార్గాలు లేక రోజు గడవడానికి అప్పులు చేయాల్సిన పరిస్థితి. ప్రభుత్వం బటన్ నొక్కి ఎప్పుడు తమ ఖాతాలో డబ్బులు వేస్తార అని ఎదురు చూస్తున్నారు అంటే ప్రజల ప్రస్తుత పరిస్థితి ఏ విదంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.


తీర్పుని గౌరవించి...నియామకాలు చేపట్టాలి:-


పట్టబద్రుల ఇచ్చిన తీర్పుని గౌరవించి జగన్ సర్కార్ ఇప్పటికైనా తాను ఇచ్చిన ఉద్యోగాల భర్తీ హామీని నెరవేర్చాలి. తమ తప్పుని తెలుసుకోకుండా ఇంకా ప్రతిపక్షాల మీద ఎదురు దాడి చేస్తే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో నిరుద్యోగులు మరోసారి తమ తీర్పు ని చూపిస్తారు. నోటిఫికేషన్లు ఇచ్చి వాటిని త్వరితగతిన పూర్తి చేయాలి. 2021 లో ఇచ్చిన గ్రూప్ 4 నోటిఫికేషన్ ఇంకా పూర్తి కాలేదు. Dsc ఊసే లేదు.  మరోవైపు ప్రభుత్వ సిబ్బంది కొరత వలన ఉద్యోగుల మీద తీవ్ర పని ఒత్తిడి ఉంటుంది. అప్పులు చేసి,కుటుంబానికి దూరంగా ఉంటూ తెచ్చుకున్న కొద్దిపాటి డబ్బుని పొదుపుగా వాడుకుంటూ నోటిఫికేషన్లు వస్తాయి అన్న ఆశతో లక్షలాది నిరుద్యోగులు పోటీ పరీక్షలకు సన్నద్ధం అవుతున్నారు.మరో వైపు వయస్సు రోజు రోజుకు పెరుగుతుంది. వారి ఆశలపై నీళ్లు చల్లోద్దు. వారి ఉసురు తీసుకోవద్దు. ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగాలు భర్తీ చేయాల్సిన నైతిక బాద్యత ప్రభుత్వం మీద ఉన్నది. ఇక పై కూడా వైకాపా ప్రభుత్వం నిరుద్యోగుల పట్ల శీతకన్ను ప్రదర్శిస్తే రాబోవు ఎన్నికల్లో నిరుద్యోగులు కన్నెర్ర చేయాల్సి వస్తుంది.



మంగళగిరి ఎయిమ్స్ ఆసుపత్రి కి వెళ్ళాలి అనుకునేవారు చదవండి నా ఈ బ్లాగ్ పోస్ట్.

                    చిత్రం:- ఎయిమ్స్ ,మంగళగిరి.

ఇవాళ ఏదైనా అనారోగ్య సమస్య ఎదురైతే అది తగ్గిపోయే సంగతి అటుంచితే దాని నివారణకు అయ్యే ఖర్చు ఎలా భరించాలో అని జనం బెంబేలెత్తిపోతున్నారు. కోవిడ్ తర్బాత ఉన్నట్లు ఉండి గుండెపోట వచ్చి చిన్న వయస్సు వారు సైతం ప్రాణాలు విడిస్తున్నారు. ఈ సంఘటనలు చూసి నాకు కూడా హెల్త్ చెక్ అప్ చేయించుకోవాలి అని అనిపించింది. దీనితో ఒకసారు మంగళగిరి ఎయిమ్స్ సందర్శించాలి అని నిర్ణయించుకుని ఇంట్లో అమ్మ,నాన్న తో పరిగడవున కార్ లో ఉదయాన్నే 5 కి బయలుదేరి ఎయిమ్స్ కి 7 కి చేరుకున్నాం. OPD దగ్గర కారు ఆపి దిగగానే సెక్యూరిటీ గార్డ్ మాకు టోకెన్స్ ఇచ్చారు. అవి తీసుకుని కూర్చున్నాం. ఇంతకు ముందే ఎయిమ్స్ సందర్శించిన నా స్నేహితుడు చెప్పినట్లు మొబైల్ లో ABHA APP డౌన్లోడ్ చేసుకుని మా డీటెయిల్స్ నమోదు చేసి ఒక ఖాతా తెరిచి అందులో ఉండే QR CODE SCANNER తో స్కాన్ చేస్తే మన వివరాలు ఆసుపత్రికి చేరుతాయి మరియు మనకి 30 నిమిషాలు కౌంట్ డౌన్ తో ఒక టోకెన్ వస్తుంది.


 (గమనిక: ఫోన్ లేని వారు ఇంతకు ముందు చెప్పిన సెక్యురిటి గార్డ్ ఇచ్చే టోకెన్ ఫాలో అవ్వాలి. గార్డ్ ఇచ్చే టోకెన్ కంటే ఫోన్ తో స్కాన్ చేస్తే వచ్చే టోకెన్ నెంబర్ తక్కువ ఉంటుంది. కాబట్టి వెళ్లేవారు స్మార్ట్ ఫోన్ తో వెళ్తే చాలా మంచిది. మా విషయంలో offline token నెంబర్ 155 ఉంటే మొబైల్ టోకెన్ లో 9 నెంబర్ ఉంది. కానీ ఈ మొబైల్ టోకెన్ తో సమస్య ఏంటి అంటే 30 నిమిషాలు కౌంట్ డౌన్ పడుతుంది. అంటే 30 నిమిషాల తర్వాత మరలా పొందాలి. మెయిన్ ఎంట్రన్స్ దగ్గర మన టోకెన్ నెంబర్ పిలిస్తే లోపలకి వెళ్లాలి(zero floor). అక్కడ వరుసగా కౌంటర్లు ఉంటాయి. మనం వెళ్లి మన టోకెన్ నెంబర్(మొబైల్) చెప్పగానే మన వివరాలు వస్తాయి. అక్కడ మన అనారోగ్య గురుంచి చెప్తే(విభాగం..ఉదా- cardiology) వారు ఆ డిపార్ట్మెంట్ కి మన డీటెయిల్స్ షేర్ చేసి ఆయా కౌంటర్ నెంబర్ , ఫ్లోర్ నెంబర్ ఇస్తారు, ఉదా జనరల్ మెడిసిన్ 216,కన్ను 201. ఈ నమోదు, రుసుము చెల్లింపు మొత్తం ground floor లో జరుగుతుంది. ఇక మనకు చెప్పిన కౌంటర్ దగ్గరికి వెళ్ళాలి. మనకు చెప్పిన కౌంటర్ దగ్గరికి వెళ్లి మరలా మనం మన టోకెన్ నెంబర్ చెప్తే అప్పుడు ఆయా డాక్టర్ కి సంబంధించిన మరొక టోకెన్ ఇస్తారు.

           చిత్రం:- GENERAL MEDICINE విభాగం టోకెన్.

అలా మనం ఎన్ని విభాగాల కొరకు చూపించుకోవాలి అని అనుకుంటున్నామో ఆ కౌంటర్ వద్దకు వెళ్లి మన మొదటి టోకెన్ నెంబర్ చెప్పి ఆ విభాగానికి సంబంధించిన టోకెన్ తీసుకోవాలి. మనల్ని డాక్టర్ వద్దకు పంపేది రెండవ సారి తీసుకున్న టోకెన్ ఆధారంగానే.మనం ఆసుపత్రిలోకి ప్రవేశించగానే తీసుకునేది కాకుండా , విభాగం దగ్గర తీసుకునే టోకెన్ ఆధారంగా మనల్ని లొపలికి పంపుతారు. డాక్టర్ గారు రాసె మందులు,పరీక్షలు మార్కెట్ ధరతో పోలిస్తే చౌకగానే లభిస్తాయి. 

మంగళగిరి ఎయిమ్స్ కి వెళ్లాలి అని అనుకునేవారికి సూచనలు:
  1.  ఉదయం 8 AM లోపల ఆసుపత్రికి చేరుకోడానికి ప్రయత్నం చేయండి. 
  2. test లు ఏమైనా చేయాల్సి రావొచ్చు కాబట్టి, తినకుండా రావడానికి ప్రయత్నం చేయండి. 
  3.  వచ్చే ముందు మీ పాత files ఏమైనా ఉన్నా, మీరు ప్రస్తుతం వాడుతున్న మందులు కూడా వెంట తెచ్చుకోండి. డాక్టర్ గారికి అవి చూపిస్తే మీ యొక్క ప్రస్తుత ఆరోగ్య స్థితి ఏంటో తెలుస్తుంది. 
  4. కాంటీన్ సదుపాయం ఉంది. మీరు కావాలి అనుకుంటే ఇంటి నుంచే అన్నం తీసుకుని రావొచ్చు. కూర్చుని తినడానికి చాలా విశాల స్థలం ఉంది. 
  5.  ఇక్కడికి వచ్చేవాళ్ళు ఓపికగా ఉంటేనే మంచిది. ఎదురు చూడటం ఎక్కువ ఉంటది. 
  6. ఆరోగ్య శ్రీ ఏం వర్తించదు. ఇక్కడ వైద్యం ఉచితం కాదు....కేవలం చౌక. కానీ కొన్ని డిపార్ట్మెంట్స్ లో ఖరీదు గానే ఉన్నాయి. మీకు ఈ సేవల ధరలు అన్ని Mangalagiri AIIMS E-paramarsh App లో అన్ని వివరంగా ఉన్నాయి. మీరు playstore లో నుంచి డౌన్లోడ్ చేసుకుని చూడవచ్చు. 
  7. ఎంత త్వరగా వస్తే అంత త్వరగా పని పూర్తి చేసుకుని వెళ్తారు.

రుసుముల వివరాలు(కొన్ని):-

ఎయిమ్స్ కి చేరుకునే మార్గం:-


విజయవాడ బస్ మరియు రైల్వేస్టేషన్ నుంచి సిటీ బస్ సర్వీస్ ఉంది. కాకపోతే అది frequent గా ఉండవు. అప్పుడు మీరు ఆటో లేదా మంగళగిరి వెళ్లే బస్ ఎక్కి వడ్డేశ్వరం బస్ స్టాప్ దగ్గర దిగి ఒక కిలోమీటర్ నడిస్తే ఆసుపత్రికి చేరుకోవచ్చు. APSP Mangalagiri battalion అనేది landmark గా గుర్తుపెట్టుకొండి.


 
                    చిత్రం:- వడ్డేశ్వరం బస్ స్టాప్


గమనిక;-
  1. ఎయిమ్స్ లోపల రిలయన్స్ జియో తప్ప మిగతా వాటికి నేను వెళ్ళిన రోజు సిగ్నల్స్ లేవు. జియో కి మాత్రం ఫుల్ సిగ్నల్ ఉంది. మొబైల్ with సిగ్నల్ చాలా అవసరం QR కోడ్ స్కాన్ చేయటానికి. 
  2. అక్కడ పనిచేసే స్టాఫ్ సిఫార్సులు(recommendation) ఉన్న వాళ్ళు ముందే వెళ్తుంటారు Q follow అవ్వకుండా. అది చిరాకు తెప్పించే అంశం. 
  3. నేను వెళ్ళినప్పుడు డాక్టర్ల కొరత స్పష్టంగా కనపడింది. దాని వల్ల EYE CHECK UP దగ్గర ఆలస్యం అయింది. 
  4. స్టాఫ్ కొంచెం harsh గా ఉన్నట్లు అనిపించింది. కాని అది సహజమే అని అనిపించింది. 
  5. patients ని సరిగా guide చేసే వాళ్ళు లేరు. దానివల్ల పెద్దవారికి కొంచెం ఇబ్బందే. 
  6.  coordination లోపం అయితే నాకు కనిపించింది. భవిష్యత్ లో మారిద్దేమో చూడాలి. 
  7.  రెండుకంటే ఎక్కువ డాక్టర్లని కలవాలి అంటే చాలా early గా వెళ్ళాలి. లేకపోతే ఒక్కోసారి మనకి చెప్పిన పరీక్షలు ఆలస్యం అవడం వలన పని పూర్తికాకపోవచ్చు. 
Download these both apps:- 
  1. E Paramarsh Mangalagiri AIIMSApp ,
  2. ABHA App 

Lab Test Receipt:-

           చిత్రం:- Lab Services receipt.

మొత్తానికి నాకు అయితే వెళ్లినందుకు సంతృప్తినిచ్చింది. ఏమైనా సందేహాలు ఉంటే అడగండి...నేను తెలిసింది చెప్తాను. ధన్యవాదాలు 😀