క్రమశిక్షణ కు చిహ్నం అయోధ్య కేసు రాజ్యాంగ ధర్మాసనం రంజన్ గొగోయ్ అండ్ కో..

అయోధ్య భూ వివాదం కేసులో అగ్ర న్యాయస్థానం ఇచ్చిన తీర్పు మనందరికీ తెలిసిందే. అయితే ఇందులో నేను గ్రహించిన ఒక అంశాన్ని మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. అయోధ్య కు సంభందించి ఇరు పక్షాల వాదనలు పక్కన పెడితే అసలు ఈ అయోధ్య భూ వివాదం కోర్టు దాకా వచ్చిన తర్వాత పరిష్కారం అవడానికి ఇన్నేళ్లు ఎందుకు పట్టింది ? ఎన్నో పెద్ద పెద్ద కేసులు పరిష్కరించిన న్యాయస్థానాలు ఈ కేసు వద్ద మాత్రం ఎందుకు ఇంత కాలం సాగదీసుకు వచ్చారు ? మొదలగు ప్రస్నలకు సమాధానం న్యాయమూర్తుల వైఖరి జవాబు ఇస్తుంది. వారికే కాదు సామాన్య పౌరులకి సైతం ఈ కేసు పేరు చెప్తే ఇది ఈ శతాబ్దానికి ముడిపడదు అనే భావించే వాళ్ళం.
కానీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ తాను పదవి విరమణ చేసెకంటే ముందే ఈ కేసుకి శాశ్వత పరిష్కారం చూపాలని దృఢ సంకల్పించి నలభై రోజుల పాటు నిత్యం ఐదుగురు సభ్యుల రాజ్యంగా ధర్మాసనం విచారణ జరుపుతూ అసాధ్యం అనుకున్న కేసుకు శాశ్వత లోప రహిత, నిష్పక్షపాతంగా పరిష్కారం చూపగలిగారు.

ఇక్కడ మనం గ్రహించాలసింది ఏంటంటే ఒక పనిని ఎలా అయినా పూర్తి చేయాలని దృఢ సంకల్పం తో పాటు ప్రతి రోజూ లక్ష్యం కోసం క్రమం తప్పకుండా శ్రమిస్తే అసాధ్యం అనుకున్న దానిని సులభంగా సాధించవచ్చు అని.

మొదట అయోధ్య కేసుకు ఒక రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేస్తే అందులో ఇద్దరు న్యాయమూర్తులు వైదొలిగారు. ఈ సంఘటన వారికి ఈ కేసు పై ఎలాంటి వైఖరి(సాధ్య/అసాధ్య) ఉన్నదో గ్రహించవచ్చు.

అలానే ఒకసారి విచారణ జరిపి మళ్ళీ మూడు నెలల తర్వాత విచారణ జరిపి మళ్ళీ ఇంకో... ఇలా చేస్తే లక్ష్యం చేరుకోలేం ,పరిష్కరం చూపలేం. ఈ కేసులో అలా కాకుండా అసలు ఆటో ఇటో తేల్చుకోవాలని నడుం బిగించి ఎన్నో ఏళ్లుగా నలుగుతున్న సమస్య కు పరిష్కారం చూపగలిగారు అంటే క్రమశిక్షణ యొక్క ఔన్నత్యాన్ని చాటి చెప్తుంది.

ఇదే విదంగా రాజకీయ నాయకుల ఆర్థిక నేరాల కేసులలో కూడా ఇదే పద్దతిని అనుసరిస్తే న్యాయస్థానాల మీద ఉన్న అపరిమిత కేసుల బరువు తగ్గించవచ్ఛని నా అభిప్రాయం.

గమనిక :- మీ అభిప్రాయాలను కూడా తెలియజేయగలరు.

అన్నo - కూర వెనుక దాగి ఉన్న నీతి కధ.

మన దృష్టి మొత్తాన్ని కేంద్రీకరించి ఒక విషయం గురుంచి కానీ వ్యక్తి గురించి కానీ కాసేపు ఆలోచిస్తే మనకు అప్పటివరకు తెలియని, ఊహించని విషయాలు కానీ రూపాలు కానీ మన మెదడు కి తడతాయి అని నా అనుభవం ద్వార తెలుసుకున్న. పుస్తకాల కంటే ప్రకృతి ద్వార మరింత నేర్చుకోవచ్చు అని నా నమ్మకం. ఎందుకంటే ఏ పుస్తకం అయిన దాని మూలం చివరికి ప్రకృతి అని నా ఉద్దేశం.

ఇలా ఆలోచించడం మొదలు నేను ప్రకృతి నుంచి చాలా విలువైన పాఠాలు నేర్చుకున్నాను. "నా ఆటోగ్రాఫ్" సినిమాలోని స్ఫూర్తి మంతమైన పాట "మౌనం గానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది....." పూర్తిగా ప్రకృతిని ఉదహరిస్తూ గొప్ప పాట కి పురుడు పోశారు.


ఇక విషయానికి వస్తే ఎప్పటిలానే అన్నం తింటున్న సమయం లో నా ఆలోచన మొత్తం పళ్ళెం లో ఉన్న అన్నం- కూర మీదే ఉంది. ఇకనాకు ప్రశ్నలు మొదలయ్యాయి.
అసలు అన్నం ఎందుకు తినాలి ? శరీరానికి శక్తి కావాలి కాబట్టి. మరి కూర ఎందుకు ? దీనికి సమాధానం రాబట్టడం  కాస్త కష్టపడాల్సి వచ్చింది. కూర వలన శరీరానికి ఎంతో కొంత శక్తి రావచ్చు కానీ అన్నం కంటే కాదు సుమా !

అన్నం తయారీ కంటే కూర తయారీనే కష్టం. అటు ఖర్చు పరంగా, శ్రమ పరంగా, వెచ్చించాల్సిన సమయం కూర విషయం లోనే ఎక్కువ. కూర భాగోకపోతే అన్నమే మానేసిన సందర్భాలు ఎన్నో.

ఇందులో మనం నేర్చుకోవాల్సిన ఒక పాఠం ఉంది. అదేంటి అంటే అన్నం మనకి ముఖ్యం. కానీ దాని స్వభావ రీత్యా చప్పగా ఉండటం చేత మనం సింగిల్ గా తినలేము. అలా అని తినకుండా ఉండలేము. తినటమే కాకుండా సరిపడా తినాలి. చప్పగా ఉంది కాబట్టి దానికి ఏదైనా రుచిని జత చేస్తే ఎంతైనా తినొచ్చు కదా . ఈ చిన్నపాటి ఆలోచన తో చప్పగా తినలేని అన్నానికి ఒక రుచికరమైన కూరని జత చేయడం ద్వారా మనం ఎక్కువ మోతాదులో తీసుకోవటం సాధ్యం అవుతుంది. 


రోజూ ఇదే పని చేసి చేసి బోరు కొడుతోంది అని మనం వింటూ ఉంటాం. మీకు కూడా అలానే అనిపిస్తే దాని అర్థం మీకు మీరు చేస్తున్న పని చప్పగా ఉండటం. మీరు పని వదిలేయలేరు కాబట్టి ఆ పని కి అనుబందం గా ఏదో ఒకటి పెట్టుకోండి. 
ఉదా :- ఒక ఆటో, ట్రాక్టర్ డ్రైవర్ కి ఉత్త డ్రైవింగ్ చేయడం వారికి బోరింగ్ గా ఉండొచ్చు. అందుకే వారు పాటలు పెట్టుకుని డ్రైవింగ్ చేస్తూ ఉంటారు.


అలాగే ఇంకొక ఉదాహరణ...

విద్యార్థులు ఒక్కోసారి ఒక ఉపాధ్యాయుడిని అమితమైన భక్తి తో కొలుస్తా ఉంటారు. అంటే ఇష్టపడటం. దానికి కారణం సదరు ఉపాధ్యాయులు చప్పగా ఉండే పాఠాలకి హాస్య సన్ని వేశాలతోనో, లేదా ఆసక్తికర కధలతోనో , నిజ జీవితం లోని ఉదాహరణలు జత చేసి రుచికరంగా తయారు చేసి చెప్పడం మూలాన విద్యార్థులు తమ ఉపాధ్యాయులని ఇష్ట పడుతూ ఉంటారు.


క్లుప్తంగా నేను చెప్పాలనుకున్నది ఏంటంటే....జీవితం కూడా ఒక్కోసారి చప్పగా ఉన్న అన్నం లానే అనిపించవచ్చు. అన్నం చప్పగా ఉందని తినకుండా ఉంటే పరిస్థితి ఎలా ఉండెడ్
 అలా అని అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటే పరిస్థితి ఎలా ఉండేదో ఒక్కసారి ఆలోచించండి. అన్నం ఎలా తినగలం అని ఆలోచనే తినటానికి మార్గం చూపించింది.

మన జీవితం కూడా ఒక్కోసారి చప్పగా ఉన్న అన్నం లాగ తోచవచ్చు. కానీ అనాలోచిత నిర్ణయాల వల్ల లాభం ఉండదు. తెల్లని మేఘం లాగ వెల వెల బోతున్న మన జీవితం కూడ హాయ్ గా ఎలా ఉండాలి అని ఆలోచన చేస్తే  ఇంద్ర ధనుస్సులా రంగులమయం అవుతుంది.


                              

మీ అభిప్రాయాలను కూడా  కామెంట్ సెక్షన్ ద్వారా తెలియజేయగలరు.

                          - 💐 శుభం 💐 -

అమెరికా నిష్క్రమణ పై పత్రిక లో నా లేఖలు.

భూ తాపాన్ని కట్టడి చేయటానికి 2015 లో చేసుకున్న పారిస్ ఒప్పందం నుంచి అమెరికా తప్పుకోవడం పై నేను రాసిన లేఖలు ఈరోజు మన తెలుగు దినపత్రిక లో ప్రచురితమయ్యాయి.

*సూర్య దినపత్రిక *



--*--


*వార్తా దినపత్రిక*



😀 -శుభం - 😀



"బస్సు" జనాలనే కాదు... జ్ఞాపకాలని కూడా మోస్తుంది.

ఆర్టీసీ కార్మికుల సమ్మె ఇంత వరకు వస్తదని నేను ఊహించలేదు. కానీ రోజు రోజుకు ఒక్కో చక్రం ఒక్కో వైపు వెల్తూనే ఉంది !     "రేపటితో ముగుస్తుంది లే" అని ఇప్పటికే ఒక మూడుపదుల సార్లు అనుకుని ఉంటా.  అటు సర్కారు ఉడుం పట్టు ఇటు శ్రామికుల కలసి కట్టు మధ్య సామాన్యులు మాత్రం కిక్కిరిసి పోయిన పల్లె వెలుగు బస్సులోని ప్రయాణికుడి మల్లె "ఏం చేద్దాం, తప్పదు కదా" అని అలా రోజూ నెట్టుకొస్తున్నారు.

జనాలనే కాదు.. జ్ఞాపకాలను కూడా మోస్తున్నది

"రేయ్, ఇప్పుడు త్వరగా పడుకో,పొద్దున్నో ఫస్టు బస్సు కి పోవాలి. అది ఉదయం నాలిగింటికె మనూరికి వస్తది " ఇలాంటి మాటలు మనం నిత్యం వింటూనే ఉంటాo. ఇప్పటికీ పల్లెల్లో రైతులు గాని, కూలీలు గాని, షాపు యజమానులు గాని  సమయాన్ని గడియారం తో కంటే బస్సు రాకపోకలతోనే కొలుస్తా ఉంటారు. అసలు పల్లె వెలుగు బస్సు గురుంచి చెప్పే పనే లేదు. ఆ బస్సుని చూస్తే చాలు పల్లె వాతావరణం ఇట్టే ఉట్టిపడుతుంది. గ్రామీణ వాతావరణం ప్రతిబింబించేలా ఆకు పచ్చ - తెలుపు కాంబినేషన్ లో రంగులు వేశారు లెండి.





అంతే గాక చిన్నప్పుడు "ఎరుపు - గోధుమ" రంగు కాంబినేషన్లో ఉన్న బస్సుని చూస్తే చిన్నతనం కళ్ళ ముందు కదలాడుతుంది. పాఠశాలకి వెళ్లాలంటే బడి బస్సు ఉన్న దాని ఫీజు భరించలేక అని కాక పోయిన ఆర్టీసీ బస్సు అయితే కాస్త ఆలస్యంగా రావటం , "ఎందుకు లేట్ అయింది ?" అని ఉపాధ్యాయులు ప్రశ్నలు సంధిస్తే "నేను ఆర్టీసి బస్సు లో రావాలి,కానీ ఈరోజు చెకింగ్ వల్ల లేట్ అయింది సార్ " అని తాపీగా సమాధానాలు చెప్పటానికి అలాగే సాయంత్రం బస్సు అందదు అనే నెపం తో ఒక గంట ముందే రావటానికి వీలుగా ఉంటదని మా స్నేహితులు చెప్తే నేను కూడా బస్సుకే వెళ్దాం అని ఆర్టీసీ బస్సుతోనే పాఠశాలకు వచ్చే వాడిని.



బస్ పాసు పోతే కండక్టర్ ఎక్కడ అడుగుతాడో అని ,ఎక్కడ ధింపుతాడో అని భయం భయంగా గడిపిన రోజులు. సమైక్యాంధ్ర ఉద్యమాలు జరుగుతుంటే బస్సు కాసేపు ఆపిన వెంటనే దిగి మళ్ళీ మా ఊరు వచ్చే బస్సు ఎక్కి ఇంటికి వచ్చిన రోజులు, "ఏంట్రా ఎందుకు వచ్చారు ?"  అని ఇంట్లో అడిగితే సమైక్యాంధ్ర కు మద్దతుగా పలానా చోట ధర్నాలు అని చెప్పి క్రికెట్ ఆడిన రోజులు, బస్సులో సీటు ఉన్నా ఫూట్ బోర్డ్ మీద ప్రయాణించిన రోజులు, బస్సు టైర్ కి పoక్చర్ అయితే డ్రైవర్ అంకుల్ కి సాయం చేసిన ఘటనలు, హారన్ విని వచ్చేది మన బస్సే అని స్కూల్ బాగ్ తగిలించుకుని, చేతిలో అమ్మ కట్టిన కారేజీ ని పట్టుకుని రన్నింగ్ లో ఎక్కి వెనుక కిటికీ సీటు కోసం ముందే ఎక్కాలని తాపత్రయ పడిన రోజులు,
చదివేది ఐదవ తరగతి కంటే ఎక్కువ చెప్తే కండక్టర్ ₹4 రూపాయల టికెట్టు కొడతారని ₹3 టికెట్ కోసం "నేను చదివేది నాలుగవ తరగతి" అని అబద్దం ఆడిన రోజులు, బస్సు రద్దు అయింది ఈరోజు రాదు అని ఎవరైనా చెప్తే లోలోపల మురిసిపోతూ బిల్డప్ కోసం కాసేపు ఎదురు చూసి ఇంటికి వచ్చిన రోజులు, సాయంత్రం ఇంటికి వెళ్ళటానికి బస్సు కోసం కళ్ళు కాయలు కాసేలా, సరిహద్దుల్లోని సైనికులు శత్రువుల కోసం చూస్తున్నట్లు బస్సు కోసం ఎదురు చూసిన రోజులు........😢😢😢😢

                  


 ఇలా చెప్పుకుంటూ పోతే "అది ,రోడ్డు మీద తిరిగే బస్సు అయినా, చిన్న నాటి మధుర జ్ఞాపకాల్లో నిత్యం తిరుగుతూనే ఉంటుంది".

అలాంటి చిన్న నాటి జ్ఞాపకాలు ఉన్నా కొద్దీ కనుమరుగు అవుతుంటే మనసు తట్టుకోలేక పోతుంది. వాళ్ళ స్వార్థాల కోసం ఇప్పటికే ఎన్నో కోల్పోయాం. మళ్ళీ ఇప్పుడు ఇలా..!
బస్సు కి ఏం కాగూడదని ఆ దేవుడిని కోరుకుంటూ మరొక పోస్టు వచ్చే వరకు విరామం.




మీ అభిప్రాయాలను కూడా నాతో పంచుకోగలరని ఆశిస్తున్నాను.


గమనిక :- నా మాటలకి మంచి దృశ్య రూపం కోసం ఫోటోలను వేరే వెబ్సైట్ నుంచి సేకరించడం జరిగింది. 

మిగిలిపోయిన అన్నం...మనకు నేర్పే పాఠం.

భోజన హోటళ్లలో గాని, మన ఇండ్లలో గాని తినగా మిగిలిపోయిన అన్నాన్ని పక్కన పడేస్తుంటాం. ఇది సహజంగా జరిగే ప్రక్రియనే. కానీ ఇందులో సాటి మనిషి గా నేర్చుకోవాల్సిన జీవిత పాఠం ఒకటి ఉంది. అదేంటంటే మనం ఆహారాన్ని ఊపిరి తీసుకున్నట్లు నిరంతరం తీసుకోము. ఉదరానికి అవసరమైనప్పుడు కావాల్సినంత పెట్టుకుని తిని ఆ అవసరాన్ని తీర్చుకుంటాం. కావాల్సినంత అన్నాన్ని తినగా మిగిలిన దాన్ని మనకేం సంబంధం లేదు అన్నట్లు గా ఎంగిలి పళ్లెం లో వదిలేస్తే దానిని మళ్ళీ తీసుకెళ్లి చెత్త బుట్ట లో పడేస్తాం.

ఆకలి అయినప్పుడు అన్నం కోసం తహతహలాడితే అన్నం తిన్నాక మాత్రం ఓడ మల్లన్న బోడి మల్లన్న చందాన ప్రవర్తిస్తూ ఉంటాం. దీని నుంచి నేను చెప్పదల్చుకుంది ఏంటంటే మనిషిని నడిపేది,పరిగెత్తించేది అవసరం మరియు ఆశ. అవసరం తీరకముందు ఒక వస్తువు కానీ వ్యక్తి కానీ అవసరం అని మనకు తోచితే అదే అవసరం తీరాక అనవసరంగా మారుతుంది. క్లుప్తంగా చెప్పాలంటే అవసరం ముందు అవసరం తరువాత అనే రెండు దశల ప్రక్రియ. మొదటి దశ లో కలిస్తే రెండవ దశ లో విడిపోతాం. జీవితం లో ఒకప్పుడు మన పక్కన ఉండి ఇప్పుడు లేరు అంటే కారణం "తరువాత" దశ లో ఉన్నాం అని. కాబట్టి మనతో ఎల్లప్పుడూ ఉంటారు అనుకోవడం అమాయకత్వం ఎందుకంటే వారి అవసరాలు ఎల్లప్పుడూ తీర్చలెం అలాగే వారికి అవసరం కూడా రాకపోవచ్చు. ఒకవేళ ఉంటున్నారు అంటే ఇంకా ఏదో చేయాల్సిఉందని అర్థం.

మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలియజేయగలరని ఆశిస్తున్నా.

మొదటి పోస్టు కాకపోయినా.....

చేతిలో ఫోన్, ఆ ఫోన్ కి ఇంటర్నెట్ వచ్చాక ఆ అంతర్జాలంలో చేసే దశ దిశ లేని ప్రయాణం అదేనండి సర్ఫింగ్ అంటుంటారు కదా అలా చేసే క్రమంలో ఒక ఆరేళ్ళ క్రితం ఈ బ్లాగర్ గురుంచి తెలిసింది. వెంటనే అప్పటికప్పుడు తట్టిన పేరుతో అట్టహాసంగా (నా దృష్టిలో) ఒక బ్లాగ్ మొదలెట్ట. అక్కడా ,ఇక్కడ కాపీ కొట్టి నా బ్లాగ్ లో పెట్టి పెద్ద ఆస్తిలా ఫీల్ అయ్యే వాడిని. కానీ మనకున్న సహజ లక్షణం తెలిసిందే గా. బుర్ర కి బోరు కొట్టి  మరో చోటుకి (బ్లాగ్ కాకుండా వేరేది) పోదాం అని మారాం చేస్తే ఇక అప్పుడే వదిలేసా. అప్పుడప్పుడు చిన్ననాటి మిత్రునిలగా మదిలో మెదిలినా ఎందుకో గాని ఇటు వైపు రాటం మనసుకు కాస్త బెరుకుగా ఉండేది.

ఇక ఇప్పుడు సమయం వచ్చింది. సున్నిత మనస్తత్వం కావడం తో మనసు సమాజం లో జరుగుతున్న వాటికి చివ్వుక్కుమంటుంది. పక్క వారితో చెప్తే ఇంకోసారి మన పక్కకి రారేమో 😀 అని ఈ వేదిక ద్వార మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను.

మొదటి పోస్టు రాస్తుంటేనే  పచ్చని చెట్లు, గడ్డి, స్వచ్ఛమైన గాలి ఉన్న పార్క్ లో కూర్చుని మాట్లాడుతున్నట్లు ఉంది.


నా పోస్టులకు మీ కామెంట్లను జత చేసి ఉమ్మడి కుటుంబాన్ని తలపిస్తారని ఆశిస్తున్న.

😀😀😀😀😀😀