మీలాంటి చైర్మన్ మళ్ళీ రావాలి





 **మీలాంటి చైర్మన్ మళ్ళీ రావాలి**



రేపటితో ఏపీపియస్సి చైర్మన్ కి పదవికి శ్రీమతి ఏ.ఆర్ అనురాధ గారు ఘనంగా వీడ్కోలు పలకనున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజుల్లోనే మునుపటి చైర్మన్ గౌతమ్ సవంగ్ ఆకస్మాత్తుగా రాజీనామా చేయడం తో ఏర్పడిన కాళీని మొక్కుబడిగా భర్తీ చేయడం కాకుండా  ఎపిపియస్సి లో ప్రక్షాళనే ద్వేయంగా  ప్రభుత్వం గత ఏడాది అక్టోబర్23 న అంకిత భావం కలిగిన ,సమర్ధవంతమైన, ముక్కుసూటి అధికారిగా పేరొందిన అనురాధ గారికి ఎపిపియస్సి పాలనా పగ్గాలు అప్పగించింది. తన 11 నెలల రెండు వారాల పదవి కాలం లో మాలాంటి ఎందరో ఉద్యోగార్థులు మనసు చూరగొన్నారు.

  

నమ్మకం..భరోసా :-


ప్రభుత్వ కొలువు సాధించి సమాజంలో గౌరవం, ఉద్యోగ భద్రత మొదలగు మౌళిక అవసరాల కొరకు మారు మూల పల్లెల నుంచి నగరాల వరకు ఎందరో ఉద్యోగార్థులు ఉన్న కొద్ధి పాటి పోస్టుల కొరకు నిత్య సాధన చేస్తూ పోటీ పడటం విదితమే. కానీ దేశంలో వివిధ రాష్ట్రాల్లో ఉద్యోగ నియామకాల్లో జరుగుతున్న అక్రమాలు బయలుపడిన ప్రతీసారీ మనకు రావాల్సిన ఉద్యోగం మనకు వస్తుందా రాదా అనే ఆందోళనకు ప్రతి ఉద్యోగార్ధి గురవాల్సిన పరిస్థితి.2018 గ్రూప్1 వివాదం నుంచి ఆంధ్రప్రదేశ్ లోని ప్రభుత్వ ఉద్యోగార్థుల ఆశల మీద నీలి నీడలు కమ్ముకున్నాయి. కానీ గత సంవత్సర కాలంగా ఎపిపియస్సి పరీక్షలకు సన్నద్ధం అయ్యే వారికి ఈ ఆందోళన నుంచి ఉపశమనం కలిగించింది అనురాధ గారి చైర్మన్ నియామక. అటువంటి ఉన్నత విలువలు కలిగిన వ్యక్తి పదవి కాలం రేపటి తో పూర్తవ్వడం భావోద్వేగకరమైన అంశం.


నేపధ్యం: 

1987 ఐపీఎస్ బ్యాచ్ కి చెందిన అనురాధ గారు 2015 వ సంవత్సరం లో నిఘా విభాగ అధిపతి గా బాధ్యతలు చేపట్టి ఆయా పదవి చేపట్టిన మొట్ట మొదటి మహిళ అధికారిగా గుర్తింపు పొందారు. 2001-2004 మధ్యకాలంలో బెజవాడ కొత్వాల్ గా బాధ్యతలు చేపట్టి నగరంలో శాంతి భద్రతలు కల్పించి సామాన్య ప్రజలకు భరోసా కలిపించిన ఎన్వీ సురేంద్రబాబు గారికి అనురాధ గారు సతీమణి. తమ సర్వీసు ఆద్యంతం ముక్కుసూటిగా,నిబంధనలు ఉల్లంఘన లేకుండ పని చేసుకుపోయారు తప్ప ఒత్తిడిలకు తలొగ్గలేదు.


ముఖ్యమంత్రి చెప్పినా….వినలేదు:

ప్రభుత్వ పెద్దల అండదండలు తోనే నామినేటెడ్ పదవులు వరిస్తాయి అనేది విధితమే. ఆయా పదవులు చేపట్టిన వారు ప్రభుత్వ పెద్దలను నొప్పించకుండ తమ బాధ్యతలు నిర్వహిస్తారు. అనురాధ గారు ఎపిపియస్సి పగ్గాలు చేపట్టిన రోజు కూడా సగటు ఉద్యోగార్ధి మదిలో మెదలిన ఆలోచనలు ఇవే. ఒక ముక్కుసూటి అధికారి,రూల్ ఆఫ్ లా ని తూచా తప్పకుండా అమలు చేసే అధికారిని ప్రత్యక్షంగా చూసే అవకాశం గ్రూప్2 ప్రధాన పరీక్ష తేదీ కి ముందు యావత్ ఆంధ్రప్రదేశ్ లోని ఉద్యోగార్థులు చూసారు.గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష  ముందు ప్రభుత్వం ఎపిపియస్సి కి ఒక ప్రతిపాదన పంపగా దానిని చైర్మన్ అనురాధ గారు ఆయా ప్రతిపాదనను నాటి ఎమ్మెల్సీ ఎన్నికల కోడు అమలులో ఉన్న దృష్ట్యా పరిగణలోకి తీసుకోలేము అని,అలా చేయడం వలన కోడు ఉల్లంఘన కు పాల్పడినాట్టు అవుతుంది అని సున్నితంగా తిరస్కరించారు. స్వయానా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, సాధారణ పరిపాలన శాఖ చే ప్రతిపాదన పెట్టినప్పప్పటికి తిరస్కరించడం అనురాధ గారి వల్లనే అయ్యింది అనడం లో అతిశయోక్తి లేదు. బహుశా ఆమె స్థానంలో వేరే వ్యక్తి ఉండి ఉంటే అలా జరిగేది కాదేమో. ఆరోజు ఆమె చాకఛాక్యంగా వ్యవహరించి మైనస్ పరిక్షలు సమర్థవంతంగా నిర్వహించి ఔరా అనిపించుకున్నారు. 


గ్రూప్ 1 చకా చకా:


2023 డిసెంబర్ లో విడుదల అయిన గ్రూప్ 1 నోటిఫికేషన్ నత్తనడకన సాగినప్పటికి మెయిన్స్ పరీక్షల సమర్థవంతంగా నిర్వహించి అతి తక్కువ కాలంలో మూల్యాంకనం చేయించి మౌఖిక పరీక్ష కు ఎంపికైన అభ్యర్థుల ఫలితాలు వెల్లడించారు. పిదప మౌఖిక పరీక్షలు సైతం అనురాధ గారి ఏక బోర్డు ఆధ్వర్యంలో నిర్వహించారు.క్రితం గ్రూప్1 మౌఖిక పరీక్ష లలో వచ్చే మార్కుల మీద ఎంతో మందికి అనుమానాలు ఉన్నాయి.గ్రూప్ 1 మౌఖిక పరీక్ష లో పైరవీలు నడుస్తాయి అని, బంధు ప్రీతి మొదలగు అక్రమాలు జరుగుతాయి అని సగటు అభ్యర్థిలో ఉండే అనుమానాలు. ఇదే కారణం చూపిస్తూ గత ప్రభుత్వం ఇంటర్వ్యూ లు రద్దు చేసి ఆ తర్వాత మరలా పునరుద్ధరించింది.ఎక్కువ బోర్డులు ఉంటే మార్కుల్లో వ్యత్యాసం వలన అభ్యర్థులకు న్యాయం జరగదు అని కేవలం ఒక్క బోర్డు తోనే అనురాధ గారు ఇంటర్వ్యూ బోర్డ్ చైర్మన్ గా మౌఖిక పరీక్ష నిర్వహించారు.  జూన్ జులై లో జరిగిన గ్రూప్1 ఇంటర్వ్యూల పట్ల అభ్యర్థులు సంతృప్తి వ్యక్తం చేయడం అనురాధ గారి పట్ల ఉన్న నమ్మకమే.


  అనురాధ గారి పదవి కాలం ముగిసే లోపు తమ ఫలితాలు తెప్పించుకోవాలి అని మెరిట్ అభ్యర్థులు తపించిన్నప్పటికి కొని కారణాల వలన ఆ కోరిక నెరవేరలేదు. ఈ విషయంలో గ్రూప్ 1 అభ్యర్థులు ఒకింత ఆందోళన గా ఉన్నారు. క్రీడా అభ్యర్థులకు ఇంకా మౌఖిక పరీక్ష పూర్తి అవ్వలేదు. ఎవరి మార్కులు ఎంత అనేది అధికారకంగా ధ్రువీకరణ లేదు. మార్కులు ఏమైనా తారు మారు అవుతాయేమో అనే భయాందోళన లో ఉన్నారు అనేది వాస్తవం. తమ మార్కుల జాబితా కొరకు ఎపిపియస్సి ని కోరినప్పటికీ న్యాయ పరమైన చిక్కులు,కోర్టు ధిక్కారణ మొదలగు అంశాల వలన GRL ఇవ్వడానికి కుదరకపోవచ్చు. కానీ అనురాధ గారు సగటు అభ్యర్దిని దృష్టిలో పెట్టుకుని ఎటువంటి మార్పులు చేర్పులు చేయడానికి అవకాశం లేకుండా అభ్యర్థుల మార్కుల విషయమై కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసే ఉంటారు అని ఆశిద్దాం. 


కొత్త చైర్మన్ నియామకం :


రేపటి నుంచి కాళీ అవ్వనున్న ఎపిపియస్సి పదవి కి ప్రభుత్వం తక్కువ వ్యవధిలో నూతన చైర్మన్ నియామకం చేపట్టాలి. అనురాధ గారి వలె నిబద్దత కలిగిన వ్యక్తికి కీలకమైన ఎపిపియస్సి పాలనా పగ్గాలు అప్పగిస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము. రాబోయే నూతన చైర్మన్ గారు పెండింగ్ లో ఉన్న గ్రూప్1,2, డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ మొదలగు కీలక పోస్టుల నియామకం ఎటువంటి అక్రమాలకు ఆస్కారం లేకుండా పూర్తి చేసి ఎందరో ఉద్యోగార్ధుల కోరికను నెరవేరుస్తారు అని ఆశిస్తున్నాము. 2026 సంవత్సరం లో జాబ్ కేలండర్ ఇచ్చి నిరుద్యోగులకు భరోసా కల్పించాలి.


చివరిగా తమిళనాడు నుంచి వచ్చి సుదీర్ఘ కాలం తెలుగు రాష్ట్రాల్లో ఉన్నత సేవలందించి ప్రజల ఆప్యాయత పొందిన శ్రీమతి అనురాధ గారికి పదవి విరమణ శుభాకాంక్షలతో పాటు ముందస్తు జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలి అని కోరుకుంటూ …..మీ అభిమాని.


APPSC లో ఈ సంస్కరణలు రావాలి.

 

నీట్ కుంభకోణం, ఆ తర్వాత వెను వెంటనే యూజీసీ నెట్ పరీక్షా పత్రం లీకేజీ వార్తలు చూసి సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు శభాష్...ఇన్నేళ్ల చరిత్రలో కేవలం ఒక్కసారి కూడా అక్రమాల ఆరోపణలు ఎదురుకోలేదు అంటూ  యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ని పొగడ్తలతో ముంచెత్తారు. కానీ గత మూడు నాలుగు రోజుల నుంచి అటు జాతీయ మీడియా ఇటు సోషల్ మీడియా లో ప్రొబేషనరి ఐఎఎస్ అధికారిణి తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సమర్పించి ఓబీసీ మరియు దివ్యంగుల కోట లో ఉద్యోగం సంపాదించింది అని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.దీనికి స్పందించిన కేంద్ర ప్రభుత్వం ఏక సభ్య కమిటీని నియమించింది.యూపీఎస్సినో లేదా ప్రభుత్వ ఇంటెలిజెన్స్ వర్గాలు వల్ల  ఈ ఉదంతం బయటకి రాలేదు. తనకు సకల సౌకర్యాలు కావాలని సీనియర్ అధికార్లును ఒత్తిడి చేయడం, తన ప్రవర్తన మీద అనుమానం కలిగి తీగ లాగితే డొంక బయటలాడినట్లు ఈ వ్యవహారం బయటకు రావడం గమనార్హం. ఈ వ్యవహారం చూసాక ప్రజల్లో ముఖ్యంగా పోటీ పరీక్షల అభ్యర్థుల్లో యూపీఎస్సి మీద సైతం అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉండగా ఇక రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ల డొల్ల తనం గురించి ఎంత చెప్పినా తక్కువే.

అక్షరాస్యత ఎక్కువ ఉండే కేరళ లో ఆ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా వార్తల్లో ఉంది. ఒక వైద్యుడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో సభ్యత్వం పొందడం కోసం ఆ రాష్ట్ర అధికార పార్టీ నాయకుడికి లంచం ఇచ్చారు. తీరా అనుకున్న పని జరగకపోయే సరికి సదరు వైద్యుడు ఆ పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేయడంతో కేరళ పిఎస్సి కుంభకోణం వెలుగులోకి వచ్చింది. రాజ్యాంగ వ్యవస్థ రాజ్యాంగ పదవి ని సైతం డబ్బులతో కొనడానికి చేసిన ప్రయత్నం చూస్తే విస్మయానికి గురవ్వాల్సి వస్తుంది. ఇలా ఏ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చూసుకున్నా నిత్యం అక్రమాలు,అవినీతి తదితర ఆరోపణలతో వార్తల్లో ఉంటున్నాయి. తాజాగా అస్సాం,అరుణాచల్ ప్రదేశ్,ఛత్తీస్గఢ్ రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్లు ఇదే కోవలో ఉన్నాయి.


రక్షణ కుడ్యాలు:-


సుప్రీం కోర్ట్,ఎన్నికల సంఘం,కాగ్,యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లను రాజ్యాంగపు రక్షణ కుడ్యాలుగా అభివర్ణించారు రాజ్యాంగ నిర్మాత అంబెడ్కర్ గారు. ఇంతటి కీలక వ్యవస్థ అయిన పబ్లిక్ సర్వీస్ కమిషన్ల చైర్మన్,సభ్యుల నియామకం లోపభూయిష్టంగా ఉంది అనేది రాజ్యాంగం లోని 14వ భాగాన్ని చూస్తే ఇదే విషయం తేటతెల్లం అవుతుంది. సభ్యుల యొక్క అర్హతలు, నియమాలు మొదలగు కీలక అంశాలు రాజ్యాంగం లో పేర్కొనలేదు. రాజ్యాంగం విధించిన ఒకే ఒక్క నిబంధన ఏంటి అంటే సభ్యులలో సగం మంది కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వాల్లో కనీసం పదేళ్లు పని చేసి ఉండాలి. 

మిగతా విషయాలును సంబంధిత ప్రభుత్వాల విచక్షణకే వదిలిపెట్టింది.అపరిమిత విచక్షణ అనార్దలకు దారితీస్తుంది అనేది విధితమే.

ఎన్నికల సంఘ సభ్యుల నియామకం కోసం ఏ విదంగా అయితే చట్టాలు తెచ్చారో అదేవిదంగా ఎంతో మంది నిరుద్యోగుల జీవితాలతో ముడిపడి ఉన్న ఈ వ్యవస్థల నియమాలను కూడా పకడ్బందీగా జరిగేలా చట్టాలు తేవాల్సిన అవసరం ఉంది.


రాజకీయ నాయకులకి పునరావస కేంద్రాలు:-


రాజ్యాంగం లో ఈ విషయానికి సంబంధించి ఉన్న లోపాన్ని దేశంలోని కొన్ని అధికార పార్టీలు తమకోసం పాటు పడిన వారికి అప్పనం గా ఆరేళ్ళ పదవి కాలం కలిగిన సభుత్వాలను ఇచ్చి తమ స్వార్ధ ప్రయోజనాలకు వాడుకుంటున్నాయి అనేది సభ్యుల నేపద్యం తదితర విషయాలు చూస్తే అనుమానం కలగక మానదు. ప్రస్తుత ఆంద్రప్రదేశ్ పబ్లిక్ కమిషన్ సభ్యుల నేపథ్యం గురించి వారు క్రితం అధికార పార్టీ ప్రస్తుత విపక్ష పార్టీ కి ఏ విదంగా సంబంధం కలిగి ఉన్నారో ఇటీవల ఒక ప్రధాన పత్రిక కథనాన్ని ప్రచురించింది.


ఇంటర్వ్యూలో మాయాజాలం :-


తాజా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గ్రూపు1 లో ఇంటర్వ్యూలలో అక్రమాలు జరుగుతున్నాయి, గ్రామీణ ప్రాంత అభ్యర్థులకు న్యాయం జరగాలని చెప్పి గ్రూపు1 కి ఇంటర్వ్యూలు ఉండకూడదు అని ఉపన్యాసాలు ఇచ్చి తీరా తూచ్....ఇంటర్వ్యూలు ఉంటాయి, క్రితం సారి తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నాం అంటూ జీవో విడుదల చేసి,మరుసటి రోజే 2022లో గ్రూప్1 నోటిఫికేషన్ ని విడుదల చేసారు. అక్రమాలు జరుగుతున్నాయి అని చెప్పి గ్రూప్1 ఇంటర్వ్యూలను తొలగించిన ప్రభుత్వం మరి తర్వాత ఈ ప్రాతిపదికన మరలా గ్రూప్ 1 ఇంటర్వ్యూలని పునరుద్ధరించారో చెప్పలేదు. ఎవరి ఒత్తిడి మీద నాటి ప్రభుత్వం ఈ పని చేసిందో కూసింత ఇంగిత జ్ఞానం ఉన్నవారికి తెలియక మానదు.



సభ్యుల నియామకం పటిష్టం గా జరగాలి. కొన్ని రోజుల క్రితం చల్లా శ్రీనివాసులు శెట్టి గారు పేరును ప్రభుత్వ రంగ అతిపెద్ద బ్యాంకు అయిన ఎస్బిఐ(sbi) తదుపరి చైర్మన్ గా ఎఫ్ఏస్ఐబీ (FSIB) ప్రతిపాదించింది. ఈ పోస్టుకు పలువురు వ్యక్తులను ముఖిక పరీక్షలు తదితర సామర్ధ్య పరీక్షలు నిర్వహించి పేరుని ప్రతిపాదించింది. క్యాబినెట్ నియామక కమిటీ ఆమోదం పొందితే మన తెలుగు వ్యక్తి ఎస్బీఐ కి చైర్మన్ అవ్వనున్నారు. కాని ఇటువంటి ప్రక్రియ మాత్రం రాజ్యాంగ సంస్థలకి ఇప్పటికి లేకపోవడం మన వ్యవస్థల్లో,పరిపాలన లో డొల్ల తనాన్ని తెలియజేస్తుంది.


 2018 గ్రూప్1 నోటిఫికేషన్ లో ఉద్యోగాలు పొందిన వారి నియామకాలు చెల్లవు అని, వారు మరల మెయిన్స్ పరీక్ష రాయాలని మార్చి లో ఇచ్చిన తీర్పు ను చూసి పోటీ పరీక్ష ల అభ్యర్థులు నివ్వెరపోయారు.నోటిఫికేషన్ రావడం ఒక ఎత్తు, వచ్చాక సమర్థవంతం గా పరిక్ష నిర్వహణ,లోపాలు లేని ప్రశ్న పత్రాలు, సరితగిన కీ,త్వరితగతిన ఫలితాలు వెల్లడి,పోస్టింగులు మొదలు వాటిని లోపాల్లెకుండా పూర్తి చేయడం మరొక ఎత్తు. ఇవి పూర్తయ్యే దాకా పోటీ పరీక్షల అభ్యర్థులు దిన దిన గండమే. పరీక్ష ఎప్పుడు రద్దు చేస్తారో వచ్చిన ఉద్యోగం ఎప్పుడు తీస్తారో అనే అభద్రత భావంలో నిరుద్యోగలు ఉన్నారు. ప్రస్తుతం 2018 బ్యాచ్ గ్రూప్1 అధికారులు ప్రశాంతంగా తమ ఉద్యోగాలు చేసుకోలేని పరిస్థితి. నిజాయితీగా కష్టపడి తెచ్చుకున్న ఉద్యోగం ఎప్పుడు పోతుందో అని భయపడాల్సిన పరిస్థితి రావడానికి కారణం నాడు ఆంద్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ డిజిటల్ మూల్యాంకన గురించి తీసుకున్న కొన్ని నిర్ణయాలు.


తాజాగా గౌతమ్ సవాంగ్ appsc చైర్మన్ గా రాజీనామ చేశారు. అధికారం మారినప్పుడల్లా appsc చైర్మన్లకి తల నొప్పులు తప్పడం లేదు. నాడు ఉదయ భాస్కర్ నేడు గౌతమ్ సవాంగ్ లాగా మరొకరు ఇబ్బంది పడకుండా ఉండాలి అంటే త్వరలో appsc చైర్మన్ గా నియామకం విషయంలో చంద్రబాబు ప్రభుత్వంతగు చర్యలు తీసుకోవాలి.


- సమాప్తం - 

రోడ్డు వేసే వారు కావాలా.... రోడ్డున పడేసే వారు కావాలా ?

 ఎన్నికల సమరం సమీపిస్తున్న తరుణంలో ఓటు ప్రగతి వైపు పడేలా చూసుకోవాల్సిన బాధ్యత సగటు ఓటరు పై ఉన్నది. ఓటు అనేది హక్కు అని పేర్కొన్నప్పటికి అది ఒక బాధ్యత. మన బతుకులు ఎలా ఉండాలో నిర్ణయించే ప్రక్రియ. అటువంటి విలువైన ప్రక్రియ నేటికీ డొల్ల తనం గానే సాగుతుండడం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన మనకి గొడ్డలిపెట్టు లాంటిది.


 ఉచితాలు...మితిమీరిన సంక్షేమం:

ఎన్నికల సమయంలోనే ఉచితాల మీద ఓటర్ల మధ్య చర్చ జరగాల్సిన అవసరం. ఇది ప్రస్తుతం మన దేశంలో, మరీ ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో హద్దు మిరింది. సంపద సృష్టిస్తా,ఉద్యోగాలు పుట్టిస్తా అని మొన్నటి వరకు మాట్లాడిన నాయకులు సైతం ఇప్పుడు సంక్షేమం, ఉచితాల బాట పట్టడం గమనార్హం. ఎన్నికల హామీలు కార్పొరేట్ కంపెనీలు పండగ సీజన్లో అందించే ఆఫర్లు లాగ రూపాంతరం చెందడం గర్హనీయం. ఒక కంపెనీ ఆఫర్ ఇస్తుంది అంటే దాని అంతిమ లక్ష్యం లాభాలను,రాబడులను పెంచుకోవడం కోసమే, కానీ రాజకీయ నాయకులు ఇచ్చే హామీలు వలన రాష్ట్రం కి వచ్చే లాభం గురించి ఆలోచిస్తున్నారా ? లేదు. వారు ఆలోచిస్తున్నది కేవలం అధికారం కోసమే,వారి లాభాల కోసమే గాని రాష్ట్రం కోసమో,రాష్ట్ర ప్రజల కోసమో కాదు.


అసంక్షేమం:- పొరుగు రాష్ట్రాలతో పోల్చుకుంటే సామాజిక భద్రతా ఫించన్లు దాదాపు రెండు,మూడు రెట్లు ఉంటన్నాయి.2050 నాటికి మన దేశంలో వృద్ధుల జనాభా రెట్టింపు అవ్వనుంది తద్వారా వారికి ఇచ్చే ఫించన్ల భారం రాష్ట్రం ఖజానాపై ఇప్పటికంటే ఐదు రేట్లు ఉండే అవకాశము ఉంది. ప్రతీ ఎన్నికకు వేలంపాటను తలపించేలా ప్రధాన రాజకీయ పార్టీలు ఫించన్లు పెంచుకుంటూ పోతున్నారు.

ఇదిలా ఉండగా ఈ మధ్య ఫించనుకు అర్థం మారేలా 40 ఏళ్ళు నిండి,పలానా కులంలో పుడితే చాలు మీ ఖాతాలో డబ్బులేస్తాం అనే దాకా ప్రస్తుత పరిస్థితి వచ్చింది. వృద్ధాప్యం వలనో,శారీరక వైకల్యం వలనో సొంత కాళ్ళమీద నిలబడలేరు కాబట్టి ప్రభుత్వ సాయం అవసరం. కానీ ఈ సహజసూత్రాన్ని మరిచి కేవలం ఓటర్లను ఆకర్షించడానికి ఇమ్మడి ముబ్బడిగా రాజకీయ పార్టీలు హామీలు గుప్పిస్తుంటే, అవి విని సగటు ఓటరు చప్పట్లు కొట్టి శభాష్ అనడం తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుత పరిస్థితి కి అద్దం పడుతుంది.


తప్పు ఎవరిది...?


"చెప్పేటోడు ఎన్నైనా చెప్తడు...ఇనేటోడికి ఉండాలి కదా" అని అన్నట్లు రాజకీయ పార్టీలు వాటి మనుగడ కోసం హామీలు ఇవ్వడం సహజం. కానీ అంతిమంగా వాటికి మీద నిర్ణయం తీసుకునేది రహస్య ఓటింగ్ పద్దతిలో  ఓటరు మాత్రమే.ఉదాహరణకు రోడ్డు వేసిన నాయకులకు ఓటు వేయకుండా,మద్యాన్ని పంచి రోడ్డున పడేసిన వారికి ఓటు వేస్తుంటే, తదుపరి ఎన్నికల్లో రోడ్డు వేసిన నాయకులు సైతం ప్రజల్ని రోడ్డున పడేసే విధానాలే అవలంబిసస్తారు.

  వ్యవస్థలని,పార్టీలని నింధించే బదులు ఓటర్లే ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన తరుణం ఆసన్నమైంది. తాత్కాలిక తాయిలాల ప్రభావం నుంచి బయటకు వచ్చి తార్కికంగా నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఇది. ఈ విషయంలో మేధావులు,జ్ఞానులు సామాజిక మాధ్యమాల ద్వార అవగాహన కల్పించాల్సిన బాధ్యత ఉన్నది. ఉచితాల తో పాటు ఎన్నిక వ్యవస్థని పట్టి పీడిస్తున్న సమస్య "చట్ట సభల్లో నేరగాళ్ల ప్రవేశం" మొదలగు దీర్ఘకాలిక జాడ్యాలకి పరిష్కారం సగటు ఓటరుకి అవగాహన కల్పించడమే.


ఒక్క రోజు ప్రజాస్వామ్యం:


మన దేశం అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం అయినప్పటికి కేవలం ఓటింగ్ రోజు మాత్రమే ఆ ప్రజాస్వామ్య భావనను అనుభవించగలం. ఇతర దేశాల్లోలాగా ఒకసారి ఎన్నికైన ప్రజా ప్రతినిదిని ఓటర్లే తొలగించే రీకాల్, రెఫరెండం లాంటి ప్రజాస్వామ్య సాధనాలు లేవు. కబాట్టి ఐదేళ్లలో ఒక్కసారి వచ్చే అవకాశాన్ని భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని నిర్ణయించుకోవాలి. మాకు నీళ్లు రావట్లేదు,మాకు రోడ్డు వేయట్లేదు,మమ్మల్ని పట్టించుకున్న నాధుడే లేడు అని మీడియా వారితో గోడు వెళ్లబోసుకోవాల్సిన దుస్థితి సగటు ఓటరు తెచుకోవద్దు.




చివరిగా....కులం,మతం,డబ్బు ఇతరాత్ర ప్రభావాల నుంచి బయటకు వచ్చి మీ బిడ్డల భవిష్యత్తు,మీ ఇంటి ఆడవారు బయటకు వెళ్తే క్షేమంగా ఇంటికి తిరిగి వస్తున్నారా? ఏదైనా సమస్య వస్తే పోలీసు వారు పక్షపాతం లేకుండా మన ఫిర్యాదు తీసుకుని న్యాయం చేస్తున్నారా, జబ్బు వచ్చి అసుపత్రికి వెళ్తే కొద్ది పాటి ఖర్చుతో క్షేమంగా ఇంటికి తిరిగి వస్తున్నారా ? మొదలగు ప్రశ్నలు వేసుకుని ప్రతీ ఓటరు మహాశయుడు నిర్ణయం తీసుకుని మన రాష్ట్రాన్ని దేశాన్ని అభివృద్ధి పధంలో దూసుకువెళ్లేలా తమ ఓటు హక్కు ను వినియోగిస్తారు అని ఆశిస్తూ... సెలవు.



ఇదేందిది....ఇది నేను సూడల !

"సామాన్యుడికి దూరం అవుతున్న రైలుబండి" శీర్షికన ఒక వ్యాసాన్ని  ఈ బ్లాగ్ లో రాసుకున్న. నేను రాసుకున్న అన్ని బ్లాగ్ పోస్టుల్లో దీనికి మంచి స్పందన వచ్చింది. పాఠకులు చేసిన వ్యాఖ్యలు నాకు సంతోషాన్ని కలిగించింది. ఆ వ్యాసాన్ని దిశ పత్రిక వార్త,ఆదాబ్ హైదరాబాద్ మొదలగు వాటికి ఈ మెయిల్ ద్వార పంపించాను. ఆదాబ్ హైదరాబాద్ వారు మొన్ననే పబ్లిష్ చేశారు. నా వ్యాసాన్ని పబ్లిష్ చేశారేమో అని ఉదయాన్నే చూస్తూ ఉన్న. ఈరోజు ఉదయం మొబైల్ లో ఈ పేపర్ లో చూస్తుంటే దిశా వారు పబ్లిష్ చేశారు. అలాగే వార్త ఈ పేపర్ కూడా చూసాను.శీర్షికను చూసి అందులో కూడా వచ్చింది అని అనుకున్న. కానీ శీర్షిక లో కొద్దిగా మార్పు వచ్చింది. పేరు ఎవరిదా అని చూస్తే నా పేరు అయితే లేదు. సరే లే....రైలు బండి గురించి వేరే వారు కూడా అభిప్రాయం చెప్తున్నారు గా అని ఆనందం వేసింది. పనిలో పనిగా అందులో ఎలా రాశారు అని చదవడం ఆరంభించాను. వార్త పత్రికలో పబ్లిష్ చేసిన వ్యాసాన్ని పూర్తి గా చదివాక కొన్ని కీలక ఫంక్తులు (lines) నా వ్యాసానికి పోలి ఉన్నాయి. కొద్దిగా బాధ అనిపించింది.వారి మీద నింద మోపే ప్రయత్నం చేయలేను. వార్త లో ప్రచురించిన వ్యాసాన్ని మీ ముందు ఉంచుతున్న. మీరు కూడా చదివి మీ అభిప్రాయాన్ని కామెంట్ల ద్వార తెలియజేయండి.

Image source: vaartha epaper.

ధన్యవాదాలు.

చెంప దెబ్బలు వారికి నొప్పి మనకు.

 

Image source: Google.

ప్రజాస్వామ్యం లో నాలుగో స్థంభం మాది అంటూ ఎదో సమాజానికి మంచి చేసే వారిలా మీడియా వారు పలికే ఉత్తరకుమార ప్రగల్బాలు అందరికి ఎరుకే. ఈరోజు ఉదయం నుంచి ఏ వార్త ఛానల్ పెట్టిన ,సోషల్ మీడియా తెరిచినా ఒకటే వార్త అదే పోలీస్ వారి చెంప మీద ఒక మహిళ నేత ఆమె తల్లి ఒకరి తర్వాత ఒకరు కొట్టడం. ఒకసారి చూపిస్తే చాలు కదా దాన్ని కూడా ఈ మైదా చానెళ్లు రింగు గుర్తు ,బాణం గుర్తు, స్లో మోషన్ పెట్టి మరీ చూపించడం చూస్తుంటే మన చెంప మనం కొట్టుకునేదాక ఆగేలా లేరేమో అనిపించింది. 

ఒకప్పుడు వార్తలు వేసి మధ్యలో ప్రకటనలు ఇస్తారు. వాటినే మేము "సుత్తి" అని పిలిచే వాళ్ళం. ఇప్పుడంటే ఇంగిలి పీసు సదివి advertisement అని మంచు మేడం గారిలా పలుకుతున్నాం అనుకోండి ! కాని ఇప్పుడు ఏది చూసిన సుత్తిలానే ఉంది. దీనికి కారణం ఆ సుత్తి చూసే మనమే. వాళ్ళు ఏం చూపెడుతున్నా నోరు ఎల్లబెట్టి చూస్తుంటే వారికి అంతకు మించి ఇంకేం కావాలి. "నరేష్-పవిత్ర లోకేష్ పెళ్లి ఎప్పుడు చేసుకోబోతున్నారు ?" మొదలగు బర్నింగ్ ఇష్యూస్ మీద తెలుగు మీడియా ఎనర్జీ ని బర్న్ చేసుకోడం ఎబ్బెట్టుగా ఉంటుంది. లోకంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. నీళ్లు లేని,కరెంట్ లేని వాళ్ళు,ఉపాధి లేని వాళ్ళు,ఉంటానికి ఇల్లు లేని వాళ్ళు.....వాళ్ళకోసం చేతిలో మైక్ ఎట్టుకుని అధికారుల్ని,ప్రజా ప్రతినిధుల్ని నిలదీయండి. ఆమె చెంప మీద కొట్టడం దాన్ని ధోని స్టంప్స్ ని కొడితే చూపించినట్లు మాకు చూపించడం ఎందుకో !

అదే పని నాలాంటి సామాన్యుడు అలా చేస్తే మా బొక్కలు విరగదీయరు ! అసలు ఆ పని చేయగలమా ! లేనే లేదు. మరి మాకు ఎటువంటి ఉపయోగం లేని వారు మా రక్షక బటుల్ని ఎలా కొడతారు ? ఓహో.....మమ్మల్ని కొట్టినప్పుడు మేము కొట్టలేము కాబట్టి మాకోసం నాయకులు పోలీసు వారిని కొడుతున్నారా ??? ఓరోరి.....ఇలా కూడా ఉంటాదా. ఇదేదో బాగానే ఉంది లే. 

ఇదుగో మీడియా ఇక నుంచి అయిన కొంచం జనం కి కూసింత ఉపయోగపడే వార్తలని చెప్పండి. పబ్ న్యూస్,డ్రంక్ అండ్ డ్రైవ్ న్యూస్,హీరోయిన్ ప్రేమాయణాలు,మంచు ఇంట్లో అష్టచమ్మా, ఫేస్ టు ఫేస్ సవాళ్లు మాకొద్దు. ఇప్పటికే యూట్యూబ్ ఛానళ్ల ముందు సాటిలైట్ చానెళ్లు బొక్కబోర్ల పడ్డాయి. నాలాంటి బ్రేకింగ్ న్యూస్ బాధితులకు ఇది ఒకింత ఆనంద పడే విషయమే.

మొత్తానికి ఎవరిది తప్పు కాదు. ఎవరికి ఎవరు తీసిపోరు. మనం చూస్తూ ఛిల్ల్ అవడమే.


--- సమాప్తం ---


సామాన్యుడికి దూరం అవుతున్న రైలు బండి




Image source : Business Today.



మునుపెన్నడూ లేని విదంగా భారత రైల్వే వ్యవస్థ వార్తల్లో ప్రముఖంగా నిలుస్తుంది. స్వదేశీ గడ్డ మీద తయారైన వందేభారత్ రైళ్లను పట్టాల మీద పరుగులు పెట్టించడం డెబ్భై ఐదేళ్ల స్వాతంత్ర భారతానికి గర్వకారణం తో పాటు జాతి పితకి అసలైన నివాళి.

భారత రైల్వే వ్యవస్థ ని స్మృశించకుండా ఆధునిక భారత దేశ చరిత్ర ని సంపూర్తిగా తెలుసుకోలేము అనడం అతిశయోక్తి కాదు. సామాన్యుడి రధం గా ముద్ర పడిన రైలు బండి సంస్కరణ దిశగా పయనిస్తున్నప్పటికీ అది సామాన్యుడి కి అందనంత దూరంగా వెళ్తుంది అన్నది నేటి చేదు వాస్తవం.


విడదీయరాని అనుబంధం - భద్రతకు భరోసా:


బ్రిటిష్ వారి దోపిడీ కార్యక్రమం కోసం రైళ్లను ఆరంభించినప్పటికి కాలక్రమేన స్వాతంత్ర భారత సామాన్యుడికి జీవనానికి ఊతంగా నిలిచింది. నామమాత్రపు రుసుముల తో సుదూరపు ప్రయాణాలు సైతం రైలు ద్వార సులభమైంది. నేడు రోడ్ల పై ప్రయాణం అంటే ప్రాణాలతో చెలగాటం ఆడినట్లే. నెత్తురోడుతున్న రోడ్లు వాహన చోదకుల్లో తీవ్ర భయాందోళనలు రేకిత్తిస్తున్నాయి.ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) ప్రకారం ప్రపంచం లో జరిగే 10 రోడ్డు ప్రమాదాల్లో ఒకటి మన దేశంలో జరుగుతుంది అంటే మన దేశంలో రోడ్డు భద్రత ఎంత దీన స్థితిలో ఉందొ అర్థం చేసుకోవచ్చు. ఇటువంటి సంక్లిష్ట స్థితిలో రైల్వే వ్యవస్థ సురక్షిత ప్రయాణానికి ఊతంగా నిలిచింది.


నాణేనికి మరోవైపు:-


    ఒకవైపు వందే భారత్ రైళ్లు పట్టాల మీద పరుగులు పెడుతుంటే మరోవైపు భారత రైల్వే వ్యవస్థ లాభాల్లో అదే జోరు చూపిస్తుంది. ఇటీవల రైల్వేశాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం రైల్వే 2.40 లక్షల కోట్లు ఆదాయాన్ని ఆర్జించి  25% వృద్ధి ని నమోదు చేసింది. 2026 వ సంవత్సరానికి ముంబయి-అహ్మదాబాద్ మధ్య బులెట్ రైలు ప్రారంభానికి సంసిద్ధంగా ఉన్నట్లు ఇటీవల రైల్వే మంత్రి తేల్చి చెప్పారు.

ఇవి రైల్వే శాఖ యొక్క ఎదుగుదల సూచిస్తున్నప్పటికి పాసెంజర్ రైళ్లు,సిబ్బంది నియామక ప్రక్రియ తదితర విషయాల్లో మాత్రం తీవ్ర నిరాశ కలిగిస్తుంది. 


పాసెంజర్ రైళ్లు కనుమరుగు:-


నామమాత్రపు రుసుము తో సామాన్య ప్రయాణికులకు ఆసరాగా నిలిచిన పాసెంజర్ రైళ్లు కోవిడ్ పుణ్యమాన ఇప్పుడు వాటిల్లో ప్రయాణించాలి అంటే ఎక్స్ప్రెస్ రైలు రుసుము చెల్లించాల్సిందే.క్లుప్తంగా చెప్పాలి అంటే నాటి పాసెంజర్ రైళ్లు నేడు కనుమరుగు అయ్యాయి. తీవ్ర ద్రవ్యోల్బణంతో అల్లాడిపోతున్న వారికి గొడ్డలి పెట్టులాంటిది ఈ నిర్ణయం. ఒక సగటు పాసెంజర్ రైలు ఎంతో మందికి జీవన ఉపాది కల్పిస్తుంది. తిను బండారాలు అమ్మేవారు,నిత్యం పల్లెల నుంచి పట్టణాలకు వెళ్లే కార్మికులు మొదలగు అసంఘటిత రంగానికి వెన్నుదన్నుగా నిలిచింది. నేడు అది కనుమరుగు అవ్వడం వారి జీవనుపాధి  మీద తీవ్ర ప్రభావం చూపుతుంది.


గంటలకొద్దీ ఆలస్యం:-


రైలు ప్రయాణ రుసములు పెరగినప్పటికి పాసెంజర్ రైలులో ప్రయాణించే వారికి క్రాసింగ్ ఇబ్బందులు తప్పట్లేదు. ప్రత్యేక రైళ్లు,సూపర్ ఫాస్ట్ తదితర వాటికి మార్గం కొరకు స్టేషన్లలోనే నిలిపేస్తున్నారు. ఒక్కసారి ఆగితే మళ్ళీ బండి ముందుకు ఎప్పుడు కదిలిద్దో తెలీని పరిస్థితి.నిర్ణీత సమయానికి పాసెంజర్ రైళ్లు చేరుకున్న సందర్భాలు వేళ్ళ మీద లెక్కపెట్టవచ్చు.గంటలకొలది ఆలస్యంతో పాటు ఒక్కోసారి ముందస్తు సమాచారం లేకుండానే పాసెంజర్ రైళ్లను రద్దు చేయడం మొదలగునవి వీటి పట్ల పాలకులకు మరియు అధికారులకు ఉన్న శ్రద్ధాసక్తులను ప్రతిబింబిస్తుంది.


ఇదిలా ఉండగా రైల్వేస్టేషన్ లో రద్దీ నియంత్రణ లక్ష్యంగా రైల్వేశాఖ ప్లాట్ఫారం టికెట్ ధరలు అమాంతం పెంచింది. ఇది ఒకింత మంచి చేస్తున్నప్పటికీ వృద్దులు,దివ్యాంగుల సహాయార్థం గమ్యస్థానం స్టేషన్ కి వచ్చే వారికి ఇది భారంగా మారింది. ప్రయాణ టికెట్ కన్నా ప్లాట్ఫారం టికెట్ ధర ఎక్కువ ఉన్న సంగతులు విధితమే. దరిమిలా అసలు రైలు ప్రయాణం అంటేనే ప్రయాణీకులు నిట్టూర్పు విడిచే పరిస్థితులు తలెత్తాయి. మరోవైపు కోవిడ్ కి ముందు ఉన్న రాయితీలు సైతం ఇప్పుడు లేకపోవడం రైలు ప్రయాణం వృద్దలకు అదనపు భారంగా మారింది. ఇటీవల రైల్వే స్థాయి సంఘం సీనియర్ సిటిజన్స్ కి ఇచ్చే రాయితీని తిరిగి అందుబాటులో కి తీసుకురావాలి అని సిఫార్సు చేసినప్పటికీ రైల్వేశాఖ దానికి తిరస్కరిస్తూ ఇప్పటికే అన్ని వర్గాల ప్రయాణికులకు 50% పైగా రాయితీ ఇస్తున్నాం కాబట్టి అదనంగా రాయితీలు ఏం అవసరం లేదని తేల్చి చెప్పింది.పెరిగిన జీవన వ్యయం తో పాటు ఆరోగ్య ఖర్చులకు తోడు ఈ రాయితీ నిలుపుదల ఆయా వర్గాల ప్రజలకు ఇదొక పెను భారమే.


లాభాపేక్ష కన్నా ప్రజా ప్రయోజనాలకు ప్రాముఖ్యత ఇవ్వాలి:-


భారీ రుసములు తో ఒక వైపు ప్రజల నడ్డి విరుస్తూ మరో వైపు ఎన్ని కోట్లు ఆదాయం అర్జించిన లాభమేమి !  పేద, మధ్య తరగతి ప్రజల కొరకు రైల్వేశాఖ లాభాపేక్ష పక్కనపెట్టి రుసుములు అందుబాటులో ఉండేలా ప్రణాళికలు రచించాలు. రైల్వేశాఖ కు భారీగా ఆదాయాన్ని సమకూర్చే సరుకు రవాణా విభాగం మీద ఖర్చు భారం పెంచి పాసెంజర్ విభాగం లో రుసములు చౌకగా ఉండేలా విధానాలు రూపొందించాలి. వృద్దులకు రాయితీని పునరుద్ధరించాలి. తృతీయ స్థాయి ఆరోగ్య సేవల (tertiary health care services) కొరకు పల్లెల నుంచి మెట్రో నగరాలు రావాల్సి ఉంటుంది. రాయితీలు ఉంటే వారికి ఉపశమనం కలుగుతుంది.


హైదరాబాద్ మెట్రో లాంటి విజయవంతంగా నిర్వహింపబడుతున్న మెట్రోల నుంచి రైల్వేశాఖ వారు స్ఫూర్తి పొందాలి. మెట్రో రైలు లోకి టికెట్ లేకుండా ప్రవేశించడం అసాధ్యం.అటువంటి పటిష్ట వ్యవస్థల్ని భారత రైల్వేశాఖ ఆవలంభించాలి. తద్వారా అధిక రుసుములు వడ్డించకుండానే ఆదాయాన్ని పెంచుకునే అవకాశం ఉంటుంది. టికెట్ లేకుండా రైలు ప్రయాణం చేసే వారు కోకొల్లలు. కొన్ని రాష్ట్రాల్లో టికెట్ అడిగితే ఎక్కడ దాడి చేస్తారో అని సిబ్బంది భయపడే పరిస్థితి ఉంది.  ఇటువంటి వాటిల్లో ఇంకా సంస్కరణలు చేపట్టాలి. టెక్నాలజీ ని అందిపుచ్చుకుని టికెట్ లేని ప్రయానాణానికి అడ్డుకట్టవెయ్యాలి.


  మాజీ రైల్వేశాఖ మంత్రి సురేష్ ప్రభు నాటి రైల్వే బడ్జెట్ లో ప్రసంగిస్తూ రైల్వే ఆర్థిక స్థితి మెరుగుపడటానికి రుసుము పెంపు ఒక్కటే మార్గం కాదని ప్రకటనలు మొదలగు ఇతర మార్గాలు ఎన్నో ఉన్నాయి అని మంచి మార్గదర్శనం చేశారు.వాటిని నేటి శాఖ భాద్యులు, అధికారులు విస్మరించకుండా ఆచరణ లో పెట్టాలి. ప్రజా ప్రయోజనాలే పరమావధిగా పేద మధ్య తరగతి వారికి రైల్వే ప్రయాణం అందుబాటులో ఉండాలి. వందేభారత్ మరియు బులెట్ రైళ్లు ఆహ్వానించదగ్గవి ఐనప్పటికి వాటి మోజులో పడి ప్రస్తుతం ఉన్న రైళ్ళని విస్మరించవద్దు.

రైల్వే వ్యవస్థ లో ఎన్ని సంస్కరణలు వచ్చిన,ఎన్ని ఆవిష్కరణలు వచ్చినా రైలు ప్రయాణం అందరికి అందుబాటులో ఉంటేనే అసలు లక్ష్యం నెరవేరుతుంది.



-- సమాప్తం --