మీలాంటి చైర్మన్ మళ్ళీ రావాలి





 **మీలాంటి చైర్మన్ మళ్ళీ రావాలి**



రేపటితో ఏపీపియస్సి చైర్మన్ కి పదవికి శ్రీమతి ఏ.ఆర్ అనురాధ గారు ఘనంగా వీడ్కోలు పలకనున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజుల్లోనే మునుపటి చైర్మన్ గౌతమ్ సవంగ్ ఆకస్మాత్తుగా రాజీనామా చేయడం తో ఏర్పడిన కాళీని మొక్కుబడిగా భర్తీ చేయడం కాకుండా  ఎపిపియస్సి లో ప్రక్షాళనే ద్వేయంగా  ప్రభుత్వం గత ఏడాది అక్టోబర్23 న అంకిత భావం కలిగిన ,సమర్ధవంతమైన, ముక్కుసూటి అధికారిగా పేరొందిన అనురాధ గారికి ఎపిపియస్సి పాలనా పగ్గాలు అప్పగించింది. తన 11 నెలల రెండు వారాల పదవి కాలం లో మాలాంటి ఎందరో ఉద్యోగార్థులు మనసు చూరగొన్నారు.

  

నమ్మకం..భరోసా :-


ప్రభుత్వ కొలువు సాధించి సమాజంలో గౌరవం, ఉద్యోగ భద్రత మొదలగు మౌళిక అవసరాల కొరకు మారు మూల పల్లెల నుంచి నగరాల వరకు ఎందరో ఉద్యోగార్థులు ఉన్న కొద్ధి పాటి పోస్టుల కొరకు నిత్య సాధన చేస్తూ పోటీ పడటం విదితమే. కానీ దేశంలో వివిధ రాష్ట్రాల్లో ఉద్యోగ నియామకాల్లో జరుగుతున్న అక్రమాలు బయలుపడిన ప్రతీసారీ మనకు రావాల్సిన ఉద్యోగం మనకు వస్తుందా రాదా అనే ఆందోళనకు ప్రతి ఉద్యోగార్ధి గురవాల్సిన పరిస్థితి.2018 గ్రూప్1 వివాదం నుంచి ఆంధ్రప్రదేశ్ లోని ప్రభుత్వ ఉద్యోగార్థుల ఆశల మీద నీలి నీడలు కమ్ముకున్నాయి. కానీ గత సంవత్సర కాలంగా ఎపిపియస్సి పరీక్షలకు సన్నద్ధం అయ్యే వారికి ఈ ఆందోళన నుంచి ఉపశమనం కలిగించింది అనురాధ గారి చైర్మన్ నియామక. అటువంటి ఉన్నత విలువలు కలిగిన వ్యక్తి పదవి కాలం రేపటి తో పూర్తవ్వడం భావోద్వేగకరమైన అంశం.


నేపధ్యం: 

1987 ఐపీఎస్ బ్యాచ్ కి చెందిన అనురాధ గారు 2015 వ సంవత్సరం లో నిఘా విభాగ అధిపతి గా బాధ్యతలు చేపట్టి ఆయా పదవి చేపట్టిన మొట్ట మొదటి మహిళ అధికారిగా గుర్తింపు పొందారు. 2001-2004 మధ్యకాలంలో బెజవాడ కొత్వాల్ గా బాధ్యతలు చేపట్టి నగరంలో శాంతి భద్రతలు కల్పించి సామాన్య ప్రజలకు భరోసా కలిపించిన ఎన్వీ సురేంద్రబాబు గారికి అనురాధ గారు సతీమణి. తమ సర్వీసు ఆద్యంతం ముక్కుసూటిగా,నిబంధనలు ఉల్లంఘన లేకుండ పని చేసుకుపోయారు తప్ప ఒత్తిడిలకు తలొగ్గలేదు.


ముఖ్యమంత్రి చెప్పినా….వినలేదు:

ప్రభుత్వ పెద్దల అండదండలు తోనే నామినేటెడ్ పదవులు వరిస్తాయి అనేది విధితమే. ఆయా పదవులు చేపట్టిన వారు ప్రభుత్వ పెద్దలను నొప్పించకుండ తమ బాధ్యతలు నిర్వహిస్తారు. అనురాధ గారు ఎపిపియస్సి పగ్గాలు చేపట్టిన రోజు కూడా సగటు ఉద్యోగార్ధి మదిలో మెదలిన ఆలోచనలు ఇవే. ఒక ముక్కుసూటి అధికారి,రూల్ ఆఫ్ లా ని తూచా తప్పకుండా అమలు చేసే అధికారిని ప్రత్యక్షంగా చూసే అవకాశం గ్రూప్2 ప్రధాన పరీక్ష తేదీ కి ముందు యావత్ ఆంధ్రప్రదేశ్ లోని ఉద్యోగార్థులు చూసారు.గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష  ముందు ప్రభుత్వం ఎపిపియస్సి కి ఒక ప్రతిపాదన పంపగా దానిని చైర్మన్ అనురాధ గారు ఆయా ప్రతిపాదనను నాటి ఎమ్మెల్సీ ఎన్నికల కోడు అమలులో ఉన్న దృష్ట్యా పరిగణలోకి తీసుకోలేము అని,అలా చేయడం వలన కోడు ఉల్లంఘన కు పాల్పడినాట్టు అవుతుంది అని సున్నితంగా తిరస్కరించారు. స్వయానా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, సాధారణ పరిపాలన శాఖ చే ప్రతిపాదన పెట్టినప్పప్పటికి తిరస్కరించడం అనురాధ గారి వల్లనే అయ్యింది అనడం లో అతిశయోక్తి లేదు. బహుశా ఆమె స్థానంలో వేరే వ్యక్తి ఉండి ఉంటే అలా జరిగేది కాదేమో. ఆరోజు ఆమె చాకఛాక్యంగా వ్యవహరించి మైనస్ పరిక్షలు సమర్థవంతంగా నిర్వహించి ఔరా అనిపించుకున్నారు. 


గ్రూప్ 1 చకా చకా:


2023 డిసెంబర్ లో విడుదల అయిన గ్రూప్ 1 నోటిఫికేషన్ నత్తనడకన సాగినప్పటికి మెయిన్స్ పరీక్షల సమర్థవంతంగా నిర్వహించి అతి తక్కువ కాలంలో మూల్యాంకనం చేయించి మౌఖిక పరీక్ష కు ఎంపికైన అభ్యర్థుల ఫలితాలు వెల్లడించారు. పిదప మౌఖిక పరీక్షలు సైతం అనురాధ గారి ఏక బోర్డు ఆధ్వర్యంలో నిర్వహించారు.క్రితం గ్రూప్1 మౌఖిక పరీక్ష లలో వచ్చే మార్కుల మీద ఎంతో మందికి అనుమానాలు ఉన్నాయి.గ్రూప్ 1 మౌఖిక పరీక్ష లో పైరవీలు నడుస్తాయి అని, బంధు ప్రీతి మొదలగు అక్రమాలు జరుగుతాయి అని సగటు అభ్యర్థిలో ఉండే అనుమానాలు. ఇదే కారణం చూపిస్తూ గత ప్రభుత్వం ఇంటర్వ్యూ లు రద్దు చేసి ఆ తర్వాత మరలా పునరుద్ధరించింది.ఎక్కువ బోర్డులు ఉంటే మార్కుల్లో వ్యత్యాసం వలన అభ్యర్థులకు న్యాయం జరగదు అని కేవలం ఒక్క బోర్డు తోనే అనురాధ గారు ఇంటర్వ్యూ బోర్డ్ చైర్మన్ గా మౌఖిక పరీక్ష నిర్వహించారు.  జూన్ జులై లో జరిగిన గ్రూప్1 ఇంటర్వ్యూల పట్ల అభ్యర్థులు సంతృప్తి వ్యక్తం చేయడం అనురాధ గారి పట్ల ఉన్న నమ్మకమే.


  అనురాధ గారి పదవి కాలం ముగిసే లోపు తమ ఫలితాలు తెప్పించుకోవాలి అని మెరిట్ అభ్యర్థులు తపించిన్నప్పటికి కొని కారణాల వలన ఆ కోరిక నెరవేరలేదు. ఈ విషయంలో గ్రూప్ 1 అభ్యర్థులు ఒకింత ఆందోళన గా ఉన్నారు. క్రీడా అభ్యర్థులకు ఇంకా మౌఖిక పరీక్ష పూర్తి అవ్వలేదు. ఎవరి మార్కులు ఎంత అనేది అధికారకంగా ధ్రువీకరణ లేదు. మార్కులు ఏమైనా తారు మారు అవుతాయేమో అనే భయాందోళన లో ఉన్నారు అనేది వాస్తవం. తమ మార్కుల జాబితా కొరకు ఎపిపియస్సి ని కోరినప్పటికీ న్యాయ పరమైన చిక్కులు,కోర్టు ధిక్కారణ మొదలగు అంశాల వలన GRL ఇవ్వడానికి కుదరకపోవచ్చు. కానీ అనురాధ గారు సగటు అభ్యర్దిని దృష్టిలో పెట్టుకుని ఎటువంటి మార్పులు చేర్పులు చేయడానికి అవకాశం లేకుండా అభ్యర్థుల మార్కుల విషయమై కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసే ఉంటారు అని ఆశిద్దాం. 


కొత్త చైర్మన్ నియామకం :


రేపటి నుంచి కాళీ అవ్వనున్న ఎపిపియస్సి పదవి కి ప్రభుత్వం తక్కువ వ్యవధిలో నూతన చైర్మన్ నియామకం చేపట్టాలి. అనురాధ గారి వలె నిబద్దత కలిగిన వ్యక్తికి కీలకమైన ఎపిపియస్సి పాలనా పగ్గాలు అప్పగిస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము. రాబోయే నూతన చైర్మన్ గారు పెండింగ్ లో ఉన్న గ్రూప్1,2, డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ మొదలగు కీలక పోస్టుల నియామకం ఎటువంటి అక్రమాలకు ఆస్కారం లేకుండా పూర్తి చేసి ఎందరో ఉద్యోగార్ధుల కోరికను నెరవేరుస్తారు అని ఆశిస్తున్నాము. 2026 సంవత్సరం లో జాబ్ కేలండర్ ఇచ్చి నిరుద్యోగులకు భరోసా కల్పించాలి.


చివరిగా తమిళనాడు నుంచి వచ్చి సుదీర్ఘ కాలం తెలుగు రాష్ట్రాల్లో ఉన్నత సేవలందించి ప్రజల ఆప్యాయత పొందిన శ్రీమతి అనురాధ గారికి పదవి విరమణ శుభాకాంక్షలతో పాటు ముందస్తు జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలి అని కోరుకుంటూ …..మీ అభిమాని.


No comments:

Post a Comment