పెద్ద నోట్ల రద్దుకు పదేళ్లు… అప్పటి జ్ఞాపకాలు !


పెద్ద నోట్ల రద్దు జరిగి నేటికి పదేళ్లు పూర్తయ్యాయి. కానీ అవి పదేళ్ల వ్యవధిలా అనిపించడం లేదు… పది నెలలు గడిచినట్లుగా ఉంది!

2016 నవంబర్ 8 సాయంత్రం ప్రధాని మోదీ మీడియా సమావేశం ఏర్పాటు చేసి, జాతినుద్దేశించి ప్రసంగిస్తూ, ఆ క్షణం నుంచి అప్పటివరకు చలామణిలో ఉన్న రూ.500, రూ.1,000 నోట్లు చిత్తు కాగితాలతో సమానమని ప్రకటించారు. దీంతో జనాలు భయాందోళనలతో ఏటీఎంల వద్ద బారులు తీరారు.

నాడు ప్రముఖ సామాజిక మాధ్యమంగా ఉన్న ఫేస్‌బుక్ వేదికగా నరేంద్ర మోదీని ఇలాంటి సంచలన నిర్ణయం తీసుకున్నందుకు పొగుడుతూ పోస్టులు వెల్లువెత్తాయి. నోట్ల రద్దు తర్వాత దాదాపు ఆరు నెలల పాటు ప్రజలు పడిన ఇబ్బందులు, అప్పటి జ్ఞాపకాలను ఒకసారి నెమరువేసుకోవాలనే ఉద్దేశంతో ఈ బ్లాగ్ పోస్ట్.

పరీక్షల మధ్యలో నోట్ల రద్దు!

2016 నవంబర్ నెలలో నాకు CA-IPCC పరీక్షలు జరుగుతున్నాయి. కృష్ణా పుష్కరాల హడావుడి తదితర కారణాల వల్ల విజయవాడలో ఉండాల్సిన నేను, స్నేహితులు గుంటూరులో ఉండటంతో అక్కడికి షిఫ్ట్ అయ్యాను. బ్రాడీపేట బదులు అరండల్‌పేటలోని ఒక CA ఇన్‌స్టిట్యూట్‌లో చేరాను. హాస్టల్ కూడా దానికి దగ్గర్లోనే ఉండేది. పరీక్ష కేంద్రం చాలా దూరం అయినప్పటికీ నడుచుకుంటూ వెళ్లేవాడిని.

టాక్స్ పేపర్ చివరి పరీక్ష. దానికి ముందు రోజే ఈ నోట్ల రద్దు నిర్ణయం జరిగింది.

నవంబర్ 8 సాయంత్రం హాస్టల్ ఫీజు కట్టడానికి వెళ్తుంటే, అప్పటికే హాస్టల్‌లో ఉన్న స్నేహితులందరూ యూట్యూబ్‌లో ప్రధాని ప్రసంగం వినడంలో నిమగ్నమయ్యారు. అదే సంవత్సరం జియో ఉచిత ఇంటర్నెట్ అందిస్తుండటంతో వార్తలు చూడటం అందరికీ సులభమైంది.

ఏముందిలే... మళ్లీ ఏదో పాకిస్థాన్ మీద దాడి గురించి చెప్తారేమో అనుకుంటూ ఏటీఎం కార్డు కోసం వెతుకుతున్నాను.

బయటకు వెళ్లి సరదాగా అటూ ఇటూ తిరిగి, హాస్టల్ ఫీజు కట్టడం కోసం ఏటీఎం వద్దకు వెళ్లాను. అప్పటికి అక్కడ ఏమంత హడావుడి లేదు. ఎప్పటిలాగే నాలుగు వేలు డ్రా చేసుకున్నాను. వాటిల్లో అప్పటికే రద్దు చేసినట్లు ప్రకటించిన నోట్లే ఎక్కువగా ఉన్నాయి. కానీ నాకు ఆ విషయం తెలియదు!

తిన్నగా హాస్టల్‌కు రాగానే అందరూ హాస్టల్ ఓనర్ అంకుల్‌తో కూర్చుని మాట్లాడుతున్నారు. అప్పుడే నాకు అసలు విషయం అర్థమైంది. తర్వాత ఓనర్‌ను నచ్చజెప్పి అవే నోట్లు ఫీజు కింద ఇచ్చేశాను.

ఏటీఎంల చుట్టూ తిరిగిన రోజులు!

IPCC పరీక్షలు పూర్తయ్యాయి. అయినా మరో వారం పాటు బ్రాడీపేటలో ఉన్న నా స్నేహితుడు శివకుమార్ రూమ్‌లోనే ఉన్నాను. సరదాగా ఒక వారం అక్కడే ఉండి, గుంటూరు నుంచి ఇంటర్‌సిటీ ట్రైన్‌లో మధిర చేరుకుని, అక్కడి నుంచి మా ఊరికి వచ్చాను.

ఇంటికి వచ్చాక నా పని... మా కుటుంబ సభ్యుల బ్యాంకు ఖాతాల్లో పంట అమ్మిన డబ్బులను డ్రా చేసుకుని రావడం!

ఒక నాలుగు ఏటీఎం కార్డులు జేబులో వేసుకుని ఏటీఎంల ముందు గంటల పాటు నిలబడేవాడిని. కార్డుకు ఒక రోజులో కేవలం రెండు వేల రూపాయల పరిమితి మాత్రమే ఉండేది.

ఎక్కువ కార్డులు తెచ్చి డ్రా చేస్తున్నారని కొన్ని బ్యాంకుల వాళ్లు సెక్యూరిటీ గార్డులను పెట్టి, ఒక్క కార్డుతో మాత్రమే అనుమతించేవారు. మా ఊరిలో డబ్బులు దొరకనప్పుడు మధిర వెళ్లి డ్రా చేసుకుని వచ్చేవాడిని.

అప్పట్లో నా దగ్గర ఉన్నది నోకియా కీప్యాడ్ ఫోన్ మాత్రమే. స్మార్ట్‌ఫోన్ లేదు. ఫోన్‌పేలు, గూగుల్‌పేలు లేవు. అయితే, ఆ చిన్న ఫోన్‌లోనే *#99# డయల్ చేసి మొబైల్ బ్యాంకింగ్ ద్వారా లావాదేవీలు చేసేవాడిని. ఇప్పటి యూపీఐ చెల్లింపులతో పోలిస్తే అది చాలా ప్రాథమికమైన విధానం. అయినా అప్పట్లో అదే ఒక సౌకర్యం.

ఏదైనా బ్యాంకింగ్ సంబంధిత సమస్య వస్తే కస్టమర్ కేర్‌కు తరచూ ఫోన్ చేసేవాడిని. ఇది నాకు స్పోకెన్ ఇంగ్లీష్‌కు కూడా సాయపడింది. తెలిసిన వాళ్లతో ఇంగ్లీష్ మాట్లాడటం కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. కానీ కస్టమర్ కేర్ వాళ్లు మనకు పరిచయం ఉండరు కాబట్టి, తప్పులు వచ్చినా అలాగే మాట్లాడేవాడిని. అలా నా కమ్యూనికేషన్ స్కిల్స్ కొద్దిగా ఇంప్రూవ్ అయ్యాయి.

అప్పట్లో రోజూ నోట్ల రద్దు వార్తలు, ప్రజల ఇబ్బందులతోనే టీవీలు, దినపత్రికలు నిండిపోయేవి.

రెండు వేల నోటు... అదొక స్టేటస్ సింబల్!

రెండు వేల నోటు చేతికి రాగానే అదొక స్టేటస్ సింబల్‌గా మారిపోయింది. వాట్సాప్ స్టేటస్‌లు దద్దరిల్లిపోయేవి. అప్పట్లో ఆ నోటులో చిప్ అమర్చారని, డబ్బు ఎక్కడ దాచినా తెలిసిపోతుందని ప్రచారం కూడా జరిగింది.

నోట్ల వేటతోనే ఆ రెండు నెలలు గడిచిపోయాయి. ఫలానా ఏటీఎంలో డబ్బులు ఉన్నాయని తెలియగానే అక్కడికి పరిగెత్తేవాడిని. మరోవైపు టీవీ9లో అసలు ఇది ఒక అట్టర్ ప్లాప్ నిర్ణయం అంటూ డిబేట్లు జరిగేవి.

పదేళ్ల తర్వాత వెనక్కి తిరిగి చూస్తే...

ఈ నోట్ల రద్దు నిర్ణయం వల్ల కలిగిన మార్పుల్లో ఒకటి... ఆన్‌లైన్ పేమెంట్ విధానం గ్రామాల్లో కూడా వేగంగా విస్తరించడం. తోపుడు బండ్ల వాళ్లు, వీధి వ్యాపారులు కూడా సాంకేతికతను అందిపుచ్చుకున్నారు. ఇప్పుడు స్కానర్ లేని చిరు వ్యాపారులు లేరంటే అతిశయోక్తి కాదు.

నోట్ల రద్దు వల్ల దేశానికి జరిగిన లాభనష్టాలపై చర్చ వేరు. కానీ ఆ సమయంలో ఒక విద్యార్థిగా నేను ఎదుర్కొన్న అనుభవాలు మాత్రం ఎప్పటికీ గుర్తుండిపోతాయి.

నాలుగు ఏటీఎం కార్డులు జేబులో వేసుకుని తిరగడం, ఏటీఎంల ముందు గంటల తరబడి నిలబడటం, నోకియా ఫోన్‌లో *#99# ద్వారా లావాదేవీలు చేయడం, రెండు వేల నోటు కోసం ఎదురుచూడటం... ఇవన్నీ ఇప్పుడు తలుచుకుంటే ఏదో నిన్న మొన్న జరిగినట్లుగా అనిపిస్తోంది.

అప్పుడే పదేళ్లు గడిచిపోయాయా!

No comments:

Post a Comment