ఇదేందిది....ఇది నేను సూడల !

"సామాన్యుడికి దూరం అవుతున్న రైలుబండి" శీర్షికన ఒక వ్యాసాన్ని  ఈ బ్లాగ్ లో రాసుకున్న. నేను రాసుకున్న అన్ని బ్లాగ్ పోస్టుల్లో దీనికి మంచి స్పందన వచ్చింది. పాఠకులు చేసిన వ్యాఖ్యలు నాకు సంతోషాన్ని కలిగించింది. ఆ వ్యాసాన్ని దిశ పత్రిక వార్త,ఆదాబ్ హైదరాబాద్ మొదలగు వాటికి ఈ మెయిల్ ద్వార పంపించాను. ఆదాబ్ హైదరాబాద్ వారు మొన్ననే పబ్లిష్ చేశారు. నా వ్యాసాన్ని పబ్లిష్ చేశారేమో అని ఉదయాన్నే చూస్తూ ఉన్న. ఈరోజు ఉదయం మొబైల్ లో ఈ పేపర్ లో చూస్తుంటే దిశా వారు పబ్లిష్ చేశారు. అలాగే వార్త ఈ పేపర్ కూడా చూసాను.శీర్షికను చూసి అందులో కూడా వచ్చింది అని అనుకున్న. కానీ శీర్షిక లో కొద్దిగా మార్పు వచ్చింది. పేరు ఎవరిదా అని చూస్తే నా పేరు అయితే లేదు. సరే లే....రైలు బండి గురించి వేరే వారు కూడా అభిప్రాయం చెప్తున్నారు గా అని ఆనందం వేసింది. పనిలో పనిగా అందులో ఎలా రాశారు అని చదవడం ఆరంభించాను. వార్త పత్రికలో పబ్లిష్ చేసిన వ్యాసాన్ని పూర్తి గా చదివాక కొన్ని కీలక ఫంక్తులు (lines) నా వ్యాసానికి పోలి ఉన్నాయి. కొద్దిగా బాధ అనిపించింది.వారి మీద నింద మోపే ప్రయత్నం చేయలేను. వార్త లో ప్రచురించిన వ్యాసాన్ని మీ ముందు ఉంచుతున్న. మీరు కూడా చదివి మీ అభిప్రాయాన్ని కామెంట్ల ద్వార తెలియజేయండి.

Image source: vaartha epaper.

ధన్యవాదాలు.

చెంప దెబ్బలు వారికి నొప్పి మనకు.

 

Image source: Google.

ప్రజాస్వామ్యం లో నాలుగో స్థంభం మాది అంటూ ఎదో సమాజానికి మంచి చేసే వారిలా మీడియా వారు పలికే ఉత్తరకుమార ప్రగల్బాలు అందరికి ఎరుకే. ఈరోజు ఉదయం నుంచి ఏ వార్త ఛానల్ పెట్టిన ,సోషల్ మీడియా తెరిచినా ఒకటే వార్త అదే పోలీస్ వారి చెంప మీద ఒక మహిళ నేత ఆమె తల్లి ఒకరి తర్వాత ఒకరు కొట్టడం. ఒకసారి చూపిస్తే చాలు కదా దాన్ని కూడా ఈ మైదా చానెళ్లు రింగు గుర్తు ,బాణం గుర్తు, స్లో మోషన్ పెట్టి మరీ చూపించడం చూస్తుంటే మన చెంప మనం కొట్టుకునేదాక ఆగేలా లేరేమో అనిపించింది. 

ఒకప్పుడు వార్తలు వేసి మధ్యలో ప్రకటనలు ఇస్తారు. వాటినే మేము "సుత్తి" అని పిలిచే వాళ్ళం. ఇప్పుడంటే ఇంగిలి పీసు సదివి advertisement అని మంచు మేడం గారిలా పలుకుతున్నాం అనుకోండి ! కాని ఇప్పుడు ఏది చూసిన సుత్తిలానే ఉంది. దీనికి కారణం ఆ సుత్తి చూసే మనమే. వాళ్ళు ఏం చూపెడుతున్నా నోరు ఎల్లబెట్టి చూస్తుంటే వారికి అంతకు మించి ఇంకేం కావాలి. "నరేష్-పవిత్ర లోకేష్ పెళ్లి ఎప్పుడు చేసుకోబోతున్నారు ?" మొదలగు బర్నింగ్ ఇష్యూస్ మీద తెలుగు మీడియా ఎనర్జీ ని బర్న్ చేసుకోడం ఎబ్బెట్టుగా ఉంటుంది. లోకంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. నీళ్లు లేని,కరెంట్ లేని వాళ్ళు,ఉపాధి లేని వాళ్ళు,ఉంటానికి ఇల్లు లేని వాళ్ళు.....వాళ్ళకోసం చేతిలో మైక్ ఎట్టుకుని అధికారుల్ని,ప్రజా ప్రతినిధుల్ని నిలదీయండి. ఆమె చెంప మీద కొట్టడం దాన్ని ధోని స్టంప్స్ ని కొడితే చూపించినట్లు మాకు చూపించడం ఎందుకో !

అదే పని నాలాంటి సామాన్యుడు అలా చేస్తే మా బొక్కలు విరగదీయరు ! అసలు ఆ పని చేయగలమా ! లేనే లేదు. మరి మాకు ఎటువంటి ఉపయోగం లేని వారు మా రక్షక బటుల్ని ఎలా కొడతారు ? ఓహో.....మమ్మల్ని కొట్టినప్పుడు మేము కొట్టలేము కాబట్టి మాకోసం నాయకులు పోలీసు వారిని కొడుతున్నారా ??? ఓరోరి.....ఇలా కూడా ఉంటాదా. ఇదేదో బాగానే ఉంది లే. 

ఇదుగో మీడియా ఇక నుంచి అయిన కొంచం జనం కి కూసింత ఉపయోగపడే వార్తలని చెప్పండి. పబ్ న్యూస్,డ్రంక్ అండ్ డ్రైవ్ న్యూస్,హీరోయిన్ ప్రేమాయణాలు,మంచు ఇంట్లో అష్టచమ్మా, ఫేస్ టు ఫేస్ సవాళ్లు మాకొద్దు. ఇప్పటికే యూట్యూబ్ ఛానళ్ల ముందు సాటిలైట్ చానెళ్లు బొక్కబోర్ల పడ్డాయి. నాలాంటి బ్రేకింగ్ న్యూస్ బాధితులకు ఇది ఒకింత ఆనంద పడే విషయమే.

మొత్తానికి ఎవరిది తప్పు కాదు. ఎవరికి ఎవరు తీసిపోరు. మనం చూస్తూ ఛిల్ల్ అవడమే.


--- సమాప్తం ---


సామాన్యుడికి దూరం అవుతున్న రైలు బండి




Image source : Business Today.



మునుపెన్నడూ లేని విదంగా భారత రైల్వే వ్యవస్థ వార్తల్లో ప్రముఖంగా నిలుస్తుంది. స్వదేశీ గడ్డ మీద తయారైన వందేభారత్ రైళ్లను పట్టాల మీద పరుగులు పెట్టించడం డెబ్భై ఐదేళ్ల స్వాతంత్ర భారతానికి గర్వకారణం తో పాటు జాతి పితకి అసలైన నివాళి.

భారత రైల్వే వ్యవస్థ ని స్మృశించకుండా ఆధునిక భారత దేశ చరిత్ర ని సంపూర్తిగా తెలుసుకోలేము అనడం అతిశయోక్తి కాదు. సామాన్యుడి రధం గా ముద్ర పడిన రైలు బండి సంస్కరణ దిశగా పయనిస్తున్నప్పటికీ అది సామాన్యుడి కి అందనంత దూరంగా వెళ్తుంది అన్నది నేటి చేదు వాస్తవం.


విడదీయరాని అనుబంధం - భద్రతకు భరోసా:


బ్రిటిష్ వారి దోపిడీ కార్యక్రమం కోసం రైళ్లను ఆరంభించినప్పటికి కాలక్రమేన స్వాతంత్ర భారత సామాన్యుడికి జీవనానికి ఊతంగా నిలిచింది. నామమాత్రపు రుసుముల తో సుదూరపు ప్రయాణాలు సైతం రైలు ద్వార సులభమైంది. నేడు రోడ్ల పై ప్రయాణం అంటే ప్రాణాలతో చెలగాటం ఆడినట్లే. నెత్తురోడుతున్న రోడ్లు వాహన చోదకుల్లో తీవ్ర భయాందోళనలు రేకిత్తిస్తున్నాయి.ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) ప్రకారం ప్రపంచం లో జరిగే 10 రోడ్డు ప్రమాదాల్లో ఒకటి మన దేశంలో జరుగుతుంది అంటే మన దేశంలో రోడ్డు భద్రత ఎంత దీన స్థితిలో ఉందొ అర్థం చేసుకోవచ్చు. ఇటువంటి సంక్లిష్ట స్థితిలో రైల్వే వ్యవస్థ సురక్షిత ప్రయాణానికి ఊతంగా నిలిచింది.


నాణేనికి మరోవైపు:-


    ఒకవైపు వందే భారత్ రైళ్లు పట్టాల మీద పరుగులు పెడుతుంటే మరోవైపు భారత రైల్వే వ్యవస్థ లాభాల్లో అదే జోరు చూపిస్తుంది. ఇటీవల రైల్వేశాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం రైల్వే 2.40 లక్షల కోట్లు ఆదాయాన్ని ఆర్జించి  25% వృద్ధి ని నమోదు చేసింది. 2026 వ సంవత్సరానికి ముంబయి-అహ్మదాబాద్ మధ్య బులెట్ రైలు ప్రారంభానికి సంసిద్ధంగా ఉన్నట్లు ఇటీవల రైల్వే మంత్రి తేల్చి చెప్పారు.

ఇవి రైల్వే శాఖ యొక్క ఎదుగుదల సూచిస్తున్నప్పటికి పాసెంజర్ రైళ్లు,సిబ్బంది నియామక ప్రక్రియ తదితర విషయాల్లో మాత్రం తీవ్ర నిరాశ కలిగిస్తుంది. 


పాసెంజర్ రైళ్లు కనుమరుగు:-


నామమాత్రపు రుసుము తో సామాన్య ప్రయాణికులకు ఆసరాగా నిలిచిన పాసెంజర్ రైళ్లు కోవిడ్ పుణ్యమాన ఇప్పుడు వాటిల్లో ప్రయాణించాలి అంటే ఎక్స్ప్రెస్ రైలు రుసుము చెల్లించాల్సిందే.క్లుప్తంగా చెప్పాలి అంటే నాటి పాసెంజర్ రైళ్లు నేడు కనుమరుగు అయ్యాయి. తీవ్ర ద్రవ్యోల్బణంతో అల్లాడిపోతున్న వారికి గొడ్డలి పెట్టులాంటిది ఈ నిర్ణయం. ఒక సగటు పాసెంజర్ రైలు ఎంతో మందికి జీవన ఉపాది కల్పిస్తుంది. తిను బండారాలు అమ్మేవారు,నిత్యం పల్లెల నుంచి పట్టణాలకు వెళ్లే కార్మికులు మొదలగు అసంఘటిత రంగానికి వెన్నుదన్నుగా నిలిచింది. నేడు అది కనుమరుగు అవ్వడం వారి జీవనుపాధి  మీద తీవ్ర ప్రభావం చూపుతుంది.


గంటలకొద్దీ ఆలస్యం:-


రైలు ప్రయాణ రుసములు పెరగినప్పటికి పాసెంజర్ రైలులో ప్రయాణించే వారికి క్రాసింగ్ ఇబ్బందులు తప్పట్లేదు. ప్రత్యేక రైళ్లు,సూపర్ ఫాస్ట్ తదితర వాటికి మార్గం కొరకు స్టేషన్లలోనే నిలిపేస్తున్నారు. ఒక్కసారి ఆగితే మళ్ళీ బండి ముందుకు ఎప్పుడు కదిలిద్దో తెలీని పరిస్థితి.నిర్ణీత సమయానికి పాసెంజర్ రైళ్లు చేరుకున్న సందర్భాలు వేళ్ళ మీద లెక్కపెట్టవచ్చు.గంటలకొలది ఆలస్యంతో పాటు ఒక్కోసారి ముందస్తు సమాచారం లేకుండానే పాసెంజర్ రైళ్లను రద్దు చేయడం మొదలగునవి వీటి పట్ల పాలకులకు మరియు అధికారులకు ఉన్న శ్రద్ధాసక్తులను ప్రతిబింబిస్తుంది.


ఇదిలా ఉండగా రైల్వేస్టేషన్ లో రద్దీ నియంత్రణ లక్ష్యంగా రైల్వేశాఖ ప్లాట్ఫారం టికెట్ ధరలు అమాంతం పెంచింది. ఇది ఒకింత మంచి చేస్తున్నప్పటికీ వృద్దులు,దివ్యాంగుల సహాయార్థం గమ్యస్థానం స్టేషన్ కి వచ్చే వారికి ఇది భారంగా మారింది. ప్రయాణ టికెట్ కన్నా ప్లాట్ఫారం టికెట్ ధర ఎక్కువ ఉన్న సంగతులు విధితమే. దరిమిలా అసలు రైలు ప్రయాణం అంటేనే ప్రయాణీకులు నిట్టూర్పు విడిచే పరిస్థితులు తలెత్తాయి. మరోవైపు కోవిడ్ కి ముందు ఉన్న రాయితీలు సైతం ఇప్పుడు లేకపోవడం రైలు ప్రయాణం వృద్దలకు అదనపు భారంగా మారింది. ఇటీవల రైల్వే స్థాయి సంఘం సీనియర్ సిటిజన్స్ కి ఇచ్చే రాయితీని తిరిగి అందుబాటులో కి తీసుకురావాలి అని సిఫార్సు చేసినప్పటికీ రైల్వేశాఖ దానికి తిరస్కరిస్తూ ఇప్పటికే అన్ని వర్గాల ప్రయాణికులకు 50% పైగా రాయితీ ఇస్తున్నాం కాబట్టి అదనంగా రాయితీలు ఏం అవసరం లేదని తేల్చి చెప్పింది.పెరిగిన జీవన వ్యయం తో పాటు ఆరోగ్య ఖర్చులకు తోడు ఈ రాయితీ నిలుపుదల ఆయా వర్గాల ప్రజలకు ఇదొక పెను భారమే.


లాభాపేక్ష కన్నా ప్రజా ప్రయోజనాలకు ప్రాముఖ్యత ఇవ్వాలి:-


భారీ రుసములు తో ఒక వైపు ప్రజల నడ్డి విరుస్తూ మరో వైపు ఎన్ని కోట్లు ఆదాయం అర్జించిన లాభమేమి !  పేద, మధ్య తరగతి ప్రజల కొరకు రైల్వేశాఖ లాభాపేక్ష పక్కనపెట్టి రుసుములు అందుబాటులో ఉండేలా ప్రణాళికలు రచించాలు. రైల్వేశాఖ కు భారీగా ఆదాయాన్ని సమకూర్చే సరుకు రవాణా విభాగం మీద ఖర్చు భారం పెంచి పాసెంజర్ విభాగం లో రుసములు చౌకగా ఉండేలా విధానాలు రూపొందించాలి. వృద్దులకు రాయితీని పునరుద్ధరించాలి. తృతీయ స్థాయి ఆరోగ్య సేవల (tertiary health care services) కొరకు పల్లెల నుంచి మెట్రో నగరాలు రావాల్సి ఉంటుంది. రాయితీలు ఉంటే వారికి ఉపశమనం కలుగుతుంది.


హైదరాబాద్ మెట్రో లాంటి విజయవంతంగా నిర్వహింపబడుతున్న మెట్రోల నుంచి రైల్వేశాఖ వారు స్ఫూర్తి పొందాలి. మెట్రో రైలు లోకి టికెట్ లేకుండా ప్రవేశించడం అసాధ్యం.అటువంటి పటిష్ట వ్యవస్థల్ని భారత రైల్వేశాఖ ఆవలంభించాలి. తద్వారా అధిక రుసుములు వడ్డించకుండానే ఆదాయాన్ని పెంచుకునే అవకాశం ఉంటుంది. టికెట్ లేకుండా రైలు ప్రయాణం చేసే వారు కోకొల్లలు. కొన్ని రాష్ట్రాల్లో టికెట్ అడిగితే ఎక్కడ దాడి చేస్తారో అని సిబ్బంది భయపడే పరిస్థితి ఉంది.  ఇటువంటి వాటిల్లో ఇంకా సంస్కరణలు చేపట్టాలి. టెక్నాలజీ ని అందిపుచ్చుకుని టికెట్ లేని ప్రయానాణానికి అడ్డుకట్టవెయ్యాలి.


  మాజీ రైల్వేశాఖ మంత్రి సురేష్ ప్రభు నాటి రైల్వే బడ్జెట్ లో ప్రసంగిస్తూ రైల్వే ఆర్థిక స్థితి మెరుగుపడటానికి రుసుము పెంపు ఒక్కటే మార్గం కాదని ప్రకటనలు మొదలగు ఇతర మార్గాలు ఎన్నో ఉన్నాయి అని మంచి మార్గదర్శనం చేశారు.వాటిని నేటి శాఖ భాద్యులు, అధికారులు విస్మరించకుండా ఆచరణ లో పెట్టాలి. ప్రజా ప్రయోజనాలే పరమావధిగా పేద మధ్య తరగతి వారికి రైల్వే ప్రయాణం అందుబాటులో ఉండాలి. వందేభారత్ మరియు బులెట్ రైళ్లు ఆహ్వానించదగ్గవి ఐనప్పటికి వాటి మోజులో పడి ప్రస్తుతం ఉన్న రైళ్ళని విస్మరించవద్దు.

రైల్వే వ్యవస్థ లో ఎన్ని సంస్కరణలు వచ్చిన,ఎన్ని ఆవిష్కరణలు వచ్చినా రైలు ప్రయాణం అందరికి అందుబాటులో ఉంటేనే అసలు లక్ష్యం నెరవేరుతుంది.



-- సమాప్తం --