చెంప దెబ్బలు వారికి నొప్పి మనకు.

 

Image source: Google.

ప్రజాస్వామ్యం లో నాలుగో స్థంభం మాది అంటూ ఎదో సమాజానికి మంచి చేసే వారిలా మీడియా వారు పలికే ఉత్తరకుమార ప్రగల్బాలు అందరికి ఎరుకే. ఈరోజు ఉదయం నుంచి ఏ వార్త ఛానల్ పెట్టిన ,సోషల్ మీడియా తెరిచినా ఒకటే వార్త అదే పోలీస్ వారి చెంప మీద ఒక మహిళ నేత ఆమె తల్లి ఒకరి తర్వాత ఒకరు కొట్టడం. ఒకసారి చూపిస్తే చాలు కదా దాన్ని కూడా ఈ మైదా చానెళ్లు రింగు గుర్తు ,బాణం గుర్తు, స్లో మోషన్ పెట్టి మరీ చూపించడం చూస్తుంటే మన చెంప మనం కొట్టుకునేదాక ఆగేలా లేరేమో అనిపించింది. 

ఒకప్పుడు వార్తలు వేసి మధ్యలో ప్రకటనలు ఇస్తారు. వాటినే మేము "సుత్తి" అని పిలిచే వాళ్ళం. ఇప్పుడంటే ఇంగిలి పీసు సదివి advertisement అని మంచు మేడం గారిలా పలుకుతున్నాం అనుకోండి ! కాని ఇప్పుడు ఏది చూసిన సుత్తిలానే ఉంది. దీనికి కారణం ఆ సుత్తి చూసే మనమే. వాళ్ళు ఏం చూపెడుతున్నా నోరు ఎల్లబెట్టి చూస్తుంటే వారికి అంతకు మించి ఇంకేం కావాలి. "నరేష్-పవిత్ర లోకేష్ పెళ్లి ఎప్పుడు చేసుకోబోతున్నారు ?" మొదలగు బర్నింగ్ ఇష్యూస్ మీద తెలుగు మీడియా ఎనర్జీ ని బర్న్ చేసుకోడం ఎబ్బెట్టుగా ఉంటుంది. లోకంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. నీళ్లు లేని,కరెంట్ లేని వాళ్ళు,ఉపాధి లేని వాళ్ళు,ఉంటానికి ఇల్లు లేని వాళ్ళు.....వాళ్ళకోసం చేతిలో మైక్ ఎట్టుకుని అధికారుల్ని,ప్రజా ప్రతినిధుల్ని నిలదీయండి. ఆమె చెంప మీద కొట్టడం దాన్ని ధోని స్టంప్స్ ని కొడితే చూపించినట్లు మాకు చూపించడం ఎందుకో !

అదే పని నాలాంటి సామాన్యుడు అలా చేస్తే మా బొక్కలు విరగదీయరు ! అసలు ఆ పని చేయగలమా ! లేనే లేదు. మరి మాకు ఎటువంటి ఉపయోగం లేని వారు మా రక్షక బటుల్ని ఎలా కొడతారు ? ఓహో.....మమ్మల్ని కొట్టినప్పుడు మేము కొట్టలేము కాబట్టి మాకోసం నాయకులు పోలీసు వారిని కొడుతున్నారా ??? ఓరోరి.....ఇలా కూడా ఉంటాదా. ఇదేదో బాగానే ఉంది లే. 

ఇదుగో మీడియా ఇక నుంచి అయిన కొంచం జనం కి కూసింత ఉపయోగపడే వార్తలని చెప్పండి. పబ్ న్యూస్,డ్రంక్ అండ్ డ్రైవ్ న్యూస్,హీరోయిన్ ప్రేమాయణాలు,మంచు ఇంట్లో అష్టచమ్మా, ఫేస్ టు ఫేస్ సవాళ్లు మాకొద్దు. ఇప్పటికే యూట్యూబ్ ఛానళ్ల ముందు సాటిలైట్ చానెళ్లు బొక్కబోర్ల పడ్డాయి. నాలాంటి బ్రేకింగ్ న్యూస్ బాధితులకు ఇది ఒకింత ఆనంద పడే విషయమే.

మొత్తానికి ఎవరిది తప్పు కాదు. ఎవరికి ఎవరు తీసిపోరు. మనం చూస్తూ ఛిల్ల్ అవడమే.


--- సమాప్తం ---


No comments:

Post a Comment