బీసీల ను పట్టించుకునేది ఎవ్వరు ????

 


Pic:- answer given to parliament member.

టీవల పార్లమెంట్ లో  ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు సంబంధిత శాఖ  ఇచ్చిన సమాధానం చూసాక ఐఏఎస్,ఐపీఎస్ లాంటి  అల్ ఇండియా సర్వీసెస్ లో ఓబీసీ,ఎస్సి, ఎస్టీ వారి ప్రాతినిధ్యం ఎంత కింది స్ధాయి లో ఉందో ఆ గణాంకాలు అద్దం పట్టాయి.గత ఐదేళ్లలో జరిగిన ఆల్ ఇండియా సర్వీసెస్ నియామకాల్లో ఓబీసీ వారు కేవలం 15.92% మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

 

మీరు(ఓబీసీలు) అగ్ర వర్ణ కులాల ఆధిపత్యం నుంచి బయటపడి ఆత్మగౌరవం తో బతకాలి అంటే రాజకీయంగా, విద్య పరంగా ఉన్నత స్థితిలో ఉండాలి అంటూ అంబెడ్కర్ గారు బీసీలనుద్దేశించి నాడు దిశా నిర్దేశం చేశారు.  మన దేశం లో ఓబీసీల సంఖ్య దాదాపు సగం ఉన్నప్పటికి రాజకీయాల్లో ,ప్రభుత్వ కొలువుల్లో వారి ప్రాతినిధ్యం నామమాత్రమే.


మొండిచెయ్యి:-


జనాభా పరంగా ప్రజాస్వామ్య దేశంలో  నిర్ణయాత్మక శక్తిగా ఉన్న బీసీలు పదవుల అలంకరణ లో మాత్రం నామమాత్రంగానే మిగిలిపోయారు. పదవులు దక్కాలి అంటే అగ్ర వర్ణ కులస్తుల వెనుక నిలబడి వారి భజన చేస్తూ వారి ప్రాపకం పొందితే గాని సగటు బీసీ నాయకుడికి పదవులు దక్కే పరిస్థితి లేదు. అదృష్టం కలిసొచ్చి మంత్రి పదవులు దక్కినప్పటికి ప్రాధాన్యం లేని శాఖలను మోయాల్సిందే. ఇక ప్రభుత్వం లోని పరిపాలన విభాగం లో కూడా ఇదే తంతు. కీలక పదవులైన ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి, డిజిపి మొదలుగు స్థానాలు దాదాపు అందని ద్రాక్షనే. 


ముందు నుంచి మోకాలడ్డు:-


 తోటి ఎస్సి,ఎస్టీ వారు స్వాతంత్ర భారత్ తొలినాళ్ళలో నే రిజర్వేషన్లు పొందినప్పటికీ ఓబీసీలు అవి పొందటానికి చాలా ఏళ్ళు ఎదురు చూడాల్సి వచ్చింది. మండల్ కమిషన్ నివేదిక ఆధారంగా నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఓబీసీల రిజర్వేషన్ కల సాకారం చేసింది. దీనికొరకు అటు క్షేత్ర స్థాయిలోను, ఇటు న్యాయపరంగాను పోరాడాల్సివచ్చింది.1990ల్లో మండల్ వ్యతిరేక ఉద్యమం, 2006 లో రిజర్వేషన్ వ్యతిరేక ఉద్యమం మొదలగునవి  ఓబీసీల రిజర్వేషన్ కి వ్యతిరేకంగా పుట్టుకొచ్చిన ఉద్యమాలు. ఈ రిజర్వేషన్ల వలన మెరిట్ దెబ్బతింటుంది అంటూ ఆరోపణలు చేశారు. కాని నాడు రిజర్వేషన్లను వ్యతిరేకించిన వారే ఆర్థికంగా వెనుకబడిన వారికి ఈ డబ్ల్యూ యెస్.(EWS)  రిజర్వేషన్ వచ్చాక వాటి పై ఎటువంటి ఆందోళనలు,వ్యతిరేకత వ్యక్తం చేయకపోవడం గమనార్హం. ఇప్పటికీ ఇందిరా సహాని తీర్పు ప్రకారం రిజర్వేషన్లు 50% కి మించకూడదు అనే నిబంధన బీసీలు కోరుతున్న రిజర్వేషన్ శాతం పెంపు కు గుదిబండలాగా మారింది.


పేరుకే రిజర్వేషన్లు:- 


జనాభాకి తగినట్లుగా రిజర్వేషన్ శాతం లేకపోవడం వలన ఈ రిజర్వేషన్ల యొక్క ఉద్దేశం నెరవేరట్లేదు. సామాజికంగా,ఆర్డికంగా వెనుకబడిన తరగతులు అయినప్పటికీ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ కొలువుల భర్తీ కొరకు నిర్వహించే పరీక్షల రుసుములు మాత్రం జనరల్ కేటగిరీ వారితో సమానంగా ఉంటున్నాయి. బ్యాంక్ తదితర పరీక్షలు రాయాలి అంటే పరీక్ష రుసుములు వందల్లో చెల్లించాల్సిందే. మరోవైపు కట్ ఆఫ్ మార్కులు పరిశీలిస్తే ఓబీసీ వారికి, జనరల్ వారికి పెద్ద తేడా ఏముండదు. ఇంతకు ముందు వరకు జనరల్ కేటగిరీలో బాగంగా ఉన్న EWS వారి కట్ ఆఫ్ మార్కులు ఓబీసీ వారికంటే తక్కువ ఉండటం ఓబీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని అద్దం పడుతుంది. ఇటీవల యస్.యస్.సి (Staff selection commission) నిర్వహించిన కీలకమైన సి.జి.యల్ (combined graduates level) పరీక్షలో కట్ ఆఫ్ సరళి పరిశీలిస్తే జనరల్ వారితో సమానంగా ఉన్నాయి.దీంతో కార్యాలయాల చుట్టూ తిరిగి ఓబీసీ సర్టిఫికెట్ తీసుకుని పరీక్ష రాస్తే  లాభం ఏంటి అని అభ్యర్థులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.


బీసీ కులగణన:- 


     బీసీలు ఎదురుకొంటున్న సమస్యల పరిష్కారం బీసీల కులగణన తోనే మొదలు అవుతుంది. దీని పై ఈ మధ్య కాలం లో దేశ వ్యాప్తంగా చర్చ జరగడం శుభ పరిణామం.1931 తర్వాత బీసీల జనాభా గణాంకాలు అధికారికంగా సేకరించింది లేదు. మండల్ కమిషన్ ప్రకారం దాదాపు 52% ఉన్నారు. తొమ్మిది దశాబ్దాల క్రితం సేకరించిన బిసి జనాభా లెక్కలతో బిసిల ప్రాధికారత & సంక్షేమం  రూపొందించే ప్రభుత్వ విధానాలు, పధకాలు పేపర్ల మీద అద్భుతంగా అనిపించనప్పటికీ క్షేత్ర స్థాయిలో మాత్రం విఫలమవుతున్నాయి. సరైన పధకాలు,విధానాలు రూపకల్పన జరగాలి అంటే వాస్తవ గణాంకాలు అత్యవసరం. అంతటి కీలక సమాచారాన్ని సేకరించడానికి కేంద్ర ప్రభుత్వం మీన మేషాలు లెక్కించడం గర్హనీయం. రాజకీయ ప్రయోజనాల కోసం బీసీల ప్రయోజనాలు తాకట్టు పెట్టకుండ తక్షణమే ఈ విషయమై చర్యలు చేపట్టాలి.



రాజకీయాల్లో రిజర్వేషన్లు కల్పించాలి:- 


మండల్ కమిషన్ ద్వార బీసీలకు రిజర్వేషన్లు దక్కినప్పటికి అవి విద్య,ఉపాదికే పరిమితం. రాజకీయాల్లో వీరు ఆర్థికంగా,సామాజికంగా ఉన్నత వర్గాల వారితో పోటీ పడాల్సిందే. దీంతో రాజకీయంగా నిలదొక్కుకున్న బీసీ నేతలను వేళ్ళ పై లెక్కించొచ్చు. స్థానిక సంస్థలు ఎన్నికల రూపంలో ఈ కోరిక పార్శికంగా నేరవేరినప్పటికి రాష్ట్ర,జాతీయ స్థాయి చట్ట సభల్లో ప్రవేశానికి మాత్రం బి ఫామ్ పొందటం నుంచి ఎన్నికల్లో గెలిచే వరకు చెమటోడ్చాల్సిందే.దేశ జనాభాలో సగం ఉన్నప్పటికీ పార్లమెంట్ లో వీరి ప్రాతినిధ్యం ఇరవై శాతంకి మించట్లేదు. ఈ పరిస్దితి మారాలి అంటే రాజకీయాల్లో కూడా బీసీలకు రిజర్వేషన్లు కల్పించినప్పుడే సామాజిక న్యాయం వికసిస్తుంది.


 లోపించిన ఐక్యత:-


     కేంద్ర బిసి జాబితాలో దాదాపు 2,500 కులాలు ఉన్నాయి. కాని కేవలం 13 కులాలు మాత్రమే ఈ ఓబీసీరిజర్వేషన్ల ఫలాలు అందుకుంటున్నాయి. ఈ పరిస్థితి మారాలి అంటే బీసీ ఉప కులాల వర్గీకరణకు ఉద్దేశించిన జస్టిస్ రోహిణి కమిషన్ త్వరితగతిన నివేదిక ఇచ్చి,దాన్ని ప్రభుత్వం జాప్యం లేకుండా అమలు చేయాలి.బిసిలలో మేము ఎక్కువ,మీరు తక్కువ అనే భావనను తొలగి పోవాలి.  బిసి కులాల మధ్య ఐక్యత లోపించడం వారి ప్రయోజనాల సాధనలో అడ్డంకింగా మారింది.అందరూ సోదరా భావం తో ఒకే గొడుగు కిందకి వచ్చి బీసీ ల హక్కుల కై పోరాడాలి. ఇటీవల నారా లోకేష్  ఎస్సి,ఎస్టీ అట్రాసిటీ చట్టం వలె బిసిలకు సైతం వేధింపుల నుంచి సంరక్షణ కొరకు  ఒక బీసీ అట్రాసిటీ చట్టం తెస్తాం అని హామి ఇవ్వడం ఆహ్వానించదగింది. 


సంపద లోను వెనుకబాటే:-


తాజా గణాంకాల ప్రకారం బీసీల సంపద కలిగి ఉండటం లో కూడా వెనుకబడే ఉన్నారు.వారి చేతుల్లో ఉన్న సంపద కేవలం 20% లోపే. స్వతహాగా కుల వృత్తులను జీవనాదరంగా కలిగి ఉండటం తో సంపాదన కేవలం ఇళ్లు గడవడానికే సరిపోతుంది. ఇక పెద్ద చదువులు చదివించడానికి ఆర్థిక కారణాలు అడ్డుకాగా, చదువు కుంటే ఉన్నత స్థితికి చేరుకోవచ్చు అని చాటి చెప్పిన వారు తమ ఇళ్లల్లో లేకపోవడం కూడా మరొక కారణమే. ఈ కారణం చేతనే బీసీ లు పారిశ్రామికంగాను పెద్దగా ఎదగలేకపోయారు. 1991 ఆర్థిక సంస్కరణలు కూడా చేతి వృత్తులను,కుల వృత్తులను కోలుకోలేని దెబ్బ తీశాయి. చౌక విదేశీ ఉత్పత్తులు ఇస్తున్న పోటీకి నిల్వలేకపోయాయి.దరిమిలా బీసీల పరిస్థితి పెనం నుంచి పొయ్యిలో పడ్డట్టు అయింది.


                       ఒక నాయకుడికి పదవి వస్తే ఆ నాయకుడి  కులం మొత్తం ఉన్నత స్థాయికి వచ్చిన్నట్లు లెక్కలు వేయడం పరిపాటి అయింది. ప్రగతి అనేది ప్రతి ఇంట్లో జరగాలి. బిసి హక్కుల కోసం పోరాడుతున్నాం అని చెప్పుకునే వారు పదవుల కోసం ఉద్యమాలను నీరుగార్చవద్దు. హక్కులను పరిరక్షించుకుంటూ ,మరిన్ని హక్కుల సాధనకై శ్రమించాలి. ప్రభుత్వాలు ఇస్తున్న ప్రయోజనాలు వినియోగించుకుని యువత ఉన్నత విద్యను అభ్యసించాలి. రాబోవు తరాలు మరింత ఉన్నతంగా ఉండేలా ప్రణాళికలు రచించుకోవాలి. అధికార పార్టీలు రాజకీయ ప్రయోజనాలు పక్కన పెట్టి బీసీల దీర్ఘకాలిక డిమాండ్లను నెరవేర్చాలి.

అది జరిగిన నాడే బి.పి.మండల్ గారి ఆశయాలు నెరవేరతాయి.


-సమాప్తం-






No comments:

Post a Comment