ఆంధ్రప్రదేశ్‌లో ఎముకమజ్జ మార్పిడి సేవల లోటు

 


ఆంధ్రప్రదేశ్‌లో ఎముకమజ్జ మార్పిడి సేవల లోటు



తలసేమియా, సికెల్ సెల్ అనీమియా, అప్లాస్టిక్ అనీమియా, కొన్ని రకాల క్యాన్సర్ల చికిత్సకు సంజీవని ఎముకమజ్జ మార్పిడి (బోన్ మారో ట్రాన్స్‌ప్లాంటేషన్)గా పిలువబడుతుంది. జన్యుపర వ్యాధుల చికిత్సలో రాబోయే కాలంలో ఇది అత్యంత కీలక పాత్ర పోషించనుంది. ప్రస్తుతం ఇది దేశంలోని కొన్ని రాష్ట్రాలు, నగరాలకు మాత్రమే పరిమితమై ఉంది. ఖర్చుతో కూడిన వైద్యం కావడంతో పేద, మధ్యతరగతి ప్రజలు ఖర్చులు భరించలేక ప్రాణాలు కోల్పోతున్నారు.


ప్రస్తుతం ప్రజలు ఈ సేవలు పొందడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒక వైపు అధిక ఖర్చు, మరోవైపు వైద్యం కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది.


ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే — ఈ సేవలు ప్రస్తుతం ప్రధానంగా కార్పొరేట్ ఆసుపత్రులకే పరిమితమై ఉన్నాయి. ప్రభుత్వ సర్వజన ఆసుపత్రులలో ఈ సేవలు అందుబాటులో లేవు. మంగళగిరి ఎయిమ్స్‌లో ఈ చికిత్సను ప్రారంభిస్తామని జూన్ నెలలో ప్రకటించినా, ఇప్పటి వరకు ప్రారంభం కాలేదు.


ఎన్‌.టీ.ఆర్. వైద్య సేవల పథకంలో ఈ చికిత్సను అందించే ఆసుపత్రులు ఉన్నప్పటికీ, ప్రభుత్వం నిర్ణయించిన ప్యాకేజీ అమౌంట్ ₹11 లక్షలు (GO RT 694, dt. 11.11.2020)గా ఉంది. ఈ ధర ఐదేళ్లుగా సవరించబడలేదు. వైద్య ద్రవ్యోల్బణం సగటు 15% పరిగణనలోకి తీసుకుంటే ప్రస్తుతం ఈ ప్యాకేజీ కనీసం ₹18 లక్షలకు పెరగాలి.


కానీ పెంపు లేకపోవడంతో ఆసుపత్రులు అదనపు భారాన్ని రోగులపై వేయక తప్పడం లేదు. వాస్తవానికి ఈ చికిత్సకు కనీసం ₹15–40 లక్షల వరకు ఖర్చవుతుంది. అంటే ప్రభుత్వం నిర్ణయించిన ₹11 లక్షల ప్యాకేజీ అసలు సరిపోదు. తెల్ల కార్డు, హెల్త్ కార్డు కలిగిన వారు సైతం అదనపు భారాన్ని భరించాల్సిన పరిస్థితి.


ఈ భారాన్ని మోయలేని ప్రజలకు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రులలో ఈ సేవలు ఉచితంగా అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. లేకపోతే, GO RT 694లో పేర్కొన్న ప్యాకేజీ మొత్తాన్ని ప్రస్తుత వ్యయాలకు తగిన విధంగా సవరించాలి.



ఇతర రాష్ట్రాల ఆదర్శం:


తెలంగాణలోని నిమ్స్, ఎం.ఎన్.జె. క్యాన్సర్ ఆసుపత్రి, ఒడిశాలోని ఎస్‌.సి.బి. మెడికల్ కాలేజ్, పుదుచ్చేరిలోని జిప్మర్ (JIPMER) వంటి ప్రభుత్వ ఆసుపత్రులు ఈ సేవలను పేద ప్రజలకు ఉచితంగా అందిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఇలాంటి సదుపాయాలు అందించే చర్యలు ప్రభుత్వం తీసుకోవాలి.



దాతల సమాచార నిధి:


ఎముకమజ్జ మార్పిడి చికిత్సలో దాతల సమాచారం అత్యంత కీలకం. దాతల వివరాలు ముందుగానే అందుబాటులో ఉంటే చికిత్స త్వరగా ప్రారంభం అవుతుంది, ఖర్చు తగ్గుతుంది, ప్రమాదం తక్కువ అవుతుంది. దీనికోసం ప్రభుత్వం దాతల నమోదు కార్యక్రమాలు ప్రారంభించి, మౌలిక సదుపాయాలు, మానవ వనరులు అభివృద్ధి చేయడానికి నిధులు కేటాయించాలి.


మూలకణాల నిల్వ గురించి ప్రజల్లో అవగాహన పెంపొందించాలి. హెచ్‌ఐవీ, క్యాన్సర్ వంటి వ్యాధుల చికిత్సలో కూడా భవిష్యత్తులో ఈ మార్పిడి కీలక పాత్ర పోషిస్తుంది.


ప్రజల ఆరోగ్య భద్రతను పటిష్ఠం చేయాలంటే — ఈ సంజీవని వైద్యం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రులలో అందుబాటులోకి రావాలి. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి నాంది పడాలి.


తెలంగాణా లో ఈ విదంగా 👇👇👇


సమాప్తం.


No comments:

Post a Comment