నీట్ కుంభకోణం, ఆ తర్వాత వెను వెంటనే యూజీసీ నెట్ పరీక్షా పత్రం లీకేజీ వార్తలు చూసి సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు శభాష్...ఇన్నేళ్ల చరిత్రలో కేవలం ఒక్కసారి కూడా అక్రమాల ఆరోపణలు ఎదురుకోలేదు అంటూ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ని పొగడ్తలతో ముంచెత్తారు. కానీ గత మూడు నాలుగు రోజుల నుంచి అటు జాతీయ మీడియా ఇటు సోషల్ మీడియా లో ప్రొబేషనరి ఐఎఎస్ అధికారిణి తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సమర్పించి ఓబీసీ మరియు దివ్యంగుల కోట లో ఉద్యోగం సంపాదించింది అని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.దీనికి స్పందించిన కేంద్ర ప్రభుత్వం ఏక సభ్య కమిటీని నియమించింది.యూపీఎస్సినో లేదా ప్రభుత్వ ఇంటెలిజెన్స్ వర్గాలు వల్ల ఈ ఉదంతం బయటకి రాలేదు. తనకు సకల సౌకర్యాలు కావాలని సీనియర్ అధికార్లును ఒత్తిడి చేయడం, తన ప్రవర్తన మీద అనుమానం కలిగి తీగ లాగితే డొంక బయటలాడినట్లు ఈ వ్యవహారం బయటకు రావడం గమనార్హం. ఈ వ్యవహారం చూసాక ప్రజల్లో ముఖ్యంగా పోటీ పరీక్షల అభ్యర్థుల్లో యూపీఎస్సి మీద సైతం అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉండగా ఇక రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ల డొల్ల తనం గురించి ఎంత చెప్పినా తక్కువే.
అక్షరాస్యత ఎక్కువ ఉండే కేరళ లో ఆ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా వార్తల్లో ఉంది. ఒక వైద్యుడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో సభ్యత్వం పొందడం కోసం ఆ రాష్ట్ర అధికార పార్టీ నాయకుడికి లంచం ఇచ్చారు. తీరా అనుకున్న పని జరగకపోయే సరికి సదరు వైద్యుడు ఆ పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేయడంతో కేరళ పిఎస్సి కుంభకోణం వెలుగులోకి వచ్చింది. రాజ్యాంగ వ్యవస్థ రాజ్యాంగ పదవి ని సైతం డబ్బులతో కొనడానికి చేసిన ప్రయత్నం చూస్తే విస్మయానికి గురవ్వాల్సి వస్తుంది. ఇలా ఏ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చూసుకున్నా నిత్యం అక్రమాలు,అవినీతి తదితర ఆరోపణలతో వార్తల్లో ఉంటున్నాయి. తాజాగా అస్సాం,అరుణాచల్ ప్రదేశ్,ఛత్తీస్గఢ్ రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్లు ఇదే కోవలో ఉన్నాయి.
రక్షణ కుడ్యాలు:-
సుప్రీం కోర్ట్,ఎన్నికల సంఘం,కాగ్,యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లను రాజ్యాంగపు రక్షణ కుడ్యాలుగా అభివర్ణించారు రాజ్యాంగ నిర్మాత అంబెడ్కర్ గారు. ఇంతటి కీలక వ్యవస్థ అయిన పబ్లిక్ సర్వీస్ కమిషన్ల చైర్మన్,సభ్యుల నియామకం లోపభూయిష్టంగా ఉంది అనేది రాజ్యాంగం లోని 14వ భాగాన్ని చూస్తే ఇదే విషయం తేటతెల్లం అవుతుంది. సభ్యుల యొక్క అర్హతలు, నియమాలు మొదలగు కీలక అంశాలు రాజ్యాంగం లో పేర్కొనలేదు. రాజ్యాంగం విధించిన ఒకే ఒక్క నిబంధన ఏంటి అంటే సభ్యులలో సగం మంది కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వాల్లో కనీసం పదేళ్లు పని చేసి ఉండాలి.
మిగతా విషయాలును సంబంధిత ప్రభుత్వాల విచక్షణకే వదిలిపెట్టింది.అపరిమిత విచక్షణ అనార్దలకు దారితీస్తుంది అనేది విధితమే.
ఎన్నికల సంఘ సభ్యుల నియామకం కోసం ఏ విదంగా అయితే చట్టాలు తెచ్చారో అదేవిదంగా ఎంతో మంది నిరుద్యోగుల జీవితాలతో ముడిపడి ఉన్న ఈ వ్యవస్థల నియమాలను కూడా పకడ్బందీగా జరిగేలా చట్టాలు తేవాల్సిన అవసరం ఉంది.
రాజకీయ నాయకులకి పునరావస కేంద్రాలు:-
రాజ్యాంగం లో ఈ విషయానికి సంబంధించి ఉన్న లోపాన్ని దేశంలోని కొన్ని అధికార పార్టీలు తమకోసం పాటు పడిన వారికి అప్పనం గా ఆరేళ్ళ పదవి కాలం కలిగిన సభుత్వాలను ఇచ్చి తమ స్వార్ధ ప్రయోజనాలకు వాడుకుంటున్నాయి అనేది సభ్యుల నేపద్యం తదితర విషయాలు చూస్తే అనుమానం కలగక మానదు. ప్రస్తుత ఆంద్రప్రదేశ్ పబ్లిక్ కమిషన్ సభ్యుల నేపథ్యం గురించి వారు క్రితం అధికార పార్టీ ప్రస్తుత విపక్ష పార్టీ కి ఏ విదంగా సంబంధం కలిగి ఉన్నారో ఇటీవల ఒక ప్రధాన పత్రిక కథనాన్ని ప్రచురించింది.
ఇంటర్వ్యూలో మాయాజాలం :-
తాజా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గ్రూపు1 లో ఇంటర్వ్యూలలో అక్రమాలు జరుగుతున్నాయి, గ్రామీణ ప్రాంత అభ్యర్థులకు న్యాయం జరగాలని చెప్పి గ్రూపు1 కి ఇంటర్వ్యూలు ఉండకూడదు అని ఉపన్యాసాలు ఇచ్చి తీరా తూచ్....ఇంటర్వ్యూలు ఉంటాయి, క్రితం సారి తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నాం అంటూ జీవో విడుదల చేసి,మరుసటి రోజే 2022లో గ్రూప్1 నోటిఫికేషన్ ని విడుదల చేసారు. అక్రమాలు జరుగుతున్నాయి అని చెప్పి గ్రూప్1 ఇంటర్వ్యూలను తొలగించిన ప్రభుత్వం మరి తర్వాత ఈ ప్రాతిపదికన మరలా గ్రూప్ 1 ఇంటర్వ్యూలని పునరుద్ధరించారో చెప్పలేదు. ఎవరి ఒత్తిడి మీద నాటి ప్రభుత్వం ఈ పని చేసిందో కూసింత ఇంగిత జ్ఞానం ఉన్నవారికి తెలియక మానదు.
సభ్యుల నియామకం పటిష్టం గా జరగాలి. కొన్ని రోజుల క్రితం చల్లా శ్రీనివాసులు శెట్టి గారు పేరును ప్రభుత్వ రంగ అతిపెద్ద బ్యాంకు అయిన ఎస్బిఐ(sbi) తదుపరి చైర్మన్ గా ఎఫ్ఏస్ఐబీ (FSIB) ప్రతిపాదించింది. ఈ పోస్టుకు పలువురు వ్యక్తులను ముఖిక పరీక్షలు తదితర సామర్ధ్య పరీక్షలు నిర్వహించి పేరుని ప్రతిపాదించింది. క్యాబినెట్ నియామక కమిటీ ఆమోదం పొందితే మన తెలుగు వ్యక్తి ఎస్బీఐ కి చైర్మన్ అవ్వనున్నారు. కాని ఇటువంటి ప్రక్రియ మాత్రం రాజ్యాంగ సంస్థలకి ఇప్పటికి లేకపోవడం మన వ్యవస్థల్లో,పరిపాలన లో డొల్ల తనాన్ని తెలియజేస్తుంది.
2018 గ్రూప్1 నోటిఫికేషన్ లో ఉద్యోగాలు పొందిన వారి నియామకాలు చెల్లవు అని, వారు మరల మెయిన్స్ పరీక్ష రాయాలని మార్చి లో ఇచ్చిన తీర్పు ను చూసి పోటీ పరీక్ష ల అభ్యర్థులు నివ్వెరపోయారు.నోటిఫికేషన్ రావడం ఒక ఎత్తు, వచ్చాక సమర్థవంతం గా పరిక్ష నిర్వహణ,లోపాలు లేని ప్రశ్న పత్రాలు, సరితగిన కీ,త్వరితగతిన ఫలితాలు వెల్లడి,పోస్టింగులు మొదలు వాటిని లోపాల్లెకుండా పూర్తి చేయడం మరొక ఎత్తు. ఇవి పూర్తయ్యే దాకా పోటీ పరీక్షల అభ్యర్థులు దిన దిన గండమే. పరీక్ష ఎప్పుడు రద్దు చేస్తారో వచ్చిన ఉద్యోగం ఎప్పుడు తీస్తారో అనే అభద్రత భావంలో నిరుద్యోగలు ఉన్నారు. ప్రస్తుతం 2018 బ్యాచ్ గ్రూప్1 అధికారులు ప్రశాంతంగా తమ ఉద్యోగాలు చేసుకోలేని పరిస్థితి. నిజాయితీగా కష్టపడి తెచ్చుకున్న ఉద్యోగం ఎప్పుడు పోతుందో అని భయపడాల్సిన పరిస్థితి రావడానికి కారణం నాడు ఆంద్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ డిజిటల్ మూల్యాంకన గురించి తీసుకున్న కొన్ని నిర్ణయాలు.
తాజాగా గౌతమ్ సవాంగ్ appsc చైర్మన్ గా రాజీనామ చేశారు. అధికారం మారినప్పుడల్లా appsc చైర్మన్లకి తల నొప్పులు తప్పడం లేదు. నాడు ఉదయ భాస్కర్ నేడు గౌతమ్ సవాంగ్ లాగా మరొకరు ఇబ్బంది పడకుండా ఉండాలి అంటే త్వరలో appsc చైర్మన్ గా నియామకం విషయంలో చంద్రబాబు ప్రభుత్వంతగు చర్యలు తీసుకోవాలి.
- సమాప్తం -
No comments:
Post a Comment